అప్పుడు ఒక్క వార్త రాయని ‘ఈనాడు’.. ఒక్క ప్రశ్న వేయని బాబు దత్తపుత్రుడు

13 Jul, 2022 03:53 IST|Sakshi

రామోజీ... అబద్ధాల సాగు!

అన్నదాతల అప్పులు... ఆత్మ హత్యలంటూ తప్పుడు కథనాలు

రైతులను ఆత్మహత్యలకు ప్రేరేపించేలా ‘ఈనాడు’ శవ రాజకీయాలు

బాబు హయాంలో భారీగా అప్పులు చేసి కునారిల్లిన రైతులు

ఈ ప్రభుత్వం ఆదుకోవటంతో మెల్లగా మామూలు స్థాయికి

అయినా నాటి అప్పులు తట్టుకో లేక కొందరి బలవన్మరణాలు

వారు కౌలు రైతులైనా... కుటుంబాలకు పరిహారమిస్తున్న ప్రభుత్వం

ఆత్మహత్య చేసుకున్న 471 మందికి పరిహారం ఎగ్గొట్టిన బాబు

ఒక్క వార్త రాయని ‘ఈనాడు’, ఒక్క ప్రశ్న వేయని బాబు దత్తపుత్రుడు

వారిక్కూడా రూ.5 లక్షల చొప్పున 23.55 కోట్లు చెల్లించిన సీఎం జగన్‌

తన హయాంలో పరిహారం రూ.5 లక్షల నుంచి 7 లక్షలకు పెంపు

కౌలు రైతులక్కూడా వర్తింపజేస్తూ ఆదేశాలు

ఏది నిజం ?

అన్నదాతల ఆత్మహత్యలతో రాజకీయాలా? దీన్ని శవాలపై పేలాలు ఏరుకోవటం కాక ఇంకేమనాలి రామోజీరావు గారూ? మీ చంద్రబాబును గద్దెనెక్కించడానికి మరీ ఇంతటి దారుణమైన మార్గాన్ని ఎంచుకోవాలా? అసలిప్పుడు నిజంగానే ‘అన్నదాత అప్పుల సాగు’ చేస్తున్నాడా? విత్తనాల నుంచి విక్రయం వరకూ ప్రభుత్వమే రైతును చేయిపట్టి నడిపిస్తుండటం నిజం కాదా? ఆర్‌బీకేల నుంచి ఈ–క్రాపింగ్‌ వరకూ మునుపెన్నడూ లేని స్థాయిలో వ్యవసాయానికి బాసటనివ్వటం నిజం కాదా? మరెందుకు ఈ రాతలు?  

ఎందుకంటే... ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ ముందుకెళుతోంది. చంద్రబాబునెవరూ నమ్మటం లేదు. దీంతో ‘ఈనాడు’ ఒక మాయా యుద్ధానికి దిగింది. లేని అంశాలను తెరపైకి తెచ్చి... ఒకటిరెండు ఉదాహరణలతో రాష్ట్ర ప్రజానీకం మొత్తాన్ని భయపెట్టడమే ఈ యుద్ధ వ్యూహం. దీనికి సహ సారథి చంద్రబాబు ఎటూ ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా ఆయన దత్తపుత్రుడు కూడా ఈ బృందంలో చేరాడు. కౌలు రైతులకు పరిహారం ఇవ్వటం లేదంటూ జిల్లాల వారీగా ఆయన చేస్తున్న యాత్రకు... ఇతోధికంగా సహకరించడానికి ‘ఈనాడు’ ఇలాంటి తప్పుడు వార్తలను వండి వార్చటం మొదలెట్టింది. ఇందులో నిజానిజాలేంటో చూద్దాం.... 

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాక్షాత్తూ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి అడుగుతున్న ప్రశ్న ఒక్కటే. కౌలు రైతులకు నష్టపరిహారం అందటం లేదని గగ్గోలు పెడుతున్న వారంతా... నిజంగా పరిహారం అందని కౌలు రైతును ఒక్కరినైనా చూపించమని!!. నిజానికి మునుపెన్నడూ ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో కౌలు రైతుల్ని గుర్తించడానికి ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. దానికింద నమోదు చేసుకున్న వారందరికీ సీసీఆర్‌సీ కార్డులు మంజూరు చేసింది.

