ఆ విధ్వంసం.. బాబు బ్రాండే! 

26 Jul, 2022 04:10 IST|Sakshi

పోలవరంపై ఐఐటీ హైదరాబాద్‌ నిపుణుల నివేదిక సారాంశమిదే 

2014–19 మధ్య ప్రణాళిక లేకపోవటం వల్లే ఇదంతా జరిగినట్లు తేల్చిన నివేదిక 

ఏది ముందు–ఏది వెనక అనేది పద్ధతి ప్రకారం నిర్మించకపోవటం వల్లే సమస్య 

ఇంత స్పష్టంగా చెప్పినా... ఆ తప్పంతా సీఎం జగన్‌పైకి నెట్టేస్తూ దుష్టచతుష్టయం దుష్ప్రచారం 

అందులో భాగంగానే ‘పోలవరంలో విధ్వంసం’ అంటూ అసత్య కథనం అచ్చేసిన ఈనాడు 

స్పిల్‌ వే, ఎగువ కాఫర్‌ డ్యామ్‌ కట్టకుండా డయాఫ్రమ్‌ వాల్‌ పూర్తి చేయించింది చంద్రబాబే 

నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూనే కాఫర్‌ డ్యామ్‌లు కట్టాలన్న పీపీఏ, సీడబ్ల్యూసీ 

పునరావాసం కల్పించలేక.. కాఫర్‌ డ్యామ్‌లలో ఇరువైపులా ఖాళీ పెట్టి చేతులెత్తేసిన చంద్రబాబు 

ఏది నిజం?

తప్పు ఎవరు చేసినా ఎత్తిచూపడం నిఖార్సయిన జర్నలిజం. తప్పు చేసింది తనవాడైతే... దాన్ని కూడా ఎదుటివాడిపైకి నెట్టేయడం రామోజీ మార్కు పాత్రికేయం! కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు చేసిన విధ్వంసాన్ని... ప్రస్తుత ప్రభుత్వంపైకి నెడుతూ ‘ఈనాడు’ రాసిన రాతలే దీనికి తార్కాణం. కమీషన్లే పరమావధిగా పోలవరం కోసం ఏకంగా రాష్ట్ర ప్రత్యేక హోదాను కూడా తాకట్టుపెట్టిన చంద్రబాబు... వారికి దార్శనికుడయ్యాడు. ప్రాజెక్టు పనులను ఈపీసీ పద్ధతిలో దక్కించుకున్న ట్రాన్స్‌ట్రాయ్‌ని మార్చేసి వాటిని రామోజీ బంధువుల కంపెనీకి కట్టబెడితే శెహబాష్‌ అన్నారు. ఐదేళ్లపాటు కమీషన్లే పరమావధిగా వ్యవహరించి ప్రాజెక్టును జీవచ్ఛవంలా మార్చేస్తే... శరవేగంగా పోలవరం పూర్తవుతోందంటూ బాకాలూదారు. ఇదీ... ఎన్ని దుర్మార్గాలు చేసైనా ఈ రాష్ట్రాన్ని తమవాడే ఏలాలనుకునే ఎల్లో మీడియా నిర్వాకం. అధికారంలో ఉన్న చివరి 31 నెలల్లో కనీసం ఒక తట్ట మట్టి కూడా ఎత్తని చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క అక్షరం కూడా రాయని ఈ పాత్రికేయ విషవృక్షాలు... ఇప్పుడు తప్పంతా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదేనంటూ పథకం ప్రకారం చేస్తున్న దుష్ప్రచారంలో అసలు లేశమాత్రమైనా నిజముందా? ఇదిగో చూద్దాం... 

విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. 2014, ఏప్రిల్‌ 1నాటికి మిగిలిన  నీటిపారుదల విభాగం వ్యయాన్ని వంద శాతం భరించి పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం 2014, మే 24న పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)ను ఏర్పాటు చేసింది. విభజనకు ముందే పోలవరం జలాశయం పనులను 2012లో ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ ఈపీసీ విధానంలో రూ.4,054 కోట్లకు దక్కించుకుంది. నాటి టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ని అడ్డుపెట్టుకుని.. దోచుకోవడం కోసం 2014, జూన్‌ 8న సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కేంద్రాన్ని కోరుతూ వచ్చారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్సూచిలా ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టేందుకు చంద్రబాబు సిద్ధమవడంతో.. 2016, సెప్టెంబరు 7న అర్ధరాత్రి ఆర్థిక సహాయం ప్రకటించిన దాంట్లోనే పోలవరం నిర్మాణ బాధ్యతలను కూడా రాష్ట్రానికే కేంద్రం అప్పగించింది. 2014, జూన్‌ 8 నుంచి 2016, డిసెంబర్‌ 30 వరకూ పోలవరం జలాశయం పనుల్లో తట్టెడు మట్టెత్తకున్నా ‘ఈనాడు’ నేతృత్వంలోని ఎల్లో మీడియా ఏమాత్రం పట్టించుకోలేదు. 

