విద్యార్థులు పెరిగితే మీ బాధేంటి?

30 Jan, 2023 04:15 IST|Sakshi

విద్యా రంగంలో కలలో సైతం ఊహించని సంస్కరణలకు జగన్‌ శ్రీకారం

ఫలితంగా విద్యలో అగ్రస్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్‌

ఈ వాస్తవాలను ఏనాడూ ప్రస్తావించని రామోజీరావు  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లను, వాటిలోని విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నాలు చరిత్రలో ఇదివరకెన్నడూ జరగలేదు. అసలు ఆ ఆలోచనే చెయ్యలేదు. ఇక్కడి విద్యార్థులు కార్పొరేట్‌ స్కూళ్ల పిల్లలకన్నా ఒక మెట్టు పైనే ఉండేలా... ప్రభుత్వమిస్తున్న జగనన్న విద్యాకానుక పైనా ‘ఈనాడు’ దుష్ప్రచారానికి దిగింది. వాస్తవాలకు మసిపూసి... ‘కిట్లు కొన్నారు–కోట్లు తిన్నారు’ అంటూ పచ్చి అబద్ధాల వంటకాన్ని జనంలోకి వదిలింది.

జగనన్న విద్యాకానుక  కింద... బైలింగ్యువల్‌ పాఠ్యపుస్తకాలతో పాటు 3 జతల యూనిఫారం, షూలు, సాక్సులు, బెల్టు, బ్యాగు, నోటు పుస్తకాలు, వర్కుబుక్కులు, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ అందిస్తూ విద్యార్థుల  చదువుల్లో విప్లవాత్మకమైన మార్పు తెచ్చారని ఎన్నడూ ఒక్క మంచిమాట కూడా రాయని రామోజీరావు... అసత్య సమాచారంతో మాత్రం బాగానే చెలరేగిపోయారు. గతంలో అరకొరగా ఇచ్చే పాఠ్యపుస్తకాలు... 8 నెలలు గడిచినా, కొన్ని సందర్భాల్లో  విద్యా సంవత్సరం ముగిసిపోయినా అందేవి కావు.

తన పాదయాత్రలో ఈ పరిస్థితిని గమనించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి... అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని చక్కదిద్దే పని మొదలెట్టారు. విద్యాసంవత్సరం ప్రారంభమైన తొలి రోజే పుస్తకాలు అందించాలనుకున్నారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫారమే కాకుండా విద్యార్థులకు అవసరమైన ఇతర వస్తువులనూ కిట్‌లో చేర్చి ‘జగనన్న విద్యాకానుక’గా అందిస్తున్నారు.

స్వయంగా ముఖ్యమంత్రే ఆయా వస్తువుల నాణ్యతను పరిశీలించిన అనంతరం టెండర్ల ద్వారా ఏటా విద్యార్థులకు సకాలంలో కిట్లు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడైనా నాణ్యతలో లోపాలుంటే వాటిని తిరిగి సరిచేసి మళ్లీ కొత్తవి విద్యార్థులకు అందేలా చేస్తున్నారు.  

ఇవి వచ్చే ఏడాది కోసమని మరిచారా? 
ఇలా విద్యాసంవత్సరం ప్రారంభం రోజునే అందరికీ కిట్లు అందించాలంటే ఆరేడు నెలల ముందు నుంచే కసరత్తు మొదలుకావాలి. అంటే... వచ్చే విద్యా సంవత్సరం కోసం ఈ ఏడాదే కసరత్తు మొదలవుతుంది. మరి ప్రతి విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరుగుతుంటుంది కదా? అప్పటికప్పుడు పెంచటం సాధ్యం కాదు కదా? అందుకే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల ప్రస్తుత సంఖ్యకు 5 శాతం జోడిస్తున్నారు. ఆ మేరకు పెరుగుదలను అంచనా వేసి టెండర్లు పిలుస్తున్నారు.

ఒకవేళ  పిల్లలకు ఇచ్చాక మిగిలిపోతే వాటిని తదుపరి ఏడాదికి సర్దుబాటు చేస్తూ... ఈ మేరకు కొత్తగా కొనే వాటి సంఖ్యను తగ్గిస్తున్నారు. ఇది ప్రతి ఏటా జరుగుతున్న వాస్తవం కాగా... దీనికి ‘ఈనాడు’ మసిపూసింది. ఇలా మిగిలిపోయిన వస్తువుల వల్ల రూ.162 కోట్లు వృథా అంటూ తప్పుడు సమాచారంతో ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నం చేసింది.

నిజానికి వస్తువుల్లో నాణ్యత లోపాలుంటే వాటిని వాపస్‌ తీసుకొని కొత్తవివ్వాలన్న నిబంధన సైతం ప్రతి ఏటా తప్పనిసరిగా అమలు చేస్తున్నారు. ఇటీవల కొన్ని పాఠశాలల విద్యార్థులకు అందించిన బ్యాగుల్లో లోపాలు కనిపించగా ఆయా కంపెనీల ద్వారా తిరిగి కొత్తవి పంపిణీ చేయించారు. ‘ఈనాడు’ మాత్రం అవాస్తవాల ప్రచారమే లక్ష్యంగా చెలరేగిపోయింది. 

ఈ మంచిని ఏనాడైనా ప్రశంసించారా? 
ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు మంచి సౌకర్యాలు అందించడానికి, కార్పొరేట్‌ స్కూళ్ల మాదిరిగానే వారికి మౌలిక సదుపాయాలను అందించడానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దార్శనిక ఆలోచనలతో ప్రభుత్వం ‘నాడు–నేడు’ పేరిట మహాయజ్ఞాన్ని ఆరంభించటం తెలిసిందే. గోరుముద్ద ద్వారా మధ్యాహ్నం భోజన పథకంలో నాణ్యతను తెచ్చారు. న్యాయ పోరాటాలను సైతం దాటుకుని... ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియంలో బోధన ప్రారంభించారు.