మామూలు రైతులకు పట్టాలు ఎలాగూ ఉంటాయి. సీసీఆర్‌సీ కార్డు ఉండి... ఆత్మహత్య చేసుకున్న ఒక్కరికైనా పరిహారం రాలేదని నిరూపించమనేది ముఖ్యమంత్రి మాట. సీసీఆర్‌సీ కార్డులు సహా ఏమీ లేకుంటే... అలాంటి వారికి ఆత్మహత్య చేసుకున్నా సరే వైఎస్సార్‌ బీమా వర్తింపజేయాలన్న ముఖ్యమంత్రి సూచనలతో గతంలోనే ఈ మేరకు విధాన నిర్ణయం తీసుకున్నారు. దాంతో అందరికీ వైఎస్సార్‌ బీమా కింద రూ.లక్ష చొప్పున సహాయం అందుతోంది. ‘ఈనాడు’తో సహా విమర్శలు చేస్తున్నవారంతా... పరిహారం గానీ, బీమా గానీ అందని ఏ ఒక్కరినీ చూపించలేకపోతున్నారు. అందుకే మాయా యుద్ధానికి దిగుతున్నారు.  

చంద్రబాబు ఏం చేసినా కరెక్టే..!!! 
ఏ ప్రభుత్వమూ తన హయాంలో రైతులు గానీ, మరో వర్గం గానీ ఆత్మహత్యలు చేసుకోవాలనుకోదు. కాకపోతే తమ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు తక్కువ జరిగాయని చెప్పడానికి చంద్రబాబు నాయుడు ఓ దుర్మార్గమైన పద్ధతిని అనుసరించాడు. కౌలు రైతుల సంగతి సరేసరి!. పట్టాలున్న రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా... పరిహారం చెల్లించలేదు. ఐదేళ్ల కాలంలో కేవలం 450 మందికి తలా రూ.3.5 లక్షల పరిహారం చెల్లించి.. మరో రూ.1.50 లక్షల చొప్పున అప్పుల్లో సర్దుబాటు చేశారు. ఇలా.. ఐదేళ్లలో ఆయనిచ్చింది రూ.20.12 కోట్లు. మరో 471 మందికి రైతులకు పరిహారం ఇవ్వకుండా బకాయిపెట్టేశాడు. కౌలు రైతుల ఊసే లేదు. సరికదా పలువురు రైతుల ఆత్మహత్యల్ని నమోదు కూడా చేసుకోలేదు. విచిత్రమేంటంటే బాబు ఇన్ని దుర్మార్గాలు చేసినా అప్పట్లో రైతులు అప్పుల పాలైనట్లు గానీ, ఆత్మహత్యలు చేసుకున్నట్లు గానీ రామోజీరావుకు కనిపించలేదు. ‘ఈనాడు’లో అక్షరం ముక్క కూడా రాయలేదు. కౌలు రైతుల సంగతేంటని పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించలేదు కూడా!!.  

రైతుల కష్టాలు తెలిసిన మనిషిగా... తన ప్రభుత్వం వస్తూనే చంద్రబాబు ఎగ్గొట్టిన 471 మంది రైతులకూ రూ.5 లక్షల చొప్పున చెల్లించేలా ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. వారందరికీ రూ.23.55 కోట్లు చెల్లించారు. పైపెచ్చు కౌలు రైతులకు కూడా పరిహారం అందేట్టుగా ప్రత్యేక చట్టం తెచ్చారు. దానిప్రకారం వారిని నమోదు చేసుకుని సీసీఆర్‌సీ కార్డులు అందజేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకిచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. ఇలా 2019 నుంచి ఇప్పటి వరకు 850 మందికి రూ.7లక్షల చొప్పున రూ.59.50 కోట్లు చెల్లించింది. టీడీపీ హయాంలో మరణించిన వారిక్కూడా కలిపి మూడేళ్లలో మొత్తం 83.05 కోట్లు చెల్లించిదీ ప్రభుత్వం. మరి ఈ నిజాలను ఏమాత్రం ప్రస్తావించకుండా ‘ఈనాడు’ రాసే తప్పుడు వార్తలను ఏమనాలి? ఇది ఏమార్కు జర్నలిజం రామోజీరావు గారూ? 

