‘గడప గడప’పై పచ్చటి విషం 

18 Jun, 2022 03:15 IST|Sakshi
సుబ్రహ్మణ్యేశ్వరి బ్యాంకు అకౌంట్‌

అవాస్తవాల కట్టు కథలతో ప్రజలు నిలదీస్తున్నట్లు చిత్రీకరిస్తున్న ఈనాడు 

మూడేళ్ల సంక్షేమ కార్యక్రమాలపై బురద జల్లుతూ దుష్ప్రచారం 

ప్రజలకు లబ్ధి జరిగినా జరగలేదని చూపించేందుకు తాపత్రయం  

ఒక్కో కుటుంబానికి వేల రూపాయల లబ్ధి జరిగినా పైసా లబ్ధి జరగలేదంటూ విష ప్రచారం 

అమాయకులను ఆసరాగా తీసుకుని దుష్ప్రచారానికి భారీ కుట్ర 

రాష్ట్రంలోని అత్యధిక శాతం కుటుంబాలకు ప్రభుత్వం నుంచి కనీసం ఒక్క పథకం ద్వారా అయినా లబ్ధి చేకూరిందనడం ఎవరూ కాదనలేని అక్షర సత్యం. వాస్తవంగా లబ్ధి కలిగినప్పటికీ.. వంద మందిలో ఏ ఒక్కరో ఇద్దరో పొరపాటునో, నిరక్షరాస్యత వల్లో, అమాయకత్వం వల్లో ఆ విషయంతెలియక తమకు లబ్ధి కలగలేదని చెప్పడం ‘ఈనాడు’కు పండుగగా మారుతోంది. అలా చెప్పిన వారికి సచివాలయం సిబ్బంది, వలంటీర్‌ వాస్తవమేమిటో వివరిస్తుండటం ‘ఈనాడు’కు వినిపించదు.. కనిపించదు. లబ్ధి పొందినప్పటికీ, తాము లబ్ధి పొందలేదని మరికొందరితో ‘పచ్చ’ గ్యాంగ్‌ సభ్యులు నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పిస్తున్నారు. ఆ మాటలకు మసాలా అద్ది, పాతాళంలో పడిపోయిన చంద్రబాబుకు జాకీలు వేసి పైకెత్తడమే తమ పాలసీగా రామోజీ ముందుకు వెళుతున్నారు.

రాష్ట్రంలో గడప గడపను పలకరించిన సంక్షేమంపై ఈనాడు పత్రిక విషం చిమ్ముతూ తప్పుడు భాష్యాలు చెప్పడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. మూడేళ్లలో 1.40 కోట్ల కుటుంబాలకు జరిగిన రూ.1.40 లక్షల కోట్లకు పైగా లబ్ధిని అబద్ధంగా చూపించేందుకు నానా కుయుక్తులు పన్నుతోంది. ప్రజా ప్రతినిధులు నిర్వహిస్తున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి ప్రజల నుంచి ఆదరణ లభిస్తుండటంతో, దానిపై బురదజల్లడమే పనిగా నిత్యం తప్పుడు కథనాలు వండివారుస్తోంది.

వివిధ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో సొమ్ము జమ అయినట్లు స్పష్టంగా కనపడుతున్నా, ఎల్లో వైరస్‌ జబ్బుతో బాధ పడుతున్న ఈనాడుకు మాత్రం అది కనపడడం లేదు. ప్రజలు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నట్లు అదేపనిగా తప్పుడు రాతలు రాయడమే పనిగా పెట్టుకుంది. మూడేళ్లుగా రాష్ట్రంలో సంక్షేమ యజ్ఞం జరుగుతుండడాన్ని బాబు కోసం శ్రమించే ఎల్లో సిండికేట్‌ జీర్ణించుకోలేకపోతోంది.

