FactCheck: రామోజీకే తక్షణం చికిత్స కావాలి!

24 Nov, 2023 05:57 IST|Sakshi

కొత్త వైద్య కళాశాలల ఏర్పాటును జీర్ణించుకోలేక వక్రరాతలు

కొత్తగా 53 వేల పోస్టుల భర్తీ, 17 మెడికల్‌ కాలేజీలు 

విలేజ్‌ క్లినిక్స్‌ సురక్ష శిబిరాలతో ప్రజల చెంతకే వైద్యం 

ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్ల పెంపు, ఆరోగ్య ఆసరాతో ఆర్థిక సాయం 

రామోజీకి పచ్చ పైత్యం మరీ ఎక్కువై పోయింది. నిత్యం ఏదో రకంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై బురద చల్లనిదే నిద్ర పట్టని స్థితికి చేరుకున్నారు. ప్రజలకు అందుబాటులో అత్యుత్తమ వైద్యం అందించేలా చర్యలు తీసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తమ బాబు పాలనలో కుదేలైన వైద్య ఆరోగ్య రంగం ఇప్పుడు పూర్తిగా రూపురేఖలు మార్చుకోవడాన్ని చూసి కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు.

ఎక్కడైనా కొత్త వైద్య కళాశాల ప్రారంభమైతే అదనంగా సేవలు అందుతాయనే కనీస విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా పచ్చి అబద్ధాలతో ప్రజల మెదళ్లలో విషం నింపుతున్నారు. వైద్య సేవలు అందడం లేదని చెబుతున్న రామోజీ ఈ ఆస్పత్రులకు వస్తే.. ఆయన రోగాలన్నింటికీ, ప్రత్యేకించి పచ్చ పైత్యానికి మంచి మందు ఇస్తారు.  

సాక్షి, అమరావతి : చంద్రబాబు హయాంలో నిర్వీర్యమైన ప్రభుత్వ వైద్య రంగానికి విప్లవాత్మక సంస్కరణలతో ఈ ప్రభుత్వం ఊపిరి ఊదడం రామోజీరావుకు ఏమాత్రం నచ్చలేదు. ప్రభుత్వాస్పత్రుల ద్వారా జరిగే మంచి నుంచి ప్రజల దృష్టి మరల్చేలా డొల్ల కథనాలు ప్రచురిస్తున్నారు. కొత్తగా వైద్య సేవలు ప్రారంభమైతే సంతోషించాల్సింది పోయి ‘ఇవేం బోధనాస్పత్రులు?’ అంటూ బుధవారం ఓ కథనంలో అక్కసు వెళ్లగక్కారు.

రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన బోధనాస్పత్రుల్లో రోగులకు సేవలు అందడం లేదంటూ ఆరోపణలు చేశారు. వైద్య విద్యను బలోపేతం చేయడం ద్వారా మన విద్యార్థులకు వైద్య విద్యా అవకాశాలు పెంచడంతో పాటు, ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు.

నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం వైద్య కళాశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఐదు చోట్ల జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేశారు. అయితే ఈ ఆస్పత్రుల్లో రోగులకు సేవలు సక్రమంగా అందడం లేదంటూ రామోజీ పనిగట్టుకుని అసత్యాలు అచ్చేశారు. ఇందులో నిజానిజాలు ఇలా ఉన్నాయి.  

ఆరోపణ : విజయనగరం జీజీహెచ్‌లో ఓపీ మధ్యాహ్నం 12.30 వరకు చూస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 700 వరకూ ఓపీలు నమోదు అవుతున్నాయి. గతంలో 200 పడకలకు ఉన్న సిబ్బందినే 400 పడకలకు వాడుతున్నారు.  
వాస్తవం: ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ ఓపీ చూస్తున్నారు. ఉదయం ఓపీలో చూపించుకున్న వారికి ఫాలోఅప్‌ సేవల కోసం తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఓపీలు చూస్తున్నారు. బోధనాస్పత్రిగా అభివృద్ధి చేసిన అనంతరం అందుకు తగ్గట్టుగా పోస్టులను ప్రభుత్వం కొత్తగా సృష్టించి వాటి భర్తీ చేపట్టింది. ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా బోధనాస్పత్రికి అవసరమైన అన్ని స్పెషాలిటీల్లో వైద్యులు అందుబాటులో ఉంటున్నారు.

ఈ ఆస్పత్రిలో రోజుకు వెయ్యి వరకు ఓపీలు నమోదు అవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ నెలాఖరుకు 2.40 లక్షల ఓపీలు నమోదు అయ్యాయి. అదే జిల్లా ఆస్పత్రిగా ఉన్నప్పుడు 2020–21లో 2.11 లక్షల ఓపీలు నమోదు అయ్యాయి. ఈ లెక్కన పరిశీలిస్తే ఆస్పత్రిలో ఓపీ సేవల్లో వృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని బట్టి ఈనాడు రాసింది తప్పుడు రాతలని స్పష్టంగా తెలుస్తోంది.  

