విద్యుత్‌ చార్జీలపై అచ్చోసిన అబద్ధాలు 

23 Nov, 2022 03:46 IST|Sakshi

ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలను ఏడాదిలో మూడు సార్లు పెంచిందంటూ ‘ఈనాడు’ తప్పుడు కథనం 

నిజానికి ఏడాదిన్నరలో విద్యుత్‌ చార్జీలు పెంచింది ఒక్కసారే 

పైగా విద్యుత్‌ వాడకపోయినా కట్టాల్సిన నెలవారీ కనీస చార్జీల రద్దు 

2014–15 నుండి 2018–19 వరకు అప్పటి టీడీపీ తప్పుడు నివేదికతో వసూలు చేయని ట్రూ అప్‌ చార్జీలు 

సాక్షి, అమరావతి: విద్యుత్‌ చార్జీలపై అవే అబద్ధాలను పదేపదే రాస్తూ.. ప్రజలను మభ్యపెట్టేందుకు ‘ఈనాడు’ విశ్వప్రయత్నం చేస్తోంది. ఆ క్రమంలోనే ‘గుట్టుగా షాక్‌’ అంటూ మరో తప్పుడు కథనాన్ని పతాక శీర్షికన మంగళవారం ప్రచురించింది. తాను చెబుతున్న దానిలో ఏమాత్రం వాస్తవం లేదని తెలిసి కూడా పచ్చి అబద్ధాలను అచ్చోసి వదిలింది.

సర్దుబాటు చార్జీల పాపం గత ప్రభుత్వానిదేనని.. ఈ ప్రభుత్వంలో వినియోగదారులపై అదనపు భారం మోపకపోగా.. విద్యుత్‌ పంపిణీ సంస్థలను ఆదుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసినా వాటన్నిటినీ పక్కనపెట్టి పచ్చ పత్రిక అవాస్తవాలను పచ్చిగా వండి వార్చేసింది. ‘ఈనాడు’ విషపు రాతలపై తీవ్రంగా మండిపడిన ఇంధన శాఖ అసలు నిజాలను వెల్లడించింది.   

టెలిస్కోపిక్‌ విధానం వల్ల వినియోగదారులకు మేలు 
రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలో మూడుసార్లు విద్యుత్‌ చార్జీలను పెంచిందనడం పూర్తిగా అవాస్తవమని ఇంధన శాఖ పేర్కొంది. ఏడాదిన్నర కాలంలో విద్యుత్‌ చార్జీలను పెంచింది ఒకసారి మాత్రమేనని స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో గృహ విద్యుత్‌ వినియోగదారుల టారిఫ్‌ను హేతుబద్ధీకరించి ఒక ఉమ్మడి ఏక గ్రూపు టెలిస్కోపిక్‌ బిల్లింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు వివరించింది.

దీనివల్ల వినియోగదారులకు మొదటి స్లాబ్‌ రాయితీ ధరల ప్రయోజనం అందుతుందని వెల్లడించింది. గతంలో విద్యుత్‌ వాడకపోయినా నెలవారీ కనీస చార్జీలు కట్టాల్సి వచ్చేదని, ఈ సంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచి వాటిని రద్దు చేశారని తెలిపింది. దీని ప్రకారం సింగిల్‌ ఫేజ్‌ వారికి రూ.65, త్రీ  ఫేజ్‌  వినియోగదారులకు రూ.150 చొప్పున ప్రతినెలా మిగులుతోందని వివరించింది. ఇంధన శాఖ తెలిపిన మరిన్ని వాస్తవాలు ఇలా ఉన్నాయి.  

గత ఖర్చులను దాచి పెట్టడం వల్లే.. 
► ప్రస్తుతం విధిస్తున్న ట్రూ ఆప్‌ చార్జీలు గత ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ నిర్వహణ కోసం చేసిన వాస్తవ ఖర్చులను నిజాయితీగా బయటపెట్టకపోవడం వల్ల వచ్చినవే తప్ప ఇప్పటి ప్రభుత్వం విధించినవి కావు.  