ఒక్కో కుటుంబానికి రెండు, మూడు పథకాల ద్వారా లబ్ధి కలుగుతూ.. ఆ సొమ్ము నేరుగా వారి బ్యాంకు అకౌంట్లలో జమ అవుతున్నా, కాదు కాదంటూ కనికట్టు కథనాలతో ప్రజల మనసుల్లో విషం నింపుతోంది. ఉదాహరణకు గుంటూరుకు చెందిన సజ్జా సుబ్రహ్మణ్యేశ్వరి కుటుంబానికి రూ.59,600 బ్యాంకు అకౌంట్‌లో పడినా పైసా కూడా పడలేదని ఈ నెల 15న తప్పుడు రాతలు రాసింది. ఆమె గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫాను ప్రశ్నించినట్లు తప్పుడు ప్రచారానికి దిగింది. తనకు లబ్ధి కలగలేదని తొలుత ఆమె చెప్పగానే, సచివాలయ సిబ్బంది ఆధారాలతో సహా వివరించి చెప్పడంతో ఆమె ఒప్పుకుందనే విషయాన్ని మాత్రం ఇదే ‘ఈనాడు’ విస్మరించింది.  

సుబ్రహ్మణ్యేశ్వరి బ్యాంకు అకౌంట్‌.. రైతు భరోసా మొత్తం జమ అయిన వివరాలు (పసుపు రంగులో)   

దీన్ని ఎల్లో కుట్ర అనక ఇంకేం అనాలి? 
గుంటూరు చేనేత కాలనీకి చెందిన సజ్జా సుబ్రహ్మణ్యేశ్వరి అకౌంట్‌లో మూడు పథకాల కింద రూ.59,600 జమ అవడం నూటికి నూరు శాతం వాస్తవమేని అధికార యంత్రాంగం తేల్చింది. జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన మొత్తం ఆమె కుమారుడు హర్షవర్ధన్‌ చదివిన కేకేడీ, కేఎస్సార్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ కాలేజీ అకౌంట్లో జమ అయింది.

నిజానికి ఈ సొమ్ము చంద్రబాబు హయాంలో వేయాల్సి ఉండింది. హర్షవర్థన్‌ చదువుకు సంబంధించి 2018లో చంద్రబాబు ప్రభుత్వం బకాయి పెట్టింది. ఆ బకాయిలను మూడు విడతలుగా కాలేజీ అకౌంట్‌లో జగన్‌ ప్రభుత్వం జమ చేసింది. ఇదే విషయాన్ని సచివాలయ సిబ్బంది ఆమెకు వివరించారు. వైఎస్సార్‌ రైతు భరోసా సొమ్ము రూ.40,500 ఆమెకు చెందిన ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ అకౌంట్‌లో జమ అయింది.

బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోక పోవడం వల్ల ఆమెకు ఈ విషయం తెలియలేదు. ఈ విషయాన్నీ సిబ్బంది వివరించారు. ఏ రోజు ఎంత మొత్తం జమ అయిందో స్పష్టంగా తెలియజేశారు. ఈ విషయాలన్నింటినీ ‘ఈనాడు’ విస్మరిస్తూ అబద్ధపు రాతలు రాసేసింది. దీన్ని విష ప్రచారం అనక ఇంకేమనాలి?   

నిరక్షరాస్యత ఆసరాగా మరో కుట్ర 
తనకు ఎలాంటి లబ్ధి కలగలేదని బాపట్ల పట్టణంలోని తోట మంగమ్మ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతిని నిలదీసినట్లు ఈ నెల 17న అవాస్తవాన్ని ప్రచురించింది. నిజానికి తోట మంగమ్మ చదువుకోలేదు. ప్రభుత్వ పథకాల గురించి ఆమెకు తెలియదు. తనకు ఏమీ డబ్బు అందలేదని డిప్యూటీ స్పీకర్‌కు చెప్పగానే.. పక్కనే ఉన్న అధికారులు వాస్తవాలను వివరించారు. పాంప్లెట్‌లో చెప్పిన విధంగా మూడు పథకాల కింద రూ.58,330 లబ్ధి కలిగిందని ఆధారాలతో సహా చూపించారు.

