బాబుకు స్క్రిప్టు కోసమే! మనబడి నాడు–నేడుపై ‘ఈనాడు’ కబోది కథనం

19 Feb, 2023 04:05 IST|Sakshi

వైఎస్సార్స్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ.వేల కోట్లతో సకల వసతులు 

మొదటి దశ కింద రూ.3,669 కోట్లతో 15,713 స్కూళ్లలో అభివృద్ధి పనులు పూర్తి 

రెండో దశలో రూ.8 వేల కోట్లతో 22,344 స్కూళ్లలో అభివృద్ధి కార్యక్రమాలు 

ఇందులో ఇప్పటికే రూ.3,750 కోట్లు విడుదల 

ఈ వాస్తవాన్ని ఎందుకు చెప్పలేదు రామోజీ? 

రూ.వెయ్యి కోట్ల బిల్లులు బకాయిలుంటే పనులన్నీ ఆగిపోయినట్లా? 

దశల వారీగా బిల్లులు విడుదలవుతాయని తెలియదా? 

తప్పుడు రాతలతో కాంట్రాక్టర్లలో భయం పెంచడమే మీ ఉద్దేశం 

వారు పనులు చేయకుండా ఆపేయాలన్నది మీ కుట్ర 

చంద్రబాబు పాలనలో కనీస వసతులు కరువైతే ఒక్క మాట రాయలేదేం?  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లు బాగు పడుతుంటే ఆనందించాల్సింది పోయి.. అదెక్కడ టీడీపీ కొంప ముంచుతుందోనని ‘ఈనాడు’ పనిగట్టు­కుని తప్పుడు రాతలు రాస్తోంది. కార్పొరేట్‌ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను సకల వసతులతో తీర్చిదిద్దుతుండటం కళ్లెదుటే కనిపిస్తున్నా, లేదు లేదంటూ ప్రజల్లో విష బీజాలు నింపడానికి విఫలయత్నం చేస్తోంది.

నాడు–నేడు రెండో దశ కింద ఏకంగా 22,344 స్కూళ్లలో పనులు జరుగుతుంటే.. అక్కడెక్కడో పనులు ఆగిపోయాయని యాగీ చేస్తోంది. చంద్రబాబు హయాంలో కనీసం చాక్‌పీస్‌లకు కూడా గతిలేని వైనాన్ని మరచిపోయి.. ఇప్పుడు తగుదునమ్మా అంటూ కోడి గుడ్డుపై ఈకలు పీకుతోంది. వేల కోట్ల రూపాయలతో ఊరూరా ప్రభుత్వ స్కూళ్లలో పనులు జరుగుతుండటం ప్రత్యక్షంగా కనిపిస్తున్నా కూడా దిగజారుడు రాతలు రాస్తోంది.

ప్రజలేమనుకుంటారోనన్న భయం లేకుండా తన చంద్రబాబుకు లబ్ధి చేకూర్చాలని ఉవ్విళ్లూరుతూ రోజుకో రీతిలో తప్పుడు కథనం ద్వారా ప్రభుత్వంపై బురద చల్లుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగం అనూహ్య రీతిలో అద్భుత ఫలితాలిస్తోందని వేనోళ్లా ప్రశంసలు వ్యక్తమవుతుండటాన్ని జీర్ణించుకోలేని రామోజీ రావు ఏదో ఒక రీతిలో ప్రభుత్వ ప్రతిష్టను మసకబారేలా చేయడమే పనిగా పెట్టుకుని ముందుకు వెళుతుండటం స్పష్టంగా కనిపిస్తోంది.

‘నాడు–నేడుకు నిధుల్లేవ్‌’ అంటూ తాజాగా తన అక్కసు వెళ్లగక్కింది. ఒక్క అధికారితో మాట్లాడకుండా, విద్యా శాఖ నుంచి వివరాలు తీసుకోకుండా తనకు తోచిన లెక్కలతో బాబుకు స్క్రిప్టు అందిస్తోంది. 

ఆరోపణ:  నాడు–నేడుకు నిధులు లేవు 
వాస్తవం: ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలుగా తీర్చిదిద్దేలా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. పేదల బతుకులు మార్చే ఏకైక సాధనం విద్య మాత్రమే అని బలంగా విశ్వసించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు సమూలంగా మార్చే నాడు–నేడు కార్యక్రమంతో పాటు, మరెన్నో సంస్కరణలు, గొప్ప గొప్ప మార్పులు తీసుకువచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌ అవతరించాక ప్రభుత్వ విద్యా రంగంపై ఇంతటి వ్యయం కాని, దృష్టి కాని ఎన్నడూ.. ఎవ్వరూ పెట్టలేదు. మన బడి నాడు – నేడు మొదటి దశలో రూ.3,669 కోట్లతో 15,713 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టి, 2021–22లో పూర్తి చేశారు. 2021–22లో 22,344 విద్యా సంస్థల్లో రూ.8,000 కోట్లతో రెండవ దశ పనులు చేపట్టారు.  

