మేమింతే.. మారమంతే!

21 Oct, 2021 04:34 IST|Sakshi

ఉపాధి హామీపై ‘ఈనాడు’ తప్పుడు కథనం

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై తమకున్న రాజకీయ దుగ్ధతో నిరుపేదల పొట్టకొట్టేందుకు సైతం టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుయాయులు వెనుకాడటం లేదు. ఏటా రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 45 లక్షల కుటుంబాలకు జీవనోపాధి కల్పించే ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకుండా అడ్డుకునేందుకు కుయుక్తులకు తెరతీశారు. రాష్ట్రంలో పథకం అమలు తీరుపై కేంద్ర అధికారులు గురువారం మధ్యంతర సమీక్ష నిర్వహించనుండగా సరిగ్గా రెండు రోజుల ముందు విషం చిమ్మారు.

రాష్ట్రంలో ఉపాధి హామీ అమలులో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే ‘ఈనాడు’ దినపత్రిక ‘నాకింత.. నీకింత’ శీర్షికన మంగళవారం పతాక కథనాన్ని ప్రచురించింది. టీడీపీ అధికారంలో ఉండగా జరిగిన ఘటనలను ఇప్పుడే చోటు చేసుకున్నట్లుగా చిత్రీకరిస్తూ తప్పుడు కథనాలను వెలువరించింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఎంపీ రఘురామకృష్ణరాజు రాష్ట్రానికిచ్చిన ఉపాధి హామీ నిధులను వెనక్కి తీసుకోవాలంటూ కేంద్రానికి లేఖ రాయడం తెలిసిందే. టీడీపీ ఎంపీలు సైతం ఫిర్యాదులు చేశారు. ఇలా అడ్డుపుల్లలు వేస్తూ రాష్ట్రానికి కేటాయించిన నిధుల విడుదలలో జాప్యం జరిగేలా అడ్డుకుంటున్నారు.

టీడీపీ హయాంలోనే..
ప్రకాశం జిల్లా పెద్దరావీడు మండలం రేగుమానుపల్లి, సుంకేసుల, తంగిరాలపల్లి గ్రామాల్లో చనిపోయిన వ్యక్తులు ఉపాధి హామీ పనులు చేసినట్టు రికార్డుల్లో నమోదు చేసి వారి పేరుతో రూ.2,949 ఆయా కుటుంబాలకు చెల్లింపులు జరిగినట్లు ఆ పత్రిక పేర్కొంది. వాస్తవానికిæ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టక ముందే 2019 ఏప్రిల్, మే నెలలో ఆ మూడు గ్రామాల్లో అంతకుముందెప్పుడో చనిపోయిన వ్యక్తులు ఆ సమయంలో పనిచేసినట్లు చూపి డబ్బులు డ్రా చేసుకున్నారు. అప్పటి సంఘటనకు సంబంధించి ఫిర్యాదులు రావడంతో విచారణ అనంతరం అవినీతికి పాల్పడిన వారికి నోటీసులు జారీ చేసి డబ్బులు రికవరీ చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పది రోజుల క్రితం నోటీసులిచ్చారు. వాస్తవాలు ఇలా ఉండగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అవినీతి జరిగినట్లుగా చిత్రీకరిస్తూ ఆ పత్రిక కథనాలను వెలువరించింది.

పనులు కాగానే ఫ్యాక్టరీకి
మరింత ఆదాయం కోసం గ్రామాల్లో పేదలు పగలు ఉపాధి పనులు, సాయంత్రం ఇతర కూలి పనులకు వెళ్లడం సాధారణమే. వేసవి, కరోనా దృష్ట్యా ఈ ఏడాది మే, జూన్, జూలైలో రాష్ట్రంలో చాలా చోట్ల నిబంధనల ప్రకారం ఎండ బాగా పెరగకముందే ఉపాధి హామీ కూలీలు తిరిగి వెళ్లేలా అ«ధికారులు ఏర్పాట్లు చేశారు. ఇదే తరహాలో విశాఖ జిల్లా రోలుగుంట మండలం నిండుగొండకు చెందిన పలువురు కూలీలు ఉదయం ఉపాధి హామీ పనులకు, తర్వాత స్థానికంగా జీడిపిక్కల ఫ్యాక్టరీలో పనులకు వెళ్లారు. దీన్ని ఉదాహరణగా చూపిస్తూ మరో చోట పనులకు వెళ్లిన వారు అదే రోజు ఉపాధి పనులకు కూడా వచ్చి అక్రమంగా బిల్లులు తీసుకున్నట్లు ఆ పత్రిక కథనాన్ని వెలువరించింది. ఆయా రోజుల్లో తాము రెండు చోట్ల పనులకు హాజరైనట్లు తెలియచేయడంతోపాటు కొందరు లిఖితపూర్వకంగా ఆ వివరాలను గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు అందచేసినట్లు తెలిసింది.