రైతు భరోసా కింద రూ.27 వేలు, వైఎస్సార్‌ ఆసరా కింద రూ.10,262, జగనన్న విద్యా దీవెన కింద రూ.17,500 (ఆమె కుమారుడు చదువుకి) ఆమెకు అందాయి. ఈమె అకౌంట్‌ను ఇతర కుటుంబ సభ్యులు ఆపరేట్‌ చేస్తుండటంతో ఆమెకు ఈ విషయం తెలియదు. తనకు లబ్ధి కలగలేదన్న మాటలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్న ‘ఈనాడు’.. ఆ తర్వాత అధికారులు తేల్చిన వాస్తవాన్ని విస్మరించడం దుర్మార్గం కాదా? ప్రజల దృష్టిలో ప్రభుత్వాన్ని చులకన చేయడం కాదా? చంద్రబాబుకు రాజకీయంగా లబ్ధి చేకూర్చడం కాదా?   

కాగా ‘బాపట్లలోని ఉమ్మారెడ్డి సరోజినీదేవి కాలనీకి చెందిన తోట మంగమ్మకు ప్రభుత్వం తరఫున పైసా కూడా రాలేదని ఈనాడులో వచ్చిన వార్త అవాస్తవం. శుక్రవారం నేను స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి విచారించాను. డబ్బు జమ అయిన విషయం వాస్తవమేనని చెప్పింది’ అని మున్సిపల్‌ కమిషనర్‌ ఎ.భానుప్రతాప్‌ మీడియాకు వెల్లడించారు. 

ఆ డబ్బులు మా అకౌంట్‌లో పడ్డాయి 
ఈ నెల 14వ తేదీన ఎమ్మెల్యే ముస్తఫా గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మా ఇంటికి వచ్చారు. ఆయన రావడానికి ముందు మాకు ఒక పాంప్లెట్‌ ఇచ్చారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసత దీవెన, వైఎస్సార్‌ రైతు భరోసా కింద మొత్తం రూ.59,600 మేర లబ్ధి కలిగింది వాస్తవమే.

ఇంత డబ్బు నాకెప్పుడు వచ్చిందని అడిగాను. సచివాలయ సిబ్బంది, వలంటీర్లు బ్యాంకు అకౌంట్‌ను చెక్‌ చేయించి ఈ డబ్బు నా అకౌంట్లో పడిందని ఆధారాలతో సహా చూపించారు. మా అబ్బాయి చదువు అయిపోవడం వల్ల విద్యా దీవెన, వసతి దీవెన మాకు ఎందుకు వస్తాయనుకున్నాం. పాత బకాయి ఇచ్చారనే విషయం తెలుసుకోలేకపోయాం.   
– సజ్జా సుబ్రహ్మణ్యేశ్వరి, గుంటూరు  

ఆసాంతం వారు విన్నట్లు లేరు.. 
నాకు చదువు రాదు. మా వారికీ రాదు. మాకేమీ తెలియలేదు. నా ఖాతాలో డబ్బులు పడ్డాయనే విషయం మాకు తెలియలేదు. అందుకే మాకేమీ డబ్బులు రాలేదని తొలుత చెప్పాం. ఆ వెంటనే అప్పటికప్పుడే అధికారులు, సిబ్బంది.. మా అబ్బాయిని బ్యాంకుకు తీసుకెళ్లి అన్నీ చూపించారు. రూ.58,330 డబ్బులు మా అకౌంట్‌లో పడ్డాయి. జగనన్న విద్యా దీవెన కింద రూ.17,500, రైతు భరోసా కింద రూ.27 వేలు, వైఎస్సార్‌ ఆసరా కింద రూ.10,262 వచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్యే చెప్పింది నిజమే. ఆ పేపర్లో ఏం రాశారో నాకు తెలీదు. ఆసాంతం వారు విన్నట్లు లేరు.     
– తోట మంగమ్మ, బాపట్ల  

మరిన్ని వార్తలు