AP: కనికట్టొద్దు..‘కళ్లు’ పెట్టి చూడు.. విషం చిమ్ముతున్న ‘ఈనాడు’ 

12 Jun, 2022 03:25 IST|Sakshi
కేటీ రోడ్డు నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్న దృశ్యం

రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజులుగా రహదారుల మరమ్మతులు ముమ్మరం

118 పట్టణ స్థానిక సంస్థల్లో గుంతల గుర్తింపు  

33 సంస్థల్లో నూరు శాతం పనులు పూర్తి

అన్ని చోట్లా 50% పనులు పూర్తి

గుంతల గుర్తింపునకు యాప్‌.. ‘నాడునేడు’ కింద అప్‌లోడ్‌

ఈ వాస్తవాలన్నీ విస్మరించి విషం చిమ్ముతున్న ఈనాడు 

‘మనం వేసిందే ఫొటో.. రాసిందే వార్త.. నిజానిజాలు దేవుడికెరుక.. రాష్ట్రంలో సగం మందినైనా నమ్మించగలిగితే మన బాబుకు మేలు చేసినట్లే..’ అనే సిద్ధాంతంతో ‘ఈనాడు’ దినపత్రిక వాస్తవాలకు మసి పూస్తోంది. పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తోంది. కనికట్టు కథనాలతో ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వంపై విషం నింపుతోంది. రాష్ట్రంలో రహదారుల మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయన్న నిజానికి పాతర వేయాలని చూస్తోంది. పాత, మారుమూల శివారు ఫొటోలతో పతాక స్థాయిలో దుష్ప్రచారానికి తెరలేపింది. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో రోడ్ల పరిస్థితి నాడునేడు మచ్చుకు కొన్ని ఉదాహరణలతో ‘సాక్షి’ ప్రజల ముందుంచుతోంది.

విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోని కేబీఎన్‌ కళాశాల నుంచి చిట్టినగర్‌ జంక్షన్‌ వరకు ఉన్న కేటీ (కొత్తూరుతాడేపల్లి) రోడ్డు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ రోడ్డు తొలి ఫేజ్‌లో ఎడమ వైపు భాగంలో పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో అధిక ట్రాఫిక్, కల్వర్టుల నిర్మాణం దృష్ట్యా నిర్మాణ పనులు ఒక వైపు మాత్రమే జరుగుతున్నాయి. పనులు దాదాపు పూర్తయ్యాయి. చిట్టినగర్‌ జంక్షన్‌ నుంచి కేబీఎన్‌ కళాశాల వైపు ఇప్పటికే సర్వే పూర్తవగా చిట్టినగర్‌ ఏరియాలో పనులు ప్రారంభమయ్యాయి. ఈ వాస్తవాలను ‘ఈనాడు’ విస్మరించడం గమనార్హం.
విజయవాడలోని కేటీ రోడ్డుపై బురద జల్లుతూ ఈనాడు వేసిన ఫొటో..

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: పురపాలక, పట్టణాభివృద్ధి విభాగం నెల రోజులుగా నగరాలు, పట్టణాల్లో యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులకు నడుం బిగించడాన్ని పట్టించుకోని ‘ఈనాడు’.. పట్టణ రోడ్లను ప్రభుత్వం పట్టించుకోలేదని శుక్రవారం తప్పుడు కథనాన్ని వండి వార్చింది. ఇప్పటికే 118 పట్టణ స్థానిక సంస్థల్లో (యూఎల్‌బీ) గుంతలను గుర్తించిన అధికారులు వాటి మరమ్మతులకు రూ.60.53 కోట్లు విడుదల చేసి పనులు చేపట్టారు. కొన్నిచోట్ల గుంతలను పూడ్చగా, మరికొన్ని చోట్ల కొత్తగా సీసీ రోడ్లు వేశారు.