సీబీఎస్‌ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు ఉత్తమ ప్రమాణాలతో కూడిన బోధన కోసం అంతర్జాతీయ ఎడ్యుటెక్‌ కంపెనీ ‘బైజూస్‌’తో ఒప్పందం చేసుకున్నారు. బైజూస్‌  కంటెంట్‌తో కూడిన ట్యాబులను విద్యార్థులకు ఉచితంగా అందించారు. త్వరలో డిజిటలీకరణ పద్ధతుల్లో బోధనకోసం ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యా­నెల్స్, టీవీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తోంది.

వీట­న్నిటి ఫలితంగానే ఇటీవలి పెర్‌ఫార్మెన్సు గ్రేడింగ్‌ ఇండెక్సులో కానీ, అసర్‌ సర్వే నివేదికలో కానీ, అంతకు ముందు ఇండియాటుడే వంటి సంస్థలు నిర్వహించిన సర్వేల్లో కానీ పాఠశాల విద్యాప్రమాణాలు ఎంతో మెరుగుపడి ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఒక్క విద్యారంగంలో సంస్కర­ణలకే రూ.55వేల కోట్ల వరకు ఖర్చు చేశారంటే ముఖ్యమంత్రి ఈ రంగానికిస్తున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు.

గతంలో చంద్రబాబు నాయుడి హయాంలో పాఠశాల విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసినా... విద్యాసంవత్సరం చివరి వరకు పాఠ్యపుస్త­కాలు, యూనిఫారం వంటివి ఇవ్వకపోయినా అద్భు­­తంగా ఉందంటూ కథనాలు రాసిన ‘ఈనాడు’­­­­ప్రస్తుత ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న కార్యక్రమా­లను ఒక్కనాడూ ప్రశంసించకపోవటమే విచిత్రం.

అత్యంత పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ
విద్యాకానుక కొనుగోళ్ల విషయంలో టెండర్ల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాల తనిఖీకి ఈ ఏడాది క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాతో కూడా ఒప్పందం చేసుకున్నారు. ఎక్కడైనా సమస్య ఉంటే... విద్యార్థులు ఇబ్బంది పడకుండా వెంటనే రీప్లేస్‌ చేయడానికి... అదనంగా తెప్పించుకున్న నిల్వలు ఉపయోగపడుతున్నాయి. బెల్టులు, నోటు పుస్తకాలు, బూట్లు, డిక్షనరీలలో ఎటువంటి మార్పులు లేనందున వాటిని తర్వాతి విద్యా సంవత్సరంలో వాడుకునేలా ఇప్పటికే ఆదేశాలిచ్చారు.

10 రకాల వస్తువుల పంపిణీ
జగనన్న విద్యాకానుక ద్వారా మొత్తం 10 రకాల వస్తువులను ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ప్రతిఏటా పాఠశాలలు ప్రారంభానికి ముందే అందిస్తోంది. పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్, వర్క్స్‌ బుక్స్, పిక్టోరియల్‌ డిక్షనరీ ( 1–5 తరగతులకు), ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ ( 6 –10 తరగతులకు), స్కూలు బ్యాగు, షూ, 2 జతల సాక్సులు, యూనిఫాం, కుట్టుకూలి డబ్బులు, బెల్టు మొత్తం పదిరకాలు మూడేళ్లనుంచి విజయవంతంగా అందిస్తోంది.

మొత్తంగా మూడేళ్లలో విద్యాకానుక కోసం సుమారు రూ.2,324 కోట్లను  ప్రభుత్వం ఖర్చు చేసింది. వరుసగా నాలుగో ఏడాది 2023–24 విద్యా సంవత్సరంకోసం మరో రూ.1042.53 కోట్లు ఖర్చు చేసేందుకు ఇప్పటికే టెండర్లను పూర్తి చేసింది. ఏటా స్కూళ్లలో ఉన్న విద్యార్థుల సంఖ్యకు అదనంగా 5 శాతం కలుపుకుని ఆ మేరకు పంపిణీ చేయాల్సిన సంఖ్యను నిర్ణయి­స్తోంది. ఒకవేళ పంపిణీ అనంతరం విద్యాకానుక వస్తువుల్లో ఏం మిగిలిపోయినా కూడా... వాటిని తదుపరి సంవత్సరంలో వాడుకుంటున్నారు.  

విద్యాకానుక విప్లవాత్మక పథకం 
విద్యాకానుక విషయమై తమ నుంచి ఎలాంటి వివరణ కూడా అడగకుండా అభూత కల్పనలతో కథనాన్ని రాశారని విద్యాశాఖ తప్పుబట్టింది. జగనన్న విద్యా కానుక ద్వారా విద్యా­సంవత్సరం ప్రారంభానికి ముందే  పుస్తకాలు, యూనిఫారం.. మొత్తం 10 రకాల వస్తువులను ప్రభుత్వం అందిస్తోందని, గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని విద్యా­శాఖ పేర్కొంది. పాఠశాలలు ప్రారంభమై నెలలు గడుస్తున్నా... పరీక్షలు వస్తున్నా... పాఠ్యపుస్తకాలు సహా ఏవీ అందని పరిస్థితి గతంలో ఉండేదని వివరించింది. 

మరిన్ని వార్తలు