‘విషం’ రామోజీరావు రాతల్లోనే!

27 Jun, 2022 02:30 IST|Sakshi

శాంపిళ్లను ట్యాంపర్‌ చేసి ప్రయివేటుకిస్తే కావాల్సినట్లుగా ఫలితాలు

టీడీపీ నేతలు అలా చేయలేదన్న గ్యారంటీ రామోజీరావు ఇవ్వగలరా?

ఏ శాంపిల్‌నైనా కేంద్ర ప్రభుత్వ ల్యాబ్‌లలో పరీక్షిస్తేనే ప్రామాణికత 

రాష్ట్రంలోని డిస్టిలరీలు కాలానుగతంగా తరచూ చేస్తున్నది అదే

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 20 డిస్టిలరీలూ 2019కు ముందు ఉన్నవే

20లో చంద్రబాబు అనుమతి ఇచ్చినవే 11.. అవన్నీ టీడీపీ పెద్దలవే

ఈ ప్రభుత్వం వచ్చాక అనుమతిచ్చిన డిస్టిలరీ ఒక్కటీ లేదు

అవే డిస్టిలరీల్లో... నాడు తయారైంది అమృతం...ఇప్పుడు విషమట!

సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు ‘ఈనాడు’తో కలిసి బాబు కుట్ర  

అన్నీ చంద్రబాబునాయుడి హయాంలో ఉన్న డిస్టిలరీలే. అత్యధికం ఆయన స్వయంగా అనుమతిచ్చినవే. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఒక్కటంటే ఒక్కటీ రాలేదు!. రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యం.. అప్పుడూ– ఇప్పుడూ అవే డిస్టిలరీల్లో తయారవుతోంది. మరి అప్పుడు అమృతంలా ఉండే మద్యం ఇపుడు విషమెందుకయింది? ఇక్కడ ఏం మారిందని?

ఏం మారిందంటే... ప్రభుత్వం!. చంద్రబాబునాయుడు గద్దెదిగిపోయి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి రావటంతో ప్రభుత్వం మారింది. దాన్ని చూసో.. చూడలేకో రామోజీరావు బుర్రా మారింది. దాన్లోకి నిలువెల్లా విషం చేరి... దగుల్బాజీ రాతలకు దిగారు. ప్రభుత్వానికి ఆదాయం వస్తున్న మార్గాలను ఏదో ఒకరకంగా దెబ్బతీసి... ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నీ ఆగిపోవాలనేది ఆయన కోరిక. అలాగైతేనే జగన్‌ ప్రజాదరణ తగ్గుతుందని... తగ్గితే తప్ప తమ చంద్రబాబుకు పుట్టగతులుండవనేది ఆయన ఉద్దేశం. అందుకోసమే ఈ విషపూరిత రాతలు. అసలు ‘మద్యంలో విషం’ అంటూ రాసిన రాతల్లో నిజమెంతో... ఎందుకు రాశారో ఒకసారి చూద్దాం...

రాష్ట్రంలో విక్రయించే మద్యాన్ని తయారు చేసేది ఇక్కడి డిస్టిలరీలే. అలాంటి డిస్టిలరీలు 20 ఉండగా వాటిలో 11 డిస్టిలరీలు చంద్రబాబు స్వయంగా అనుమతి ఇచ్చినవే. మిగతావి మునుపటి ప్రభుత్వాలు ఇచ్చినవి. వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక అనుమతిచ్చిన డిస్టిలరీ ఒక్కటంటే ఒక్కటీ లేదు. ఇక బ్రాండ్ల పేర్లంటే... వాటిని సమయానుకూలంగా మారుస్తుంటారు. ఆ సీజన్లో ఏ పేరైతే కాస్త బాగుంటుందని భావిస్తారో... అది పెడుతుంటారు.

ఉదాహరణకు ఆ సీజన్లో సచిన్‌ టెండూల్కర్‌ బాగా ఆడితే... ఆ పేరు పెట్టొచ్చు. టెండూల్కర్‌ సీజన్‌ అయిపోతే కోహ్లీ పేరు పెట్టొచ్చు. మద్యం క్వాలిటీ ఆధారపడేది ఈ బ్రాండ్ల పేర్లపై కాదు. తయారు చేసే డిస్టిలరీలపై. మరి అవన్నీ గతం నుంచీ ఉన్నవే. ఆ సంగతి రామోజీరావుకూ తెలుసు. కానీ ‘ఈనాడు’ విషపు రాతల్లో ఆ నిజాలేవీ కనిపించవు. డిస్టిలరీల ఊసెత్తకుండా... కేవలం మద్యం బ్రాండ్ల పేర్లు చెబుతూ... దాన్లో విషపూరిత అవశేషాలున్నాయంటూ దుర్మార్గపు ప్రచారానికి దిగుతోంది. 