33 పట్టణాల్లో నూరు శాతం గుంతలు పూడ్చగా, 21 పట్టణాల్లో పనులు కొనసాగుతున్నాయి. మిగిలిన నగరాలు, పట్టణాల్లో పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు. రోడ్ల మరమ్మతుల కోసం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కమిషనరేట్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, ఆయా పట్టణ స్థానిక సంస్థల్లో జరుగుతున్న మరమ్మతు పనులను పర్యవేక్షిస్తున్నారు. దీంతో పాటు కొత్తగా ఏర్పడే గుంతలను కూడా పూడ్చడంతో పాటు, మున్సిపాలిటీల్లో ఈ అంశాన్ని నిరంతర ప్రక్రియగా చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

ఎప్పటికప్పుడు గుంతలను గుర్తించి వాటిని ఆన్‌లైన్‌ చేయడంతో పాటు పూడ్చిన తర్వాత నాడునేడు కింద వెబ్‌సైట్‌లో ఉంచుతున్నారు. కానీ ఇవేమీ పట్టని ఆ పత్రిక.. అన్ని చోట్లా ఏక కాలంలో పనులు నిర్వహించడం సాధ్యం కాదని తెలిసీ, విష ప్రచారానికి దిగింది. ఏ మున్సిపాలిటీలో రోడ్ల మరమ్మతు పనులు ఎలా జరుగుతున్నాయో మాట మాత్రం ప్రస్తావించకుండా, పురపాలక శాఖ వెబ్‌సైట్‌ను సైతం పరిశీలించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేసింది. 

శర వేగంగా పనులు
రాష్ట్రంలో మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలు ఉండగా, వాటిలో 118 పట్టణాల్లోనే 43,563 గుంతలు ఉన్నట్టు మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ అధికారులు గుర్తించారు. ఇప్పటి దాకా 34,316 గుంతలకు టెండర్లు ఖరారు కావడం.. 21,720 గుంతలను పూడ్చంతో పాటు, కొన్నిచోట్ల బీటీ రోడ్ల స్థానంలో సీసీ రోడ్లు కూడా వేశారు. అంటే 49.86 శాతం పాట్‌ హోల్స్‌ను పూడ్చారు. గ్రేటర్‌ విశాఖ, గుంటూరు, విజయవాడ నగరాల్లోని రోడ్లకు అత్యధికంగా గుంతలు ఉన్నట్టు లెక్క తేల్చారు.

అధికంగా దెబ్బతిన్న రోడ్లను జీవీఎంసీ, విజయవాడ, గుంటూరులోనే గుర్తించారు. విశాఖ మహానగరంలో 6,679 గుంతలను గుర్తించగా 4,208 (63 శాతం) గుంతలను పూడ్చారు. విజయవాడలో 6,314 పాట్‌ హోల్స్‌ ఉండగా, 4,400 (దాదాపు 70 శాతం) పూడ్చారు. గుంటూరు నగరంలో 3,482 గుంతలను గుర్తిస్తే వాటిలో 2,260 గుంతలు (65 శాతం) పూడ్చారు. మిగిలిన యూఎల్‌బీల్లో సైతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 

గుంతల గుర్తింపునకు యాప్‌ 
పట్టణాల్లో పాట్‌ హోల్స్‌ గుర్తింపునకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేకంగా యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. స్థానిక మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ సిబ్బంది నిత్యం పట్టణ రోడ్లను పర్యవేక్షిస్తూ వారి దృష్టికి వచ్చిన గుంతలను ఎప్పటికప్పుడు యాప్‌లో ఫొటోతో అప్‌లోడ్‌ చేయాలి. ఈ క్రమంలో ఆ చిత్రం ఏ ప్రాంతంలో ఉందో అక్షాంశాలు, రేఖాంశాలతో సహా సదరు మున్సిపల్‌ కమిషనర్‌తో పాటు మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ విభాగం, సీడీఎంఏ కార్యాలయంలోని ఉన్నత స్థాయి అధికారులకు సైతం చేరుతుంది.