ఆరోపణ : ఏలూరు జీజీహెచ్‌లో 24 వైద్య పోస్టులకుగాను 10 మంది మాత్రమే ఉన్నారు.  
వాస్తవం : ఇక్కడ 73 వైద్య పోస్టులు శాంక్షన్‌లో ఉండగా 64 మంది వైద్యులు అందుబాటులో ఉన్నారు. ఏలూరుతో పాటు, మిగిలిన నాలుగు వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల కోసం ప్రభుత్వం 3,530 పోస్టులను కొత్తగా సృష్టించింది. వీటిలో మెజారిటీ శాతం పోస్టులను ప్రారంభంలోనే భర్తీ చేశారు. అనంతరం వివిధ కారణాలతో ఎక్కడైనా పోస్టులు ఖాళీ ఏర్పడితే వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేసి భర్తీ ప్రక్రియ చేపడుతున్నారు. కొరత అన్న మాటకు ఆస్కారం లేకుండా చర్యలు ఉంటున్నాయి. 

ఆరోపణ : రాజమండ్రి జీజీహెచ్‌లో  సేవలు అధ్వాన్నం.. 
వాస్తవం : ఈనాడు ఆరోపించినట్టు ఇక్కడ అలాంటి పరిస్థితి లేనే లేదు. గతంతో పోలిస్తే వైద్య సేవల్లో వృద్ధి ఉంది. 2020–21లో జిల్లా ఆస్పత్రిగా ఉన్నప్పుడు 1.61 లక్షల ఓపీ (అవుట్‌ పేషంట్‌)లు, 24 వేల ఐపీ (ఇన్‌ పేషంట్‌)ల చొప్పున ఇక్కడ నమోదు అయ్యాయి. బోధనాస్పత్రిగా అభివృద్ధి చేశాక ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ నెలాఖరు మధ్య 2 లక్షల ఓపీలు, 18,351 ఐపీలు నమోదయ్యాయి.  

ఆరోపణ : మచిలీపట్నంలో సగానికి పైగా తగ్గిన ఓపీలు  
వాస్తవం : జిల్లా ఆస్పత్రిగా ఉన్న సమయంతో పోలిస్తే ప్రస్తుతం ఓపీలు తగ్గాయన్నది పచ్చి అబద్ధం. 2020–21లో 1.70 లక్షల ఓపీలు నమోదు అయ్యాయి. అంటే రోజుకు 466 చొప్పున అన్న మాట. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ మధ్య లక్షకుపైనే ఓపీలు నమోదు అయ్యాయి. ఈ లెక్కన గతంతో పోలిస్తే ఓపీలు తగ్గినట్లా.. పెరిగినట్లా?   

ప్రజారోగ్యానికి పెద్దపీట 
♦ 2019లో అధికారం చేపట్టిన నాటి నుంచి సీఎం జగన్‌ ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. చంద్రబాబు పాలనలో నిరీ్వర్యమైన ప్రభుత్వ వైద్య రంగానికి ఊపిరిలూదారు. ఇందులో భాగంగా నాడు–నేడు కింద రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో 17 కొత్త వైద్య కళాశాలలతో పాటు పలు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం.. అప్పటికే ఉన్న ఆస్పత్రుల బలోపేతం చేపట్టారు.  

♦ గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 1,146కు అదనంగా 88 కొత్త పీహెచ్‌సీలను మంజూరు చేసింది. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్‌ నర్సులతో పాటు 14 మంది సిబ్బందిని సమకూర్చారు. మరోవైపు పల్లెల్లోనే ప్రజలకు వైద్య సేవలు అందించేలా 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటు చేశారు.  

♦ ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రతి విలేజ్‌ క్లినిక్‌ పరిధిలో పీహెచ్‌సీ వైద్యులు నెలలో రెండుసార్లు పర్యటించి  వైద్య సేవలు అందిస్తున్నారు. మంచానికే పరిమితం అయిన వారికి ఇళ్ల వద్దే వైద్యం చేస్తున్నారు. ఈ విధానంలో ఇప్పటి వరకు 1.16 కోట్ల మంది స్వగ్రామాల్లోనే వైద్య సేవలు పొందారు.  

♦ దేశంలో ఎక్కడా లేనట్టుగా రాష్ట్రంలో ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయడం, సమస్యలు గుర్తించడం, వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజలకు వైద్య పరంగా చేయిపట్టి నడిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 12,419 సురక్ష శిబిరాలు నిర్వహించగా, 60,25,614 మంది రోగులు సేవలు పొందారు. మెరుగైన వైద్యం అవసరం ఉన్న 86,603 మందిని వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రిఫర్‌ చేసి ఉచితంగా చికిత్స చేయిస్తున్నారు.  

♦ ఆరోగ్యశ్రీలో ప్రోసీజర్‌లను 1,059 నుంచి 3,257కు పెంచారు. అంతేకాకుండా చికిత్స అనంతరం వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద విశ్రాంత సమయానికి భృతిని ప్రభుత్వం అందిస్తోంది. ప్రభుత్వాస్పత్రులకు ప్రధాన సమస్య అయిన మానవ వనరుల కొరతకు ఈ ప్రభుత్వం చెక్‌ పెట్టింది. ఏకంగా 53 వేలకు పైగా పోస్టులను ఇప్పటి వరకు భర్తీ చేసింది. వైద్య శాఖలో నియామకాల కోసం ప్రత్యేకంగా బోర్డ్‌ను ఏర్పాటు చేయడంతోపాటు, ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేసేలా అత్యవసర అనుమతులు ఇచ్చింది. 

మరిన్ని వార్తలు