గత ప్రభుత్వ జీవోల ప్రకారమే స్థలాల వేలం

27 Jun, 2022 07:46 IST|Sakshi

500 ఎకరాల అమ్మకమంటూ ‘ఈనాడు’ తప్పుడు ప్రచారం

వివిధ ప్రాంతాల్లోని చిన్నచిన్న స్థలాల అమ్మకానికి ఉత్తర్వులు

గతంలో వీటి విక్రయానికి టీడీపీ యత్నం

మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి, అమరావతి: రాజధాని భూముల అమ్మకంపై ఈనాడు పత్రిక తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని, గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన విజయవాడ, గుంటూరు, తెనాలి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న స్థలాలను చట్టబద్ధంగా అమ్మకానికి ఉంచామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆదివారం తెలిపారు. ఇవే స్థలాలను గత ప్రభుత్వం 2017లో అమ్మకానికి పెట్టిందని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ స్థలాలను రాజధాని అభివృద్ధి కోసం ఈ–వేలం వేస్తున్నట్టు చెప్పారు. భూములను ఆదాయ వనరుగా చూడాలని గత ప్రభుత్వమే ప్రకటించిందని.. అమ్మడం, కొనడం అందులో భాగమేనన్నారు.

2017 జూన్‌ 15న అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో–228 ప్రకారమే ఆ స్థలాలకు ఈ–వేలం నిర్వహిస్తున్నామన్నారు. ఈ వాస్తవాలను పక్కనపెట్టి ప్రభుత్వం 500 ఎకరాల రాజధాని భూములు అమ్మకానికి ఉంచినట్టు ఈనాడు తప్పుడు కథనాలు ప్రచురించడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనన్నారు. జీవో 389, 390ల్లో పేర్కొన్న స్థలాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయన్న విషయాన్ని ఆ పత్రిక గుర్తించాలని, ఇవేమీ రహస్య ఉత్తర్వులు కాదని, అంతా బహిరంగమేనన్నారు.

ఏ స్థలం ఎక్కడ ఉందో సదరు జీవోల్లో వివరంగా ఉన్నప్పటికీ ‘500 ఎకరాల రాజధాని భూముల అమ్మకం’ అంటూ తప్పుడు ప్రచారం చేయడం తీవ్రమైన చర్యగా మంత్రి సురేష్‌ పేర్కొన్నారు. దీంతోపాటు అమరావతి అభివృద్ధిలో భాగంగా వివిధ కంపెనీల స్థాపన కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం వందల ఎకరాలు కట్టబెట్టిందని, వాటిలో చాలా సంస్థలు గడువులోగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో ఆ భూములను తిరిగి ప్రభుత్వం తీసుకుందని గుర్తు చేశారు. ఈ విధంగా 2016లో భూములు తీసుకుని అభివృద్ధి పనులు చేపట్టని కారణంగా ఆయా సంస్థల ఒప్పందాన్ని 2019లోనే ప్రభుత్వం రద్దు చేసిందని, వాటిలో స్వల్ప స్థలాలను కూడా ఈ–వేలానికి ఉంచినట్టు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ఈనాడు పత్రిక తెగ ఆరాటపడుతోందని, ఈ విష ప్రచారం కూడా అందులో భాగమేనని విమర్శించారు.   

మరిన్ని వార్తలు