ఏది నిజం?: బాబు కోసమే ఆ ‘మత్తు’!! 

13 Jun, 2022 05:54 IST|Sakshi
బాబు సీఆర్‌డీఏ బాండ్లకు గంటకొడితే అద్భుతం... ఇపుడు తక్కువ వడ్డీకి బాండ్లు జారీ చేస్తే నేరం

మద్యం విక్రయాలు తగ్గుతున్నా వ్యతిరేక రాతలే

ప్రభుత్వానికి అడ్డం పడటమే ధ్యేయంగా రామోజీ కథనాలు

పదేళ్లుగా బాగుపడని శివారు రోడ్ల ఫొటోలు తీసి శివాలెత్తిన తీరు 

ఇసుక మేటలు వేసినా... తొలగించినా తప్పుడు రాతలతో దుష్ప్రచారం 

‘ఈనాడు’ కథనాలను ట్వీట్‌ చేస్తూ రెచ్చిపోయిన సీబీఎన్‌ దత్తపుత్రుడు 

వాటిని మళ్లీ తన వెబ్‌సైట్లలో ప్రచురించి బురద జల్లుతున్న ‘ఈనాడు’  

గోదావరిలో ఇసుక మేటలు వేస్తే!!... తొలగించకపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఆందోళన. పోనీ ఇసుకను తొలగిస్తుంటే!!... బంగారంలాంటి ఇసుకను కావాల్సిన వారికి కట్టబెట్టేసి తరలించేస్తున్నారంటూ ఆవేశం. మద్యం విక్రయాలు పెరిగితే!!... ఊరూరా మద్యం ఏరులై పారుతోందని, పేదల ఆరోగ్యాన్ని బలిపెడుతున్నారని ఆక్రందన. పోనీ... మద్యం విక్రయాలు తగ్గితే!!... ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందని, రేట్లు పెంచి సొమ్ము చేసుకుంటున్నారని గగ్గోలు. అంతేకాదు!! రోడ్లు బాగులేకుంటే పట్టించుకోవటం లేదంటూ అరుపులు. బాగు చేస్తుంటే అప్పులు తెచ్చేస్తున్నారంటూ పెడబొబ్బలు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నా... ఉద్యోగాల కల్పన పెరుగుతున్నా కూడా అవేమీ పట్టనట్లుగా అభివృద్ధి లేదని, వెనకబడిపోయామని దుష్ప్రచారం. ఇవన్నీ పది తలల రామోజీరావులోని రంగులు. ఆయన పుత్రిక ‘ఈనాడు’లో రోజూ పేజీల కొద్దీ పరిచే వార్తలు. పోనీ రామోజీలో ఇన్ని భావావేషాలు అన్నివేళలా ఉంటాయా అంటే.. ఆ ఛాన్సే లేదు. చంద్రబాబు నాయుడు కాకుండా వేరొకరు అధికారంలో ఉంటేనే ఈ వేషాలన్నీ బయటకు వస్తాయి. 

బాబు అధికారంలో ఉంటే ఐదేళ్లూ రోడ్లేయకపోయినా... రోడ్లేయటానికి ఉన్న ఇబ్బందులే రామోజీకి కనిపిస్తాయి. ఇసుక ఉచితమంటూ ఎమ్మెల్యేలు మాఫియా డాన్లలా మారి అమ్మేసినా  అదంతా ఆయన దృష్టిలో జనహితమే. బెల్టు షాపులు పెట్టి మద్యం ఊరూరా పారించినా... ఆ తప్పు తాగేవాళ్లదే తప్ప బాబుది కాదు. టీకొట్టు నడిపేవాళ్లని దావోస్‌ తీసుకెళ్లి.. వాళ్లకి కోట్లు తొడిగి ఎంఓయూలు చేసుకుంటే... వాళ్లంతా రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే పారిశ్రామికవేత్తలే.  ఇంతెందుకు!! బాబు ఎవరితో పొత్తు పెట్టుకున్నా... అది చారిత్రక అవసరమే. బాబు ఏం చేసినా... అది దేశ ప్రయోజనాల కోసమే. 