పోలవరం ప్రాజెక్టు ప్రణాళిక ప్రకారం... తొలుత గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌ వే, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేయాలి. 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాలి. ఆ తరవాత ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌కు పునాది అయిన డయాఫ్రమ్‌ వాల్‌ పనులు చేపట్టి.. ఆ తర్వాత డ్యామ్‌ పూర్తి చేయాలి. ఇదీ పద్ధతి. కానీ.. చంద్రబాబు ఏం చేశారో తెలుసా? కమీషన్లు వచ్చే పనులపైనే దృష్టి పెట్టారు.

నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తే తమకు కమీషన్లు ఇచ్చేదెవరనుకుని ఆ వంక చూడనే లేదు. స్పిల్‌ వే పునాది స్థాయి దాటకున్నా సరే.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పునాది డయాఫ్రమ్‌ వాల్‌ పనులను పూర్తి చేయించారు. ఆ తర్వాత 2,840 మీటర్ల పొడవు, 43 మీటర్ల ఎత్తుతో ఎగువ కాఫర్‌ డ్యామ్‌.. 1,634 మీటర్ల పొడవు, 30.5 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు ప్రారంభించారు. ప్రాజెక్టును పూర్తి చేసి 2018 జూన్‌ నాటికే నీళ్లిస్తామని ఒక సారి.... 2018 డిసెంబర్‌కు నీళ్లిస్తామని మరో సారి హామీ ఇచ్చారు.  

చంద్రబాబు అసమర్థత వల్లే విధ్వంసం.. 
నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూనే ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు పూర్తి చేయాలని.. లేకపోతే నిర్వాసితులు ముంపునకు గురవుతారని సీడబ్ల్యూసీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ పదేపదే హెచ్చరించాయి. కానీ పునరావాసం కల్పించే పనుల్లో కమీషన్లు రావు కనక... కాఫర్‌ డ్యామ్‌లను కూడా పూర్తి చేయకుండా చంద్రబాబు చేతులేత్తేశారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో ఒక వైపున 400 మీటర్లు, మరో వైపున 350 మీటర్ల వెడల్పుతో ఖాళీ ప్రదేశాలను వదిలేశారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించడంతో 2019, మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

కాకపోతే 10 రోజులు తిరగకుండానే 2019 జూన్‌లో గోదావరికి వరదలొచ్చాయి. ఫలితంగా నవంబర్‌ వరకూ వరదల వల్ల పనులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. చంద్రబాబు ఐదేళ్లలో చేయలేని 45 గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించే పని.. పది రోజుల్లో పూర్తి చేయడం సాధ్యమవుతుందా? వరదల సమయంలో కాఫర్‌ డ్యామ్‌ల ఖాళీ ప్రదేశాలను పూడ్చటం వీలవుతుందా? ఇదిగో... వీటి ఫలితంగానే 2019, ఆగస్టులో భారీ వరదలొచ్చిన సమయంలో 2400 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి నది.. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఖాళీ ప్రదేశాల గుండా అంటే కేవలం 750 మీటర్ల వెడల్పుతో కుచించుకుపోయి ప్రవహించాల్సి వచ్చింది. ఫలితంగా... నీటి ప్రవాహం పెరిగి.. వరద ఉద్ధృతి అధికమై.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలను కోసేసింది.

కనిష్ఠంగా 12 మీటర్లు.. గరిష్ఠంగా 22 మీటర్ల లోతుతో మూడు పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిన్నది. దిగువ కాఫర్‌ డ్యామ్‌ కోతకు గురైంది. ఇవన్నీ చంద్రబాబు విధ్వంసానికి సాక్ష్యాలు. బాబు అసమర్థతకు నిలువెత్తు నిదర్శనాలు. 2014–19 మధ్యన ఈ దారుణాలు చోటు చేసుకున్నాయని ఐఐటీ నిపుణుల నివేదికలో స్పష్టంగా చెప్పగా... అదంతా ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే జరిగినట్లుగా దౌర్భాగ్యపు రాతలకు దిగిన ‘ఈనాడు’కు నిజానిజాలతో పనిలేదన్నది ఆ నివేదిక చూసిన ఎవ్వరికైనా అర్థమవుతుంది. 