ఆ మస్టర్లు అంతా ఉత్తదే
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మేఘవరానికి చెందిన వేతనదారులు విదేశాలకు వెళ్లిన వారి పేర్లతో మస్టర్లు వేసి డబ్బులు వారి ఖాతాల్లో వేసినట్లు ఈనాడు పత్రిక పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన జిల్లా అధికారులు అసలు అందులో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కార్యాలయానికి నివేదిక ఇచ్చారు. ఆ కథనంలో పేర్కొన్న పేర్లతో ఉపాధి హామీ ద్వారా ఎలాంటి చెల్లింపులు జరగలేదని అధికారులు తేల్చారు. జగన్నాథపురంలో మృతి చెందిన వారి పేర్లతో మస్టర్లు వేసి చెల్లింపులు జరిపినట్లు వచ్చిన వార్తల్లోనూ నిజం లేదని తేల్చారు.

కరోనాలోనూ పనుల కల్పనలో టాప్‌..
కరోనా మహమ్మారి దేశమంతా ప్రజల జీవితాలను అతలాకుతలం చేయగా మన రాష్ట్రంలో వివిధ సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఉపాధి హామీ ద్వారా పెద్ద ఎత్తున పనులు కల్పించి ప్రభుత్వం ఆదుకుంది. ఒక పక్క కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే పని చేసుకోవడానికి ముందుకొచ్చే కుటుంబానికి రూ.20 వేలకు పైబడి ఆదాయాన్ని కల్పించింది. 2019–20లో 40.41 లక్షల కుటుంబాలకు పథకం ద్వారా పనులతో రూ.4,081 కోట్ల మేర ఉపాధి కల్పించగా 2020–21లో 47.77 లక్షల కుటుంబాలకు రూ.5,953 కోట్లు ఉపాధి కూలీ కింద చెల్లించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గత ఆరున్నర నెలల్లో 45.32 లక్షల కుటుంబాలకు కూలీ రూపంలో రూ.4,769 కోట్లు చెల్లించారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే పేదల్లో 71 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే కావడం గమనార్హం. ఉపాధి పథకం అమలులో పారదర్శకతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. పనులు పొందడంలో పేదలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎక్కడికక్కడే సమస్య పరిష్కారం కోసం కొత్తగా ప్రతి జిల్లాలోనూ అంబుడ్స్‌మెన్‌ ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి వ్యవస్థే లేదు. అవినీతి జరిగితే వెంటనే గుర్తించేందుకు సోషల్‌ ఆడిట్‌ ప్రక్రియను సైతం మెరుగుపరిచారు.

ఆ పత్రికకు లీగల్‌ నోటీసుల జారీకి నిర్ణయం..
గ్రామీణ పేదలకు జీవనోపాధి కల్పించే ఉపాధి హామీ పథకానికి కేంద్రం నిధులు రాకుండా ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు ప్రచురించటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కూలీలను అవినీతిపరులుగా చిత్రీకరించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను సైతం దెబ్బతీసే తప్పుడు సమాచారంతో కథనం ప్రచురించిన ఈనాడు దినపత్రికకు లీగల్‌ నోటీసు జారీ చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ సిద్ధమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే న్యాయపరమైన సలహాలు తీసుకున్నారని, గురు లేదా శుక్రవారం లీగల్‌ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.  

మరిన్ని వార్తలు