‘ఈనాడు’ వార్తలో కనపడని నిజాలివీ... 
1. కన్నమ్మకు అండగా ప్రభుత్వం... 
ఈ ఫోటోలో కన్పిస్తున్న కన్నమ్మకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. వీరికి 60 సెంట్ల భూమి ఉంది. కూతురు పెళ్లి కోసం పదిహేనేళ్ల కిందట ఆమె భర్త రూ.2 లక్షలు అప్పు చేశాడు. ఆయన కూడా పదేళ్ల కిందట మరణించారు. 2016–18 మధ్యలో తన పెద్ద కుమారుడు ఏర్నినాయుడు వ్యవసాయం కోసం రూ.2 లక్షలు, మూడేళ్ల క్రితం కుటుంబ అవసరాల కోసం 50 సెంట్లు  భూమి తనఖా పెట్టి మరో రూ.2లక్షలు అప్పు చేశారు. ఇలా తండ్రి చేసిన అప్పు, తన అప్పు కలిసి వడ్డీతో రూ.10 లక్షలవడంతో తీర్చలేనేమోననే బెంగతో 2021లో ఏర్నినాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన 7 నెలల్లో జమైన రూ.7 లక్షల పరిహారంతో పెద్దల సమక్షంలో అప్పులన్నీ సర్దుబాటు చేసుకున్నారు. కన్నమ్మతో పాటు ఎర్నినాయుడు భార్య రమణమ్మకు, మాటలు రాని రెండో కుమారుడుకు పెన్షన్‌ వస్తోంది. తనకున్న 10 సెంట్లకు రూ.13,500 చొప్పున రైతు భరోసాతో పాటు వైఎస్సార్‌ చేయూత కింద రూ.18,750 చొప్పున మూడేళ్లుగా సాయం అందుతోంది. ఏర్నినాయుడు భార్యకు అమ్మవడి, ఆసరా వంటి సంక్షేమ ఫలాలూ అందాయి. వీటి ద్వారా కొద్దికొద్దిగా మిగిలిన అప్పులు తీరుస్తున్నారు. ‘ప్రభుత్వం ఇచ్చిన పరిహారం, సంక్షేమ పథకాల పుణ్యమాని అప్పులనుంచి బయటపడ్డాం. పిల్లలను చదివించుకో గలుగుతున్నాం’ అంటూ కన్నమ్మతో పాటు వీర్నినాయుడు భార్య రమణమ్మ చెబుతున్నారు. ‘ఈనాడు’ మాత్రం వీరి అప్పును మరికొంత పెంచి... అప్పులింకా మిగిలి ఉన్నాయంటూ నెపమంతా ప్రభుత్వం మీదికి నెట్టేలా వండి వార్చేసింది. 

2. పరిహారం వస్తే  రాలేదని రాతలా? 
కర్నూలు జిల్లా బెళగళ్‌ మండలం పలుదొడ్డికి చెందిన బోయ పద్మ భర్త లక్ష్మణ్‌ ఆత్మహత్య చేసుకున్న మాట వాస్తవమే. 4.94 ఎకరాలున్న లక్ష్మణ్‌... 2014–18 మధ్యలో ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.7.50 లక్షలు, 2018–19 సీజన్‌లో బ్యాంకులో రూ.1.90లక్షల అప్పు చేశారు. 2021లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదే ఏడాది త్రి సభ్య కమిటీ నివేదిక ఇవ్వటంతో పరిహారం రూ.7 లక్షలు ఇటీవలే పద్మ ఖాతాకు జమయింది. ఆమెకు పెన్షన్‌తో పాటు రైతు భరోసా, ఆసరా, వడ్డీ రాయితీ వంటి సంక్షేమ ఫలాలూ అందుతున్నాయి. ఇటీవలే 1.50 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేసిన మిగిలిన 3.44 ఎకరాల్లో పత్తితో పాటు ఇతర పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతోంది. 2019కి పూర్వం వ్యవసాయం కలిసి రాకపోవడంతో అప్పులు చేసి అవి తీర్చలేకపోయామని, దాంతోనే తన భర్త చనిపోయాడని పద్మ చెబుతోంది. పరిహారం రావటంతో బ్యాంకు రుణాన్ని, ఇతర వడ్డీలను సర్దుబాటు చేసుకున్నామని, పథకాలతో నిలదొక్కుకున్నామని చెబుతోంది.  

‘ఈనాడు’ మాత్రం ఈమెకు వైఎస్సార్‌ బీమా కింద రూ.లక్ష మాత్రమే వచ్చిందని పేర్కొది. బాబు హయాంలో ప్రయివేటు వ్యక్తుల దగ్గర చేసిన రూ.7.5 లక్షల రుణాన్ని, దాని వడ్డీలను ప్రస్తావించలేదు కూడా. ఇది పాత్రికేయమా... రాజకీయమా? మరీ ఇన్ని అబద్ధాలు వండి వార్చటమంటే పాఠకులను మోసం చేసినట్లు కాదా? ఇంతటి దౌర్భాగ్యపు రాతలెందుకు?  

3. పరిహారంపై  ఇక్కడా అబద్ధాలే... 
విశాఖ జిల్లా రాయవరం మండలం గెడ్డనపాలేనికి చెందిన పినపాత్రుని వరలక్ష్మికి కూడా ఇటీవలే పరిహారం మంజూరయింది. ఈమె భర్త పినపాత్రుని లోవరాజు కూడా టీడీపీ హయాంలో వరిసాగు కలిసిరాక భారీగా అప్పులు చేసి... ఆ భారాన్ని తట్టుకోలేక 2021లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల పరిహారం రాగా... వరలక్ష్మికి పెన్షన్‌తో పాటు ఇతర సంక్షేమ పథకాలూ అందుతున్నాయి. తమకున్న 1.85 ఎకరాల భూమిని కుటుంబ సభ్యుల సహకారంతో ప్రస్తుత ఖరీఫ్‌కు సిద్ధం చేస్తోంది. పరిహారంతో అప్పులు సర్దుబాటు చేశానని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని చెబుతోంది. 

