Andhra Pradesh: ఏపీపై ‘ఈనాడు’ డ్రగ్స్‌ విషం

26 Oct, 2021 12:00 IST|Sakshi
హైదరాబాద్‌ ఎడిషన్‌లో.. 

చెన్నై, బెంగళూరు కేసులను రాష్ట్రానికి అపాదిస్తూ దుష్ప్రచారం 

హైదరాబాద్‌ ఎడిషన్‌లో అలా.. ఏపీ ఎడిషన్‌లో ఇలా.. 

సాక్షి, అమరావతి: తప్పుడు వార్తలతో రాష్ట్రంపై విషం చిమ్మడంలో ‘ఈనాడు’ పత్రిక కొత్త పుంతలు తొక్కుతోంది. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు తాజాగా బెంగళూరు, హైదరాబాద్‌లలో జప్తుచేసిన డ్రగ్స్‌ బాగోతాన్ని పూర్తిగా రాష్ట్రానికి ఆపాదించేసింది. ఈనాడు హైదరాబాద్‌ ఎడిషన్‌లో ఎన్‌సీబీ అధికారులు చెప్పిన వాస్తవాలను ప్రచురించగా.. అదే వార్తను ఆంధ్రప్రదేశ్‌ ఎడిషన్‌లో మాత్రం వక్రీకరించి ‘ఈనాడు’ మార్కు ఎల్లో జర్నలిజాన్ని చాటుకుంది. వివరాలివీ.. 

మహిళలు ధరించే లెహంగాల్లో ఓ ముఠా సింథటిక్‌ డ్రగ్స్‌ను దాచిపెట్టి హైదరాబాద్‌ నుంచి ఆస్ట్రేలియాకు తరలించే ప్రయత్నం చేసింది. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఇవి పట్టుబడ్డాయి. చెన్నైకి చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేయటంతో... ఏపీలోని నరసాపురం నుంచి బుక్‌ చేసినట్లు తప్పుడు చిరునామాలు సృష్టించారని ఎన్‌సీబీ అధికారుల విచారణలో బయటపడినట్లు వెల్లడించారు. జాతీయ మీడియా మొత్తం ఇదే రాసింది. హైదరాబాద్‌ ఎడిషన్లో ‘ఈనాడు’ కూడా కొంచెం అటూఇటుగా ఇదే రాసింది.  

చదవండి: (పూర్తి చేస్తోంది ఇప్పుడే..)

మరో సంఘటనలో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు కారులో వస్తున్న ఓ నలుగురిని అరెస్టు చేసి... వారి వద్ద పార్టీల్లో వాడే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని హైదరాబాద్‌లో పలు పార్టీల్లో వాడటానికి తెస్తున్నట్లుగా ఎన్‌సీబీ నిర్ధరించింది. ఈ ఘటనలో హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఒకరు విశాఖపట్నానికి చెందిన వ్యక్తి కాగా, మిగిలిన ముగ్గురూ బీహారీలు. హైదరాబాద్‌ ఎడిషన్లో ‘ఈనాడు’ కూడా అదే రాసింది. కాకపోతే ఇక్కడ కూడా లెహెంగాల్లో దాచి తెస్తున్నట్లు రాసిపారేసింది. 

‘ఏపీ’ ఎడిషన్లో పూర్తి విరుద్ధంగా... 
ఇక ఆంధ్రప్రదేశ్‌ ఎడిషన్‌కు వచ్చేసరికి ‘ఈనాడు’ అని విలువలూ వదిలేసింది. ఈ రెండింటినీ కలిపేసి ఒకే సంఘటనగా రాసిపారేసింది. అదే సంఘటనలో నరసాపురం నుంచి బుక్‌ చేసిన డ్రగ్స్‌ను బెంగళూరులో పట్టుకున్నారని, లెహెంగాల్లో దాచిన వీటిని స్వాధీనం చేసుకోవటంతో పాటు విశాఖపట్నానికి చెందిన ఓ వ్యక్తిని కూడా అరెస్టు చేశారని రాసేసింది. అంటే... ఏపీ వ్యక్తులు... ఏపీ నుంచి డ్రగ్స్‌ రవాణా చేసినట్లు చెప్పటమన్నమాట. ‘సాక్షి’తో సహా జాతీయ మీడియా మాత్రం ఈ రెండింటినీ వేర్వేరు ఘటనలుగానే... ఎన్‌సీబీ చెప్పినట్టే రాశాయి. మరి ‘ఈనాడు’ మాత్రమే ఎందుకిలా తప్పుడు రాతలు రాసినట్లు? ఆంధ్రప్రదేశ్‌ కాబట్టా?  

మరిన్ని వార్తలు