AP: గుడ్డి రాతల ఈనాడు.. పీక్స్‌కు చేరిన బరి‘తెగింపు’

15 Jul, 2022 04:17 IST|Sakshi

‘బాబు’ హయాంలో పిండయిన కొండ  

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అక్రమ తవ్వకమంటూ ప్రచురణ 

సాక్షి ప్రతినిధి, కాకినాడ: తెలుగుదేశం పార్టీ తాన అంటే ఈనాడు తందాన అంటుంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించాలని ప్రయత్నించే చంద్రబాబు అండ్‌ కో ప్రయత్నాలను గుడ్డిగా అచ్చేస్తుంది. నిజానిజాల పట్టింపు లేదు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి పైనా తప్పుడు కథనాలను వండివార్చి ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఎంతకైనా బరితెగిస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తోంది. పదుగురూ నవ్వుకుంటారన్న సోయే ఉండదు. ఇందుకు నిదర్శనమే ఈ ‘చిత్రం’.  

అచ్చేసిందిదీ.. 
‘కొండలను కొల్లగొడుతున్నారు’ శీర్షికతో గురువారం ఈనాడు ప్రధాన సంచికలో  అభూతకల్పనలతో కూడిన ఈ ‘వార్తా చిత్రం’ ప్రచురించింది. ఇందులోని ఫొటో బుధవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌లోనిది. మైనింగ్‌లో కొండను తవ్వేయగా మిగిలిన పై భాగంలో ఉన్న చేతి పంపుతో కూడిన చిత్రం. కాకినాడ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి అక్రమ మైనింగ్‌కు నిలువెత్తు నిదర్శనమంటూ టీడీపీ ఈ ఫొటోను ప్రదర్శించింది.  దానినే ఈనాడు యథాతథంగా అచ్చేసింది. వైఎస్సార్‌సీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పెద్దాపురంలో కొండలను తవ్వేసి గ్రావెల్‌తో కోట్లు కొల్లగొడుతున్నారంటూ బురదజల్లే ప్రయత్నం చేసింది. 

వాస్తవం ఇదీ.. 
వాస్తవానికి 2018లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే పెద్దాపురంలోని కొండలను తవ్వేసి కోట్లు కొల్లగొట్టారు. బాబుకు అత్యంత సన్నిహితుడైన నాటి  హోంమంత్రి చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో కొండలను అడ్డగోలుగా తవ్వేశారు. చినరాజప్ప కనుసన్నల్లో కోనసీమకు చెందిన ఆయన అనుచరులు ఈ అక్రమ దందాకు పాల్పడి నాడు కొండలను తవ్వేశారు.

అందులో రామేశ్వరంమెట్ట చిత్రమిది. ఇది 2018లోనే సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకొచ్చింది. నాటి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కోట్లు కొల్లగొట్టేసిన వైనాన్ని తెలిపింది. దానిని ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి,  కాకినాడ సిటీ ఎమ్మెల్యే  చంద్రశేఖరరెడ్డికి ఆపాదించే  యత్నానికి ఒడిగట్టారు. ఈనాడు గుడ్డిగా అచ్చేసింది. 

మరిన్ని వార్తలు