Fact Check: అభివృద్ధిని అడ్డుకోవడానికే..

25 Nov, 2022 05:04 IST|Sakshi

నోటీసులు ఇచ్చి.. అంగీకార పత్రాలు తీసుకున్నా దుష్ప్రచారమే 

గుంటూరులో ఒక్క ఇంటినీ కూల్చకున్నా బురద రాతలు  

నిబంధనల మేరకే రోడ్డు విస్తరణ పనులు

సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరుగుతున్నా విపక్షాలు అడ్డుకోవడమే అజెండాగా పని చేస్తున్నాయి. వాటికి ఎల్లో మీడియా వంత పాడుతోంది. తాజాగా గుంటూరులో రోడ్డు విస్తరణను ఎంచుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. గుంటూరు వన్‌టౌన్‌ –టూటౌన్‌ను అనుసంధానించే రహదారుల్లో శ్రీనగర్‌ డొంకరోడ్డు ఒకటి. అరండల్‌ పేట వద్ద ఉన్న శంకర్‌విలాస్‌ ఫ్లైఓవర్‌ ట్రాఫిక్‌ అవసరాలను తీర్చలేకపోవడంతో దీన్ని విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

సీఎం జగన్‌ రూ.130 కోట్లతో ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి ఆమోదం తెలుపడంతో అధికారులు విస్తరణ పనులు వేగవంతం చేశారు. ఇదిలా ఉండగా 2007లోనే ఈ రోడ్డు విస్తరణ కోసం ప్రతిపాదనలు సిద్ధం కాగా 2012లో మంజూరైంది. 2015లో అప్పటి టీడీపీ సర్కారు అమరావతి రోడ్డు నుంచి ఠాగూర్‌ విగ్రహం వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న స్థానికులకు నోటీసులు జారీ చేసింది. శ్రీనగర్‌ కాలనీ వైపు మాత్రమే రోడ్డును విస్తరించి అంతటితో వదిలేసింది. మిగిలిపోయిన చంద్రయ్యనగర్‌ వైపు విస్తరణకు ఇప్పుడు ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 

తొలగించింది గోడలనే..
చంద్రయ్యనగర్‌ వైపు 23 బీఫారం పట్టాలు, స్వాధీన పత్రాలున్న ఆస్తులు 18, పది ఆక్రమణలు ఉండగా, పది ఖాళీ స్థలాలున్నాయి. ఇందులో అంగీకార పత్రాలిచ్చిన పది ఇళ్లకు సంబంధించిన ప్రహరీ గోడలను మాత్రమే అధికారులు తొలగించారు. వీరిలో ఇద్దరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తొలగించుకున్నారు. అధికారులు నెల రోజులుగా వారితో చర్చలు జరిపారు. అంగీకార పత్రాలు ఇచ్చిన పది ఇళ్ల ప్రహరీ గోడలు తొలగిస్తామని ముందు రోజు కూడా చెప్పారు.

ఇందుకు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. అయితే ఆక్రమణ స్థలాల్లో ఉన్న వారిని స్థానిక టీడీపీ నేతలు రెచ్చగొట్టి తీసుకొచ్చి ఆందోళన చేయించారు. ఒక్క ఇల్లు కూడా పడగొట్టకపోయినా తప్పుడు ప్రచారం చేశారు. కాగా, రోడ్డు విస్తరణలో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు ఇప్పటికే ప్రకటించారు. నిబంధనల మేరకే పనులు చేపట్టామని మున్సిపల్‌ కమిషనర్‌  చేకూరి కీర్తి స్పష్టం చేశారు. 

ఆయన చెప్పినందుకే అలా చేశా
ఓ పసుపు చొక్కా వ్యక్తి మా దగ్గరకు వచ్చి పొక్లెయిన్‌ తొట్టిలో కూర్చోమంటే కూర్చున్నా. జగన్‌ నాకు కొడుకులాంటోడు.. నాకు ఇంటి పట్టా ఇప్పించాడు. రూ.18 వేలు డబ్బులు ఇప్పించాడు. మాకు నష్ట పరిహారం ఇస్తామని అధికారులు చెప్పారు. 
– పర్రె జయమ్మ, చంద్రయ్యకాలనీ  

మరిన్ని వార్తలు