ఇప్పుడు కూడా చంద్రబాబు గెలవాల్సిన చారిత్రక అవసరాన్ని పదేపదే గుర్తు చేస్తూ ఇలాంటి దగుల్బాజీ రాతలు రాసేవాళ్లు ఆశిస్తున్నది ఒక్కటే. ఈ ప్రభుత్వానికి జనాదరణ తగ్గటం లేదు. కాబట్టి దీన్ని ఏ పనీ చేయకుండా కట్టడి చేయాలి. రాష్ట్రంలో కరెంటు, రోడ్లు, నీళ్లు ఏవీ లేవని విపరీతంగా దుష్ప్రచారం చెయ్యాలి. నిరుపేదల సంక్షేమాన్ని నిలిపేసేలా చెయ్యాలి. ఆదాయం తగ్గినా... అప్పులు మాత్రం తేనివ్వకూడదు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డికి ఉన్న జనాదరణ తగ్గిపోవాలి. తామెన్ని చేసినా ఆయనే గెలుస్తాడు కనక ప్రతిపక్షాలన్నీ కలిసిపోవాలి. లేకపోతే తామే కలిపేయాలి. ఏ మార్గంలో అయినా... ఎవరి సాయంతో అయినా అర్జెంటుగా చంద్రబాబును కుర్చీ ఎక్కించేయాలి. ‘ఈనాడు’ చూసేవారికి ఎవరికైనా అర్థమయ్యేది ఇదే!!.

ఏ రాష్ట్రానికైనా ప్రధాన ఆదాయ వనరులు తక్కువే. పన్నుల్లో అధికభాగం వచ్చేది మద్యం.. పెట్రోలు నుంచే. పెట్రోల్లో కేంద్రానిదే సింహభాగం. వీటితో పాటు రుణాలు, గ్రాంట్లు ఇతరత్రా ఆదాయంపైనే ఏ రాష్ట్ర బడ్జెట్టయినా నడుస్తుంది. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేదీ ఈ నిధులతోనే. అలాంటిది రాష్ట్రం ఒక వంక మద్య నియంత్రణకు కట్టుబడి షాపులు తగ్గించి.. బెల్టు షాపులు తీసేసి... అమ్మకాలను తగ్గిస్తూ పకడ్బందీ వ్యూహంతో ముందుకు కెళుతుంటే ఈ రాతలేంటి రామోజీ? రాష్ట్రానికి ఆదాయం వస్తే తప్పా? చంద్రబాబు హయాంలో ఏటేటా మద్యం విక్రయాలు విపరీతంగా పెరుగుతూ పోయినా మీ పెన్నులోంచి ఒక్క అక్షరమూ రాలి పడలేదెందుకు? 7.81 కాంపౌండెడ్‌ వృద్ధితో 2015–16లో 306 లక్షల కేసులుగా ఉన్న మద్యం విక్రయాలు 2018–19లో బాబు దిగిపోయే నాటికి ఏకంగా 384 లక్షల కేసులకు చేరాయి.

మద్య నిషేధ ఉద్యమాన్ని నడిపి... తన ఫిలింసిటీలో క్యాబరేలకూ ఓకే చేసిన ఉద్యమనేత రామోజీ  

బీరు విక్రయాలైతే 168 లక్షల కేసుల నుంచి ఏకంగా 227 లక్షలకు చేరాయి. నిజానికి అదే వృద్ధి నేటికీ కొనసాగితే 2021–22లో 481 లక్షల మద్యం కేసులు విక్రయించి ఉండాలి. కానీ వాస్తవంగా 266 లక్షల కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. దీన్నిబట్టే ప్రభుత్వం మద్య నియంత్రణకు ఏ స్థాయి కృషి చేస్తోందన్నది అర్థమవుతుంది. అంకెలు చెబుతున్న ఈ వాస్తవాలను కూడా రామోజీరావు పరిగణనలోకి తీసుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఎంత దారుణమైన వార్తలు రాసయినా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచటమే ఆయన ధ్యేయం. తనవాడైన చంద్రబాబును మళ్లీ పీఠంపై చూడాలన్నది ఆయన కల. జనం గుండెల్లో నిలిచి...ఎందరినైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్న  వైఎస్‌ జగన్‌ తన వాడు కాదు మరి!!. అదే అసలు తేడా.

పకడ్బందీ దుష్ప్రచారపు వ్యూహం
‘ఈనాడు’ సహా ఎల్లో పత్రికల్లో మొదట పతాక శీర్షికల్లో వేస్తారు. తరవాత ఆ వార్తను పట్టుకుని టీడీపీ నేతలు రకరకాలుగా మీడియాతో మాట్లాడతారు. అవన్నీ మళ్లీ ఆ మీడియా ప్రాధాన్యం ఇచ్చి ప్రచురిస్తుంది. వీటిని మళ్లీ టీడీపీ నేతలు సోషల్‌ మీడియా వేదికలపై పోస్ట్‌ చేస్తారు. ఈ పోస్ట్‌లనూ మీడియాలో సందర్భాన్ని బట్టి వేస్తారు. ఇదీ... నచ్చని ప్రభుత్వాలపై దుష్ప్రచారానికి ఎల్లో మీడియా చేసే పకడ్బందీ దుష్ప్రచార ప్రణాళిక. ఇప్పుడీ ప్రణాళికలో సీబీఎన్‌ దత్తపుత్రుడు కూడా చేరిపోయాడు. ‘ఈనాడు’ వార్తకు తన వెటకారపు పైత్యాన్ని జోడించి చెలరేగిపోయాడు. పథకం ప్రకారం దాన్ని మళ్లీ ‘ఈనాడు’ తన వెబ్‌సైట్లో పెట్టేసింది. ఇంకెన్నాళ్లు రామోజీ ఈ ఎల్లో జర్నలిజం? పత్రిక పేరిట రాజకీయాలెందుకు? నేరుగా రాజకీయాల్లో చేరిపోవచ్చుగా?