► గత ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ రంగంలో జరిగిన వాస్తవ ఖర్చులను దాచిపెట్టి .. అన్ని నివేదికలలోనూ తక్కువ అంచనాలు చూపించారు. దానికి సంబంధించిన సర్దుబాటు కోసం అదనంగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.  

► డిస్కంలు నష్టాలను భరించడానికి చేసిన అప్పులపై గత ప్రభుత్వంలో ఒక్క రూపాయి వడ్డీ కూడా కట్టలేదు. ఆ అప్పులు తీర్చడానికి సంస్థలకు ఏవిధమైన ఆర్ధిక  సహాయం చేయలేదు. 

► 2014–15 నుంచి 2018–19 వరకూ (మూడవ నియంత్రణ కాలవ్యవధికి) ట్రూ అప్‌ చార్జీలను  రూ.3,977 కోట్లుగా విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) నిర్ధారించింది. ఉచిత వ్యవసాయ విద్యుత్‌ వినియోగం ఈ ట్రూ అప్‌ భారం రూ.1,066.54 కోట్లు కాగా.. దీనిని రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీగా మండలి పేర్కొంది. మిగిలిన మొత్తం ఇతర కేటగిరీ (వ్యవసాయం కాకుండా) వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాలని ఈఆర్‌సీ ఆదేశించింది.  
► వినియోగదారులపై ఒకేసారి ఆర్థిక భారం పడకుండా.. అందరి నుంచీ అభ్యంతరాలను తీసుకుని, వినియోగదారులు కోరినట్టు, దక్షిణ, మధ్య డిస్కంల పరిధిలో 36 నెలలు, తూర్పు డిస్కంలో 18 నెలలుగా వసూలు వ్యవధిని నిర్ధారించింది. ఇది ఆగస్టు బిల్లుల నుంచి అమలులోకి వచ్చింది.  
► ఈ ట్రూ అప్‌ చార్జీ  కూడా ఎక్కువేం కాదు. ఎస్పీడీసీఎల్‌లో యూనిట్‌కు రూ.0.22 పైసలు, సీపీడీసీఎల్‌లో రూ.0.23 పైసలు, ఈపీడీసీఎల్‌లో రూ.0.7 పైసలు మాత్రమే.  

ఈ ప్రభుత్వం రూ.47,530 కోట్లు చెల్లించింది 
► 2019–20 ప్రారంభం నాటికి గత ప్రభుత్వం విద్యుత్‌ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన సబ్సిడీ బకాయిలు, వివిధ విభాగాల విద్యుత్‌ వినియోగ చార్జీలు కలిపి దాదాపుగా  రూ.12,950 కోట్లు ఉన్నాయి. 

► రాష్ట్ర విభజన (2 జూన్, 2014) నాటికి రూ.12,500 కోట్లుగా ఉన్న కొనుగోలు బకాయిలు–నిర్వహణ వ్యయ రుణాలు గత ప్రభుత్వ హయాంలో 2019 ఏప్రిల్‌ 1 నాటికి రూ.31,844.13 కోట్లకు చేరాయి. 

► ప్రభుత్వం 2019 మే నుంచి 2022 సెప్టెంబర్‌ వరకూ సబ్సిడీ రూపంలో దాదాపు రూ.38,600 కోట్లను డిస్కంలకు ఇచ్చింది. వివిధ విభాగాల విద్యుత్‌ వినియోగ చార్జీల రూపంలో రూ.8,930 కోట్లు చెల్లించింది. ఇలా మూడున్నరేళ్లలో మునుపెన్నడూ  లేనివిధంగా మొత్తం రూ.47,530 కోట్లను విద్యుత్‌ పంపిణీ సంస్థలకు అందించింది. 

మరిన్ని వార్తలు