విద్యా రంగం నాడు–నేడు ఇదీ పరిస్థితి 
► గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–2019 మధ్య ఐదేళ్లపాటు పాఠశాలల్లో అభివృద్ధి కోసం రూ.1,709.64 కోట్లు మాత్రమే కేటాయించారు. అవీ పూర్తిగా ఖర్చు చేయలేదు. ఉదాహరణకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2014–2019 వరకు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరచడానికి ఐదేళ్ల కాలంలో నాటి ప్రభుత్వం రూ.76.85 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. ఈ ప్రభుత్వం వచ్చాక నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా ఫేజ్‌–1, ఫేజ్‌–2లో చిత్తూరు జిల్లాకు ఏకంగా రూ.1,133.09 కోట్లు కేటాయించింది. ఫేజ్‌ –1 కింద ఇప్పటికే పనులు పూర్తయ్యాయి.  

► రూ.668 కోట్లతో ట్యాబులను, రూ.778 కోట్ల విలువగల బైజూస్‌ కంటెంట్‌తో ఎనిమిదో తరగతి చదివే 4,59,564 మంది విద్యార్థులకు, 59,176 మంది ఉపాధ్యాయులకు ఈ విద్యా సంవత్సరం పంపిణీ చేశారు.  

► 5,800 పాఠశాలలకు 6వ తరగతిపైన ఉన్న 30,302 తరగతి గదులకు డిజిటల్‌ బోర్డు (ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌) 2023 జూన్‌ నాటికే అందించేలా సన్నాహాలు చేపట్టారు. దిగువ తరగతులు ఉన్న స్కూళ్లకు అంటే, ఫౌండేషన్, ఫౌండేషన్‌ ప్లస్‌ పాఠశాలలలో 10 వేల స్మార్ట్‌ టీవీలను అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 

► పిల్లల చదువుకు తల్లిదండ్రుల పేదరికం అడ్డు రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘జగనన్న అమ్మఒడి’ అనే వినూత్న పథకాన్ని అమలు చేస్తోంది. ఈపథకం కింద అర్హులైన తల్లులు, సంరక్షకులకు ఏటా రూ.15 వేల చొప్పున అందిస్తోంది. 2019–20లో 42,33,098 మంది, 2020–21లో 44,48,865, 2021–22లో 43,96,402 మంది తల్లులకు సాయం అందించారు. 

► రాష్ట్రంలోని లోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం విద్యా బోధనను ప్రవేశ పెట్టారు. 1 నుంచి 6 తరగతుల వరకు పాఠ్య పుస్తకాలను ఆంగ్లం, తెలుగు మాధ్యమంలో, ద్విభాషా విధానంలో రూపొందించారు. 1 నుంచి 5 తరగతుల వరకు పాఠ్య పుస్తకాలతో పాటు వర్క్‌ బుక్‌ లను ప్రవేశపెట్టారు.  

► ఆంగ్ల భాషలో నైపుణ్యం పెంచడం కోసం ప్రాథమిక స్థాయిలో 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు చిత్రాలతో కూడిన డిక్షనరీ ఇస్తున్నారు. 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ ఇస్తున్నారు. విద్యార్థులకు మిర్రర్‌ ఇమేజ్‌లో ద్విభాషా పాఠ్య పుస్తకాలను అందిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్‌ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు.

ఇంతకుముందు 3, 4, 5 తరగతులకు ఇంటర్మీడియట్, డీఎడ్‌ మాత్రమే విద్యార్హతలుగా ఉన్న ఉపాధ్యాయులు బోధించేవారు. ఇప్పుడు, ఈ  తరగతులకు బీఎస్సీ, బీఈడీ అర్హతలున్న ఉపాధ్యాయులతో బోధన చేయిస్తున్నారు. ప్రభుత్వం 10,114 మంది సబ్జెక్ట్‌ టీచర్లను ఏర్పాటు చేసింది.  