‘మత్తు’ ఎవరిది రామోజీరావు గారూ?
ఇక స్వయంగా రామోజీ విషయానికొస్తే... ఆయన ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మద్య నిషేధ ఉద్యమానికి సారథి. పోటీగా వచ్చిన ‘ఉదయం’ పత్రిక ఆర్థిక మూలాలు మద్యం డబ్బులోనే ఉన్నాయని భావించి... అందరినీ ఎగదోసి ఉద్యమాన్ని నడిపిన ‘నాయకుడు’. నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని దింపి... చంద్రబాబును ఎక్కించాక... నిషేధానికి తూట్లు పొడిచిన మహా పత్రికావ్రతుడు. ఇక ఇప్పుడు నేరుగా తన పేరిట పెట్టుకున్న ఫిలింసిటీలో మద్య ప్రవాహాన్ని పారిస్తూ... క్యాబరేలు, అర్థనగ్న నృత్యాలక్కూడా తెరలు తీసిన ఫక్తు వ్యాపారి. మరి ఇలాంటి వ్యక్తి నీతులు చెబితే ఎలా? తెలుగు రాష్ట్రాల్లో ఈ చరిత్ర తెలియనిదెవరికి?

ఇదే చంద్రబాబు అయ్యుంటేనా...!!
ఆదివారం ‘ఈనాడు’ అచ్చేసిన రామోజీ ‘మత్తు’ వార్తలో ప్రధానంగా పేర్కొన్న విషయం ఒక్కటే. ఇప్పుడున్న వడ్డీ రేట్లతో పోలిస్తే ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ చాలా ఎక్కువ వడ్డీకి రుణం తెచ్చేసిందని, అది మున్ముందు భారమైపోతుందని!!. నిజానికి ఏ ప్రభుత్వమైనా నేరుగా తను జారీ చేసే రాష్ట్రాభివృద్ధి బాండ్లపై తక్కువ వడ్డీయే చెల్లిస్తుంది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు జారీ చేసే బాండ్లపై మాత్రం కాస్త ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఇది జగమెరిగిన సత్యం. ఇదే కోవలో ఇపుడు రాష్ట్ర ప్రభుత్వ బాండ్లకు 8.03 శాతం వడ్డీ చెల్లిస్తుండగా బెవరేజెస్‌ కార్పొరేషన్‌ మాత్రం 9.32 శాతం వడ్డీతో బాండ్లు జారీ చేసింది. 

నిజానికిపుడు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగి అనిశ్చితి రాజ్యమేలుతోంది. గతనెల దేశంలో ద్రవ్యోల్బణం 7.79 శాతానికి చేరగా... గ్రామాల్లో ఈ రేటు 8.38 శాతంగా ఉంది. గత ఎనిమిదేళ్లలో ఇదే రికార్డు. అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరటంతో అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు పెంచింది. మన ఆర్‌బీఐ ఇదే బాటలో నడవగా... యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకూ ఈ ది«శగానే వెళుతోంది. ఇలాంటి సమయంలో 9.32 శాతం వడ్డీ అంటే చాలా తక్కువకిందే లెక్క. ఇదే గనక చంద్రబాబు చేసి ఉంటే రామోజీ మంగళహారతులు పట్టి మరీ పతాక శీర్షికల్లో బాబు గొప్పతనాన్ని, చాణక్యాన్ని కుమ్మేసేవారు. కానీ ముఖ్యమంత్రి జగన్‌ కనక ఈ అప్పు తేవటమే నేరమన్న తీరులో ధ్వజమెత్తుతున్నారు. 