పరీక్షించింది ఎవరు? పరీక్షలు ఎక్కడ?
ఓ రెండు బ్రాండ్లను పరీక్షిస్తే విషపూరిత అవశేషాలున్నాయని చెబుతూ... మొత్తం మద్యం విషపూరితంగా మారిందంటే దగుల్బాజీ కథనాన్ని వండి వార్చింది ‘ఈనాడు’. సరే! ఆ రెండు బ్రాండ్లనూ పరీక్షించింది ఎవరు? వాళ్లేమైనా మద్య నిషేధ ఉద్యమంలో ఉన్న సామాజిక కార్యకర్తలేమీ కాదు కదా? పచ్చి ఎల్లో బ్యాచ్‌. తెలుగుదేశం నాయకులు. అసలు ఈ పరీక్షలు చేయించడం వెనక టీడీపీ నాయకుల ఉద్దేశమేమై ఉంటుంది? వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమేనని ఊహించడానికి బుర్ర కూడా అక్కర్లేదు. పైపెచ్చు వాళ్లు పరీక్షించింది ప్రయివేటు ల్యాబుల్లో.

ఈ ల్యాబులు ఏం చేస్తాయంటే... మనం ఇచ్చిన శాంపిల్‌ని విశ్లేషించి.. నివేదిక ఇస్తాయి. అంటే... మనం ఏ శాంపిల్‌ ఇస్తే దాన్నే విశ్లేషిస్తాయి. మరి ఈ తెలుగుదేశం నేతలు రెండు బ్రాండ్ల మద్యం సీసాలను ప్రయివేటు ల్యాబుల్లో ఇచ్చినపుడు ఆ మద్యాన్ని మార్చలేదని (ట్యాంపర్‌ చెయ్యలేదని) గ్యారంటీ ఏమైనా ఉందా రామోజీరావు గారూ? నివేదిక ఎలా కావాలనుకుంటే అలాంటి శాంపిల్‌నే ఇచ్చే అవకాశం ఉంది కదా? ఎందుకింత దుర్మార్గపు చర్యలు? ఇంత నైచ్యానికి దిగజారారెందుకు? అసలు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబొరేటరీల్లో పరీక్షించొచ్చు కదా? రాష్ట్రంలో తయారయ్యే మద్యాన్ని ప్రతి డిస్టిలరీ కాలానుగతంగా కేంద్ర ప్రభుత్వ ల్యాబొరేటరీల్లో పరీక్షించాకే కదా.. మార్కెట్లోకి తెస్తున్నది.

అవైతే ప్రతి పరీక్షకూ కొన్ని ప్రామాణిక ప్రక్రియల్ని (ఎస్‌ఓపీ) పాటిస్తాయి. వాటి ప్రకారమైతే ట్యాంపరింగ్‌కు అవకాశం తక్కువ. కానీ వీళ్లు ఆధారపడింది చెన్నైలోని ఎస్‌జీఎస్‌ అనే ప్రయివేటు ల్యాబొరేటరీపై!. నిజానికి ఈ ఏడాది మార్చిలో ఇదే ల్యాబొరేటరీ నుంచి మద్యంపై ఇలాంటి నివేదికే వచ్చిందంటూ ‘ఈనాడు’ విషం గక్కింది. కాకపోతే అప్పట్లో 
ఈ పరీక్షలు చేయించింది చంద్రబాబు తొత్తుగా మారిన నరసాపురం ఎంపీ రఘురామరాజు.

ఆయన ద్వారా పరీక్షలు చేయించామని చెప్పి.. దానిపై దుష్ప్రచారం చేయాలని పన్నిన పన్నాగం... తాము అలాంటి నివేదిక ఇవ్వలేదని ఎస్‌జీఎస్‌ ల్యాబొరేటరీస్‌ స్వయంగా చెప్పటంతో బెడిసికొట్టింది. చివరికిప్పుడు తెలుగుదేశం నేతలే రంగంలోకి దిగి... ‘ఈనాడు’తో కలిసి దుష్ప్రచార వ్యూహానికి పదునుపెట్టడం వారి నైరాశ్యానికి పరాకాష్ట. 