► జగనన్న విద్యా కానుక కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు రు.2323.99 కోట్లు ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థికి స్కూలు ప్రారంభం రోజు 3 జత­ల బట్టలు, షూస్, బెల్ట్, స్కూల్‌ బ్యాగ్, డిక్షనరీ, టెక్స్‌ బుక్స్, తదితరా­ల­ను ఇస్తోంది. 2016–17లో ప్రభుత్వ బడులలో 37,57,474 విద్యార్థులు ఉండగా, ఈ కార్యక్రమాలన్నింటి వల్ల విద్యార్థుల సంఖ్య బాగా పెరుగుతోంది. 

ఆరోపణ: రంగులు వెలుస్తున్నాయి 
వాస్తవం: పనులే జరగలేదని చెబుతున్న ఈనాడు రంగులు వెలిసిపోతున్నాయని చెప్పడం విడ్డూరం. ప్రభుత్వ పాఠశాలల్లో రన్నింగ్‌ వాటర్‌తో టాయిలెట్లు, తాగునీటి సరఫరా, చిన్న, పెద్ద మరమ్మతులు, ఫ్యాన్లు, ట్యూబ్‌ లైట్లతో విద్యుదీకరణ, ప్రహరీ, ఫర్నీచర్, క్యాంపస్‌ మొత్తానికి పెయింటింగ్, గ్రీన్‌ బోర్డు, ఇంగ్లిష్‌ ల్యాబ్‌ (స్మార్ట్‌ టీవీలు), కిచెన్‌ షెడ్లు, అదనపు తరగతి గదులు, డిజిటల్‌ తరగతులు (ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెళ్లు, స్మార్ట్‌ టీవీలు) ఇలా 12 రకాల సదుపాయాలను కల్పిస్తోంది. వేలాది స్కూళ్లలో ఇంతగా మేలు చేస్తుండటం రామోజీరావుకు కనిపించడం లేదు కాబోలు. రంగులు ఎక్కడ వెలిసిపోయాయో చెప్పకుండా, చూపకుండా ఆవు కథ రాశారు.  

ఆరోపణ : రూ.1,000 కోట్ల చెల్లింపులు ఆగిపోయాయి 
వాస్తవం: మన బడి నాడు – నేడు రెండవ దశ కింద రూ.8,000 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు రూ.3,750 కోట్లు విడుదల చేశారు. దశల వారీగా నిధులు విడుదలవుతాయనే కనీస పరిజ్ఞానం లేని వారెవరూ ఉండరు. ఈనాడు చెబుతున్న రూ. వెయ్యి కోట్ల చెల్లింపులు గత నెలవి అయ్యుంటాయి. అవి ఈ నెలలోనో.. వచ్చే నెలలోనో విడుదలవుతాయి. రూ.8 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నప్పుడు రూ.వెయ్యి కోట్లు పెండింగ్‌లో ఉంటే.. మొత్తం నాడు–నేడు కార్యక్రమమే ఆగిపోయినట్లు తప్పుడు రాతలు రాయడం చంద్రబాబు కోసమే కదా! ఆ తప్పుల తడక చిట్టా పట్టుకుని చంద్రబాబు ఊదరగొట్టాలనేగా! ఈ లెక్కన బిల్లులు రావని కాంట్రాక్టర్లలో భయం పెంచి, ఎలాగైనా సరే ఆ పనులు ఆపేయించాలన్నది రామోజీ పన్నాగం అని స్పష్టమవుతోంది. ఇది నిజం కాకపోతే రూ.3,750 కోట్లు చెల్లించారనే వాస్తవాన్ని ఎందుకు రాయలేదు రామోజీ? 

ఆరోపణ : విద్యార్థుల అవస్థలు  
వాస్తవం: పెద్ద ఎత్తున్న పనులు జరుగుతున్నప్పుడు అక్కడక్కడ చిన్న పాటి అసౌకర్యాలు సహజం. దాన్ని కూడా భూతద్దంలో చూపడం దారుణం. ఈనాడు చెబుతున్నట్లు రాష్ట్రంలోని పాఠశాలలన్నింటిలోనూ పిల్లలు ఇబ్బంది పడటం లేదు. చంద్రబాబునాయుడి ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ పాఠశాలలను గాలికి వదిలేసినా, తూతూమంత్రంగా నిధులు విదిలించినా ఒక్క మాటా రాయని ఈనాడు నేడు వేల కోట్లతో అన్ని విద్యా సంస్థలనూ సర్వాంగ సుందరంగా మారుస్తున్న ప్రభుత్వంపై దుష్ప్రచారం సాగిస్తోంది.   

>
మరిన్ని వార్తలు