ఖజానా దోచేస్తే ఒప్పు.. ఆదా చేస్తే తప్పా?
పోలవరం జలాశయం పనుల్ని ఈపీసీ పద్ధతిలో ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ దక్కించుకుంది. దానిపై 60సీ నిబంధన కింద వేటు వేసి.. 2018, ఫిబ్రవరి 27న రూ.3,302 కోట్ల విలువైన పనిని ఎల్‌ఎస్‌(లంప్సమ్‌) విధానంలో నామినేషన్‌ పద్ధతిలో నవయుగ సంస్థకు కట్టబెట్టారు చంద్రబాబు. ఇది స్వయంగా రామోజీరావు తనయుడు కిరణ్‌ వియ్యంకుల కుటుంబానిది. దీంతోపాటు మరో రూ.3,220.2 కోట్లతో జలవిద్యుత్కేంద్రం పనులను కూడా ఆ సంస్థకే ఇచ్చేశారు. అసలు ఈపీసీ విధానంలో ఇచ్చిన కాంట్రాక్టును లంప్సమ్‌ పద్ధతిలో మరొకరికి అప్పగించడమంటే... బరితెగింపునకు పరాకాష్ట. విచిత్రమేంటంటే ‘మనవాడైతే’... సూత్రాన్ని ఇక్కడ కూడా పాటించారు రామోజీ!!.  

ఆ తరవాత పోలవరం జలాశయం, విద్యుత్కేంద్రం పనుల అప్పగింతలో అక్రమాలు చోటుచేసుకున్నాయని.. వాటికి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలని నిపుణుల కమిటీ సూచించింది. ఆ మేరకే 2019లో సీఎం వైఎస్‌ జగన్‌ రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించి, రూ.845 కోట్లను ఆదా చేస్తూ మేఘా సంస్థకు అప్పగించారు. ఇది సహజంగానే రామోజీకి నచ్చలేదు. అందుకే... ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి నవయుగకు.. నవయుగ నుంచి మేఘాకు కాంట్రాక్టు సంస్థలను మార్చడం వల్ల పోలవరం పనుల్లో జాప్యం జరిగిందని ఐఐటీ నిపుణులు తేల్చితే... కేవలం నవయుగను తప్పించడం వల్లే పనుల్లో జాప్యం చోటుచేసుకుందని ఆ కమిటీ చెప్పినట్లు వక్రీకరించేశారు. చేతిలో పెన్ను పేపరు ఉంటే ఏదైనా రాయొచ్చనుకునే రామోజీకి... తప్పుడు రాతలకున్న విలువ అర్థం కావటానికి ఇంకెన్నాళ్లు పడుతుందో? 

రికార్డు సమయంలో పూర్తి చేస్తుండటం కన్పించలేదా? 
మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో అంకురార్పణ చేసిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను సీఎం జగన్‌ తీసుకున్నారు. ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తున్నారు. కరోనా సమయంలోనూ పోలవరం పనులకు ప్రాధాన్యం ఇచ్చారు. రికార్డు సమయంలో స్పిల్‌ వేను పూర్తి చేయటంతో పాటు, ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను, స్పిల్‌ ఛానల్, అప్రోచ్‌ ఛానల్, పైలట్‌ ఛానల్‌ చేపట్టి, నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించి.. 2021, జూన్‌ 11నే గోదావరి ప్రవాహాన్ని 6.1 కి.మీ.ల మేర మళ్లించారు. చంద్రబాబు పాపాల వల్ల దిగువ కాఫర్‌ డ్యామ్‌లో కోతకు గురైన ప్రదేశంలో 30.5 మీటర్ల ఎత్తు వరకూ చేసే పనులను సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు చేపట్టారు.

ఈలోగా మళ్లీ వరద ముంచెత్తింది. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో అగాధాలను పూడ్చేందుకు సీడబ్ల్యూసీ సూచించిన తొమ్మిది రకాల పరీక్షలు చేసి.. ఆ నివేదికలను ఎన్‌హెచ్‌పీసీ పరిశీలించి డయాఫ్రమ్‌ వాల్‌ భవితవ్యాన్ని తేల్చాల్సి ఉంది. అనంతరం కేంద్ర జల్‌ శక్తి శాఖ సూచన మేరకు వాటిని పూర్తి చేసి... ప్రాజెక్టును సాకారం చేసే చిత్తశుద్ధితో సీఎం వైఎస్‌ జగన్‌ అడుగులు వేస్తున్నారు. ఇటీవల గోదావరికి వచ్చిన భారీ వరదల నుంచి ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను రక్షించుకోవడానికి కేవలం 48 గంటల్లోనే ఎత్తును ఒక మీటర్‌ పెంచే పనులను పూర్తి చేయడంతో కేంద్ర జల సంఘం సైతం ప్రశంసలు కురిపించింది. కాకపోతే ఇవేవీ ఎల్లో కళ్లకు కనిపించకపోవటమే ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. 

