‘దుల్హన్‌’ని వదిలేసిందెవరు? 

25 Jun, 2022 05:58 IST|Sakshi

పేద ముస్లింలు వివాహం చేసుకుంటే రూ.50 వేలు చెల్లించేలా ‘దుల్హన్‌’ పథకం

2015లో జీవోల మీద జీవోలిచ్చినా ఏడాది తరవాతే అమలు చేసిన చంద్రబాబు

2018లో మిగతా వర్గాలకూ విస్తరిస్తూ ‘చంద్రన్న పెళ్లికానుక’గా పేరు మార్పు

అప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించని చంద్రబాబు

రెండేళ్లకే పథకాన్ని చాపచుట్టేసినా... కనీసం ప్రశ్నించని ‘ఈనాడు’, రామోజీ

పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లు... గ్రాఫిక్స్‌లో చంద్రబాబు దిట్ట!!. దేన్నయినా కాగితాలపై అద్భుతంగా చూపిస్తారు. అక్కడితో వదిలేస్తారు. ఆ తరవాత ఎవరు దాన్ని అమల్లోకి తెచ్చినా... క్రెడిట్‌ మాత్రం ఈయనదే!. ఒకవేళ అమలు చేయకపోతే... బాబు అంత గొప్ప పథకాన్ని తెచ్చినా వీళ్లు అమలు చేయలేదంటూ అవతలిపక్షాన్ని నిందించే డ్యూటీ రామోజీ రావుది. ఇలా ఈ ఇద్దరూ కలిసి ఆడే డ్రామాలకు ఇప్పుడు యావత్తు ఆంధ్రప్రదేశ్‌ విస్తుపోతోంది. కనీసం ప్రతిపాదనలను దాటి ముందుకు తీసుకెళ్లని టీసీఎల్‌ ప్రాజెక్టుకు భూములివ్వటం నుంచి అన్నీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వమే చేసినా... అది తాము తెచ్చినదంటూ ‘బాబు’ని మించిపోయి మరీ ఆయన తనయుడు లోకేశ్‌ చేసిన దిగజారుడు కామెంట్లు ఇలాంటి కోవలోనివే. ఆరంభంలో తప్ప అమల్లో చిత్తశుద్ధి లేకుండా బకాయిలు పెట్టి మరీ వదిలేసిన దుల్హన్‌... పారదర్శకత లేకుండా కావాల్సిన అతి కొద్ది మందికే అందించి... దానిక్కూడా బకాయిలు పెట్టి విద్యార్థుల్ని నడిమధ్యలో వదిలిపెట్టిన ‘విదేశీ విద్య పథకం’... అన్నీ ఈ కోవలోనివే. షరామామూలుగా... వీటిని అమలు చేయలేదంటూ రామోజీరావు ఆక్రోశం!!. ‘ఈనాడు’లో పతాక శీర్షికల్లో కథనం. అసలు బాబు... చినబాబు... రామోజీ కలిసి ఆడుతున్న ఈ డ్రామా వెనక వాస్తవాలేంటి? ఏది నిజం? చూద్దాం... 

పేద ముస్లింల పెళ్లికి రూ.50వేలు ఇచ్చేలా ‘దుల్హన్‌’ పేరిట పథకాన్ని 2015లో తెచ్చిన చంద్రబాబు... ఆ తరువాతి ఏడాదిలో... అంటే 2016లో ఆరంభించారు. రెండేళ్లు తిరక్కముందే... 2018 ఏప్రిల్‌ నుంచే దాన్ని ఆపేశారు. అలా... రెండేళ్లకే ‘దుల్హన్‌కు ధోకా’ ఇచ్చారు. కాకపోతే రామోజీరావుకు ఇవేవీ పట్టవు. చంద్రబాబు అత్యంత నిజాయితీగా ఆరంభించి... చివరిదాకా అమలు చేసినట్లు... ఆ తరవాత వచ్చిన ప్రభుత్వం దాన్ని అమలు చేయకుండా వదిలేసినట్లు ఆయనకు కలలొస్తుంటాయి. అందుకే దిగ్గున లేచి స్టోరీలు వండేస్తుంటారు.  