టీడీపీ హయాంలో... అబ్బో!!
టీడీపీ హయాంలో ఏపీసీఆర్‌డీఏ బాండ్లు జారీ చేసి రూ.2,000 కోట్లు సమీకరించింది. అప్పట్లో రాష్ట్రాభివృద్ధి రుణాలకు ప్రభుత్వం 8.42 శాతం చెల్లిస్తుండగా... సీఆర్‌డీఏ 10.32 శాతం వడ్డీకి బాండ్లు జారీ చేసింది. రూ.1,300 కోట్ల మేర జారీ చేయగా రూ.2,000 కోట్లకు (1.5 రెట్లు) బిడ్లు వచ్చాయి. దీంతో చంద్రబాబును, ఆయనపై ఇన్వెస్టర్లకున్న నమ్మకాన్ని వర్ణిస్తూ ‘ఈనాడు’ ఆకాశానికి ఎత్తేసింది. బాబు ముంబయి వెళ్లి తన సక్సెస్‌పై ఇంటర్వ్యూలిచ్చారు. కానీ ఇపుడు తక్కువ వడ్డీకి బెవరేజెస్‌ కార్పొరేషన్‌ జారీ చేసిన బాండ్లకు ఏకంగా 4.5 రెట్ల స్పందన వచ్చింది. అయినా దీన్ని వ్యతిరేక కోణంలో చూస్తూ దుష్ప్రచారానికి పూనుకున్నారు రామోజీ జర్నలిజాన్ని ఏమనుకోవాలన్నది జనం విజ్ఞతకే వదిలిపెట్టాల్సిన అంశం.

ప్రభుత్వ సంస్థలు అప్పులు తెస్తే తప్పా?
ప్రభుత్వ రంగ సంస్థలు అప్పులు తేవటం నేరమన్నట్లు, అదేదో ఘోరమన్నట్లు రామోజీరావు గుండెలు బాదేసుకున్నారు. నిజానికి ప్రభుత్వ గ్యారెంటీతో ప్రభుత్వ పీఎస్‌యూలు అప్పులు తేవటమన్నది చంద్రబాబు హయాంలో బీభత్సంగా జరిగింది. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర పీఎస్‌యూలకు రూ.14,028 కోట్ల అప్పులు రాగా... వాటిని చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పాలనలో ఏకంగా రూ.59,250 కోట్లకు తీసుకెళ్లిపోయారు. అంటే దాదాపు నాలుగు రెట్లు పెంచేశారు. అయినా రామోజీకి ఎన్నడూ ఇది కనిపించకపోవటమే చిత్రాతిచిత్రం.

మద్యం తగ్గటం కనిపించటం లేదా?
మద్యాన్ని దశలవారీగా తగ్గించి, నియంత్రిస్తామని ఎన్నికలకు ముందే వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కూడా దానికే కట్టుబడి... దానికి తగ్గట్టే చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగా మద్యం దుకాణాల సంఖ్యను ఏకంగా 40 శాతం తగ్గించేశారు. బాబు హయాంలో ఏకంగా 4,300 మద్యం దుకాణాలుండగా... వాటి సంఖ్యను 2,934కు పరిమితం చేశారు. మద్యం షాపులకు అనుబంధంగా ఉండే పర్మిట్‌ రూమ్‌లను పూర్తిస్థాయిలో రద్దు చేశారు. దీనికితోడూ చంద్రబాబు ఊరూరా ప్రోత్సహించిన దాదాపు 43,000 బెల్టు షాపుల ఉనికే లేకుండా చేశారు. ఫలితంగా మద్యం వినియోగం రాష్ట్రంలో అంతకంతకూ తగ్గుతూ వస్తోంది. జనం దూరంగా ఉంటారన్న ఉద్దేశంతో ముందు చెప్పినట్లే కొన్నింటిపై రేట్లు పెంచారు. ఇవన్నీ నచ్చని రామోజీరావు తన దుష్ప్రచారాన్ని  కొనసాగిస్తూనే వస్తున్నారు. 

వైఎస్సార్‌ నోరు పారేసుకున్నారు.. చంద్రబాబు క్లాస్‌ పీకారు...
చంద్రబాబు, ఇతర నాయకుల విషయంలో రామోజీ రాసే వార్తల్లో ఎంత ‘విష’యం ఉంటుందన్నది ఈ చిన్న వార్తను చూస్తే తెలుస్తుంది. 2008 జూన్‌ 19న ఒకే రోజు అటు నాటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మీడియా సమావేశాలు నిర్వహించారు. అందులో కొందరు విలేకరుల తీరుపై ఇద్దరూ అసహనం వ్యక్తం చేశారు. కానీ దానిపై ‘ఈనాడు’ ప్రచురించిన వార్తలకు శీర్షికలేంటో తెలుసా? ఒకదానికేమో ‘మీడియాపై నోరు పారేసుకున్న వైఎస్‌’. మరోదానికేమో ‘మీడియాకు క్లాస్‌ పీకిన చంద్రబాబు’. అదీ కథ. ‘ఈనాడు’ జర్నలిజం గురించి, రామోజీ నీతినియమాల గురించి చెప్పటానికి ఇదొక్కటి చాలేమో. అదే విషయాన్ని ఆ మర్నాడు నాటి సీఎల్పీ ఎండగట్టింది.  

మరిన్ని వార్తలు