పక్కా ప్రణాళికతోనే బురద... 
పోలవరం పనుల్లో జాప్యానికి కారణాలపై టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ రాజ్యసభలో కేంద్ర జల్‌ శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడును ప్రశ్న అడిగారు. 2014–19 మధ్య అధికారంలో ఉన్న ప్రభుత్వ ప్రణాళికారాహిత్యం వల్లే పనుల్లో జాప్యం చోటుచేసుకుందని కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి సమాధానమిచ్చారు. దాన్ని వక్రీకరించి ముఖ్యమంత్రి జగన్‌పైకి నెడుతూ యావత్తు ఎల్లో మీడియాలో అసత్య కథనాలను అచ్చువేశారు. ఆ కథనాలను పట్టుకుని వైఎస్‌ జగన్‌ సర్కార్‌పై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ నేతలు బురదజల్లారు. అదే ప్రశ్నకు సమాధానంగా ఐఐటీ హైదరాబాద్‌ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను కూడా కేంద్ర జల్‌ శక్తి శాఖ సహాయమంత్రి పేర్కొంటే.. దాన్ని చంద్రబాబు ఎల్లో మీడియాకు ఇచ్చి.. వక్రీకరిస్తూ కథనాలు రాయించారు. ఇదీ ఎల్లో స్కెచ్‌!. 

రామోజీ... ఈ ప్రశ్నలకు బదులుందా? 
► 2014–19 మధ్య ప్రణాళిక రాహిత్యంతో చేసిన పనుల వల్లే ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో మూడు చోట్ల భారీ అగాధాలు ఏర్పడ్డాయని, డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిందని ఐఐటీ హైదరాబాద్‌ నిపుణుల బృందం తేల్చిచెప్పడం అబద్ధమా? మరి ఆ కాలంలో అధికారంలో ఉన్నదెవరు?  
► అసలు పోలవరం పనులను ఈపీసీ విధానంలో దక్కించుకున్న ట్రాన్స్‌ట్రాయ్‌ను తొలగించేసి.. మిగిలిన రూ.3,302 కోట్ల విలువైన పనులను ఎల్‌ఎస్‌(లంప్సమ్‌) పద్ధతిలో చంద్రబాబు నవయుగకు కట్టబెట్టడం తప్పు కాదా? అప్పుడెందుకు ప్రశ్నించలేదు మీరు? అది మీ వియ్యంకుల కుటుంబానిది కాబట్టేనా? 
► నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు నవయుగను రద్దు చేసి.. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఖజానాకు సీఎం వైఎస్‌ జగన్‌ రూ.845 కోట్లను ఆదా చేయడం అబద్ధమా? 
► పునరావాసానికి ప్రాధాన్యమిస్తూ... కరోనా ఇబ్బందుల్లోనూ రాష్ట్ర ఖజానా నుంచే ఖర్చు చేస్తూ స్పిల్‌ వే, ఎగువ కాఫర్‌ డ్యామ్, స్పిల్‌ ఛానల్, అప్రోచ్‌ ఛానల్, ఫైలట్‌ ఛానల్‌ను పూర్తి చేసి.. 6.1 కిలోమీటర్ల పొడవున గోదావరి ప్రవాహాన్ని 2021, జూన్‌ 11న సీఎం జగన్‌ మళ్లించడం నిజం కాదా? ఇది మీకు కనిపించదా? 
► పోలవరం పనులకు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చేసిన మొత్తంలో రూ.2,717.85 కోట్లను కేంద్రం ఇప్పటికీ రీయింబర్స్‌ చేయలేదన్న వాస్తవం తెలియదా? ఎందుకీ కబోది రాతలు? 
► చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జూలై రెండో వారంలోనే గోదావరికి భారీ వరదలొస్తే... వాటి నుంచి ప్రాజెక్టును రక్షించుకోవటానికి కేవలం 48 గంటల్లో ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఎత్తును పాక్షికంగా మీటర్‌ మేర పెంచిన పనులను సీడబ్ల్యూసీ కూడా ప్రశంసించటం అబద్ధమా? ఇదే పనుల్ని మీ ‘బాబు’ చేసి ఉంటే ఆకాశానికి ఎత్తేసేవారు కాదా?   

మరిన్ని వార్తలు