నిజానికి ముస్లింల కోసం ‘దుల్హన్‌’ పేరిట ఆరంభించినా... తరవాత మిగిలిన కులాలకూ దాన్ని వర్తింపజేస్తూ చంద్రన్న పెళ్లి కానుకగా పేరు మార్చిన చంద్రబాబు... 2018 ఏప్రిల్‌ నుంచే దరఖాస్తుదారులకు డబ్బులివ్వడం నిలిపేశారు. ఒక్క దుల్హన్‌ పథకంలోనే 2018–19లో 2,506 మంది మైనారిటీలకు రూ.12.54 కోట్లు చెల్లించకుండా బకాయి పెట్టేశారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీలను చేర్చాక ‘చంద్రన్న పెళ్లికానుక’గా మార్చినా... ఈ స్కీమ్‌లో 2018–19లో మొత్తం 19,636 మందికి రూ.82.41కోట్లు బకాయి పెట్టారు. 2019లో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి... మొదట ఈ బకాయిలు చెల్లించడంపై దృష్టిపెట్టారు.

ఆ తరవాత పథకం కింద అందించే నగదు మొత్తాన్ని గణనీయంగా పెంచి అమలు చేయాలని ప్రయత్నించారు. మరింత పారదర్శకంగా అమలు చేయడం కోసం దరఖాస్తుల నమోదు ప్రక్రియను ఆన్‌లైన్లోకి తీసుకొచ్చారు. అయితే... కోవిడ్‌ నేపథ్యంలో ప్రభుత్వాదాయం తగ్గి అమలు చేయలేకపోయిన మాట వాస్తవమేనని ప్రభుత్వమే ధైర్యంగా అంగీకరించింది కూడా.  

అదీ... జగన్‌ మార్కు ధైర్యం 
‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధైర్యంగా తమ ప్రభుత్వ ప్రోగ్రెస్‌ రిపోర్టును జనం ముందుంచారు. ఇందులో తమ ప్రభుత్వం వచ్చాక చేస్తామని చెప్పిన పనులు ఏమేం చేశామో.. ఏమేం చేయలేకపోయామో అందులో వివరించారు. చేసిన పనులకే మార్కులు వేసుకున్నారు. తాము అమలు చేయలేకపోయిన పథకాల్లో దుల్హన్‌ కూడా ఉంది.

అందుకే తమకు నూటికి నూరు మార్కులు కాకుండా 95 మార్కులే వచ్చాయని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. చేసింది చేసినట్లు.. చేయనిది చేయనట్లు చెప్పే ఈ ధైర్యం మీ చంద్రబాబుకు ఉందా.. రామోజీరావు గారూ? మరి బాబు నగదు చెల్లించకుండా బకాయిలు పెట్టినపుడు మీరెందుకు నిలదీయలేదు? మీ ‘ఈనాడు’లో కథనాలెందుకు రాయలేదు? నగదు చెల్లించకుండా బకాయిలు పెట్టేయటమంటే పథకాన్ని నిలిపేసినట్లేగా? దుల్హన్‌కు ధోకా ఎందుకిచ్చావని అప్పుడు ప్రశ్నించలేదేం? 

ఇదీ.. బాబు దుల్హన్‌ తీరు 
పెళ్లి కానుకలో నిర్ణయాలు ఇలా.. 
► 2015 ఏప్రిల్‌ 29న–ముస్లీం మైనారిటీ పేదల పెళ్లికి రూ.50వేలు ఆర్థిక సాయమిచ్చేలా చంద్రబాబు ప్రభుత్వం దుల్హన్‌ పథకాన్ని తెస్తూ ఉత్తర్వులిచ్చింది.  
► మొదట ఇచ్చిన జీవోకు సవరణలు చేస్తూ 2015 మే 26, సెప్టెంబర్‌ 15న మరో ఉత్తర్వు ఇచ్చింది.  అమలు మాత్రం ఆ తరవాతే అయ్యింది. 
► 2018 ఏప్రిల్‌ 18న దుల్హన్‌ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదలకు వర్తింపజేస్తూ... చంద్రన్న పెళ్లికానుకగా పేరు మారుస్తూ బాబు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 
► 2018 ఏప్రిల్‌ 29న చంద్రన్న పెళ్లి కానుక పథకాన్ని సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోకి తెస్తూ మరో ఉత్తర్వు ఇచ్చారు. నాటి నుంచి బకాయిలు పెట్టేశారు. మరి దీన్ని అమలు చేసినట్లు... ఆ తరువాత ప్రభుత్వం వచ్చి నిలిపేసినట్లు రాతలు రాయటం కరెక్టా?    

మరిన్ని వార్తలు