‘ఈనాడు’ మాత్రం పరిహారం అందలేదని పేర్కొనటంతో పాటు... ఆమె భర్త టీడీపీ హయాంలో చేసిన అప్పులను ప్రస్తావించదు. పైపెచ్చు ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదన్న తరహాలో పచ్చి అబద్ధాలు!. ఇదీ ‘ఈనాడు’ మార్కు జర్నలిజం. 

మూడేళ్లలో 1.28 లక్షల కోట్ల లబ్ది...
► ఎన్నికల్లో ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తామని ఇచ్చిన హామికి మిన్నగా ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లకు రూ.67,500 పెట్టుబడి సాయం అందిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే మూడు విడతల్లో 52.38 లక్షల కుటుంబాల ఖాతాలకు నేరుగా రూ.23,875.29 కోట్లను ‘రైతు భరోసా’గా జమచేసింది.  
► రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్‌ ఉచిత పంటల బీమాను అమలు చేయటమే కాక... 6.19 లక్షల మందికి చెల్లించాల్సిన రూ.714.84 కోట్ల పాత బకాయిలతో కలిసి మూడేళ్లలో 44.28 లక్షల మందికి రూ.6,684.84 కోట్ల బీమా పరిహారమూ అందించారు.  
► లక్ష లోపు పంట రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన రైతులకు సీజన్‌ ముగియకుండానే వడ్డీ రాయితీ అందిస్తున్నారు. గత ప్రభుత్వం 46.81 లక్షల మందికి చెల్లించాల్సిన రూ.784.73 కోట్ల పావలా వడ్డీ బకాయిలతో కలిపి మూడేళ్లలో 65.65 లక్షల మందికి రూ.1282.11 కోట్ల వడ్డీ రాయితినీ చెల్లించారు. 
► విపత్తుల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునే లక్ష్యంతో రూ.2 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధిని ఏర్పాటు చేయడమే కాక సీజన్‌ ముగియకుండానే నష్టపోయిన ప్రతి ఎకరాకూ పెట్టుబడి రాయితీని అందిస్తున్నారు. ఇలా మూడేళ్లలో 19.94 లక్షల ఎకరాలకు సంబంధించి 17.61 లక్షల మంది రైతులకు రూ.1612.80 కోట్ల పెట్టుబడి రాయితీని అందించారు.  
► మూడేళ్లలో రూ.24,561 కోట్లు ఖర్చు చేసి 9 గంటల పాటు పగటి పూట నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తోంది.  
► 2019 మే నుంచి రూ.44,844.31 కోట్ల విలువైన ధాన్యంతో పాటు రూ.6903 కోట్ల విలువైన ఇతర పంటలను ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది ఈ ప్రభుత్వం. 
► 10,778 ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను అందించడమే కాక... ఆర్బీకేలకు అనుబంధంగా అద్దె ప్రాతిపదికన సాగు యంత్రాలు అందించేందుకు రూ.587.64 కోట్లతో 6781  కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు, 161.50 కోట్లతో క్లస్టర్‌ స్థాయి సీహెచ్‌సీలు ఏర్పాటు చేశారు. ఇటీవలే రూ.175 కోట్లతో 3800 ట్రాక్టర్లను సమకూర్చారు. 
► రూ.5715 కోట్లతో 2 లక్షల బోరు బావులు తవ్విస్తోంది.  
► కౌలురైతులకు రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేయడమే కాదు మూడేళ్లలో 15 లక్షల మంది కౌలురైతులకు సీసీఆర్సీ కార్డులు అందించారు. 8.29 లక్షల కౌలు రైతు కుటుంబాలకు రూ.5421 కోట్ల పంట రుణాలు అందించారు.  గత ప్రభుత్వం చెల్లించకుండా ఎగ్గొట్టిన రూ.19,709.20 కోట్ల బకాయిలను ఇప్పటి వరకు చెల్లించింది.  
► ఇలా మూడేళ్లలో నేరుగా రైతులకు రూ.1.28 లక్షల కోట్ల లబ్ది నేరుగా అందిస్తే... ఏనాడూ ప్రశంసకు సింగిల్‌ కాలమ్‌ కూడా కేటాయించకుండా... అబద్ధాల సాగుకు మాత్రం ముందుకు రావటం రామోజీకే చెల్లుతుంది!!. 

మరిన్ని వార్తలు