బ్రాండ్లు బాబువి...డిస్టిలరీలు ఆయన మిత్రులవి 
రాష్ట్రంలోని డిస్టిలరీలన్నీ దాదాపుగా టీడీపీ కీలక నేతల కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయి. పీఎంకే డిస్టిలరీ టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేశ్‌కుమార్‌ది. ఆయన టీడీపీ నేత పుట్టా మధుసూదన్‌ యాదవ్‌కు కుమారుడు కూడా. శ్రీకృష్ణ ఎంటర్‌ప్రైజస్‌ టీడీపీ మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవుల నాయుడు కుటుంబానిది. ఇక ఎస్పీవై ఆగ్రో ప్రొడక్టŠస్‌ టీడీపీ నేత, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబానిది. వైఎస్సార్‌సీపీ తరపున ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డిని నిబంధనలకు విరుద్ధంగా టీడీపీలో చేరినందుకు నజరానాగా ఆ డిస్టిలరీకి చంద్రబాబు అనుమతిచ్చారు.

ఇక బాబు ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు ఆగమేఘాల మీద 2019, ఫిబ్రవరి 25న అనుమతినిచ్చిన విశాఖ డిస్టిలరీస్‌లో టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు వాటాదారు. ఆయన గతేడాదే దాన్నుంచి బయటకు వచ్చారు. ఇలా డిస్టిలరీలన్నీ టీడీపీ నేతల చేతుల్లో ఉంటే... వాటిలో నాసిరకం మద్యం తయారవుతోందంటూ వైసీపీ ప్రభుత్వంపై గగ్గోలు పెట్టడం ఏ రకం పాత్రికేయం రామోజీ? దీనికితోడు ఇపుడు రాష్ట్రంలో విక్రయిస్తున్న బ్రాండ్లన్నీ... దాదాపుగా చంద్రబాబు ప్రభుత్వం 2014–19 మధ్యన అనుమతించినవే. చేతిలో రెండుపత్రికలు, నాలుగు చానళ్లున్నాయి కాబట్టి మేం ఎన్ని అబద్ధాలైనా ఆడతామంటే ఎలా? దాస్తే నిజం దాగుతుందా?

విషపూరిత అవశేషాలు లేవు 
గతానికన్నా రెట్టింపు నమూనాల పరీక్ష...
రఘురామరాజు... టీడీపీ నేతల మాదిరిగా ప్రభుత్వమంటే గిట్టనివాళ్లు మోసపూరిత నివేదికలతో ప్రజల్ని తప్పుదారి పట్టించే అవకాశాలు ఎక్కువ. అందుకే నాణ్యత పరీక్షలకు కేంద్రం తగిన విధివిధానాలను నిర్దేశించింది. వాటిని రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తూనే ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏడాదికి 90 వేల మద్యం నమూనాలు పరీక్షించగా... ఈ ప్రభుత్వంలో రెండేళ్లుగా ఏడాదికి 1.50 లక్షల నమూనాలు చొప్పున పరీక్షిస్తున్నారు.

ఎన్ని ఎక్కువ పరీక్షలు జరిపితే నాణ్యత అంతలా ఉంటుందన్నది నిజం కాదా రామోజీ? రాష్ట్రంలోని బ్రాండ్లను ఐదు ప్రాంతీయ ల్యాబొరేటరీల్లో ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ తగిన ప్రమాణాలున్న వాటినే మార్కెట్లోకి తెస్తుండటం అబద్ధమా? సొంత శాంపిళ్లను మీరే పంపి... నివేదికలో విషపూరిత అవశేషాలున్నాయని తేలిందని మీరే చెప్పి... దాని ఫలితాలేంటో కూడా మీరే చెప్పేసి ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దామని? చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా, మీరు పత్రికాధిపతిగా ఉండటమే ఈ రాష్ట్రం దౌర్భాగ్యమా? ఇంకా ఎన్నాళ్లీ రాజకీయ రాతలు?  

మరిన్ని వార్తలు