గుంతలను పూడ్చిన అనంతరం తిరిగి అదే ప్రాంతంలో నుంచి ఫొటోను యాప్‌లో అప్‌లోడ్‌ చేయడం ద్వారా పనుల ప్రగతి తెలుసుకునేలా ఏర్పాటు చేశారు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన యాప్‌ పనితీరును పరిశీలించి, వార్డు ఎమినిటీ కార్యదర్శులు సులభంగా వినియోగించేలా కొన్ని మార్పులు చేస్తున్నారు. 

ఇది నిరంతర ప్రక్రియ 
పట్టణ స్థానిక సంస్థల్లో రోడ్లను బాగు చేయడమనేది మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల బాధ్యత. ఈ పనులు నిరంత ప్రక్రియ. 365 రోజులు పనులు చేయాల్సిందే. కేవలం వర్షాకాలం ముందు పనులు చేసి వదిలేస్తే సరికాదు. మరమ్మతు పనులపై సీడీఎంఏలోనూ పర్యవేక్షణకు ప్రత్యేకంగా అధికారులను నియమించాం.

స్థానికంగా పనులు జరుగుతున్న తీరు, ప్రగతిని తెలుసుకునేందుకు యాప్‌ను కూడా రూపొందించి, అందుబాటులోకి తెచ్చాం. త్వరలో జీవీఎంసీ, విజయవాడ కార్పొరేషన్లలో రోడ్ల మరమ్మతులకు ఆధునిక యంత్రాలను అందుబాటులోకి తేస్తాం. 
 -ప్రవీణ్‌ కుమార్, సీడీఎంఏ 


అంతటా అదే పరిస్థితి అని ఎలా చెబుతారు?
ఒక రోడ్డుకు సంబంధించి నాలుగు ఫొటోలు పెట్టి, ఒంగోలు నగరంలోని రోడ్లన్నీ ఇదే విధంగా ఉన్నాయనటం సమంజసం కాదు. కేశవరాజుకుంట రోడ్డు నిర్మాణ దశలో ఉంది. ఆ రోడ్డుకు పొడిగింపే ముక్తినూతలపాడు రోడ్డు. దీనికి నగరపాలక సంస్థ స్టాండింగ్‌ కమిటీ కూడా ఆమోదించింది.  
 – ఎం.సుందరరామి రెడ్డి, ఒంగోలు నగర పాలక సంస్థ మున్సిపల్‌ ఇంజనీర్‌ 

వేగంగా పనులు
ప్రకాశం జిల్లాలో దాదాపు రూ.716 కోట్లతో రోడ్ల మరమ్మతులు, విస్తరణ పనులు చేపట్టాం. పనులు వేగంగా జరుగుతున్నాయి. చాలా పనులు పూర్తయ్యాయి. రోడ్డు పనులకు సంబంధించి ఫొటో ఎగ్జిబిషన్‌ను కలెక్టరేట్‌లో నాలుగు రోజుల కిందటే ఏర్పాటు చేశాం. 
– మీడియాతో కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌ కుమార్, ఒంగోలు 

విజయనగరం కార్పొరేషన్‌లోని ఆర్‌అండ్‌బి రైతు బజారు నుంచి ఉడా కాలనీ మీదుగా అయ్యన్నపేట జంక్షన్‌ వరకు వెళ్లే రహదారిని విస్తరించాలని రెండేళ్ల క్రితం వీఎంఆర్డీఏ అధికారులు పనులు ప్రారంభించారు. ఆ మార్గంలోని పలు భవనాలకు పరిహారం చెల్లించి తొలగించేందుకు యత్నించగా కొందరు యజమానులు తమకు ఎక్కువ నష్టపరిహారం ఇవ్వాలని కోర్టును ఆశ్రయించడంతో పనులు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని విస్మరించి ఈ రోడ్డును అభివృద్ధి చేయలేదని ఈనాడు తప్పుడు కథనం ప్రచురించింది. 

మరిన్ని వార్తలు