రామోజీ ‘రక్త’ కన్నీరు!

4 Apr, 2023 04:19 IST|Sakshi
మద్యం సీసాలను ధ్వసం చేస్తున్న అధికారులు (ఫైల్‌)

కాంగ్రెస్‌ హయాంలో సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమానికి మద్దతు 

చంద్రబాబు అధికారంలోకి రాగానే దానిని అటకెక్కించారు 

ఫిల్మ్‌సిటీ కోసమే ఈ డ్రామా అంతా.. ఇది రక్తమాంసాలతో వ్యాపారం కాదా రామోజీ? 

చంద్రబాబు హయాంలో ఏరులై పారిన మద్యం.. టీడీపీ నేతల గుప్పెట్లోనే మద్యం సిండికేట్‌  

43వేల బెల్ట్‌ దుకాణాలతో దోపిడీ 

పర్మిట్‌ రూమ్‌లు పెట్టి మరీ తాగించారు కదా రామోజీ 

అప్పుడు రక్తమాంసాలతో వ్యాపారం అనిపించలేదా? 

దశల వారీగా మద్య నియంత్రణను సమర్థంగా అమలుచేస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం  

నాటి బెల్ట్‌ షాపులు, పర్మిట్‌ రూమ్‌లన్నీ రద్దు.. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు

ప్రైవేటు మద్యం సిండికేట్‌కు చెక్‌ 

మద్యం దుకాణాల సంఖ్య 4,380 నుంచి 2,934కు తగ్గింపు 

మద్యం దుకాణాల వేళలు కుదింపు, షాక్‌ కొట్టేలా మద్యం ధరలు 

మేనిఫెస్టోకు కట్టుబడే ప్రభుత్వ మద్య విధానం.. దాంతో భారీగా తగ్గిన మద్యం అమ్మకాలు  

కళ్లుండి ఇవేవీ చూడలేని కబోదిలా రామోజీ విషపు రాతలు  

ఏది నిజం ?

రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేయాలో రామోజీ కంటిచూపుతో డిసైడ్‌ చేస్తాడు.. కాంట్రాక్టులు ఎవరికి కట్టబెట్టాలో ఆయనే శాసిస్తాడు.. విధానపరమైన నిర్ణయాలనూ రామోజీరావే నిర్దేశిస్తాడు.. ఇదంతా 2019 చంద్రబాబు హయాం వరకు ఉన్న పరిస్థితి. అప్పటి వరకు ఆయన ఆడింది ఆట.. పాడింది పాటగా సాగింది.. చెల్లింది కూడా.

ఆ తర్వాత సీన్‌ మారింది..
ఇప్పుడు నాలుగేళ్లుగా రాష్ట్రంలో రామోజీ ఆటలు సాగడంలేదు.. తన సమీప బంధువు నుంచి పోలవరం కాంట్రాక్టు మొదలుకుని నిన్నమొన్నటి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ వరకూ ఆయనకు తరచూ నోట్లో పచ్చివెలక్కాయలు పడుతున్నాయి. గొంతులో ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్నది జీ హుజూరంటూ తలూపే చంద్రబాబు సర్కారు కాదు కదా.. పుష్కలంగా ప్రజామద్దతు ఉన్న వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఇది. పైగా తన జేబులో మనిషి.. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ చంద్రబాబు వైభవం మరోవైపు మిణుకుమిణుకుమంటోంది. దీంతో రామోజీకి దిక్కుతోచడంలేదు..సరికదా పిచ్చెక్కినట్లు ఉంటోంది.

అంతే.. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు వైఎస్‌ జగన్‌ సర్కారుపై అడ్డగోలుగా.. తన పాఠకులు విసుగెత్తిపోయారనే కనీస స్పృహ కూడా లేకుండా నిత్యం కలంకూట విషం చిమ్ముతున్నాడు. అందులో భాగంగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వ మద్య విధానంపై వాస్తవాలను వక్రీకరిస్తూ ‘రక్త మాంసాలతో వ్యాపారం’ అంటూ ఎప్పటిలాగే మరోసారి విషం కక్కాడు. ఈ విషబీజాలు మీకు కిక్కు ఇస్తాయేమోకానీ మీరనుకున్న లక్కు నెరవేరదు రామోజీ..!
నిత్యం అబద్ధాలు అల్లుతూ రాసే విషపు రాతలోని పచ్చినిజం ‘ఏది నిజం’.. ఇదిగో...

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ మద్య విధానంపై వాస్తవాలను వక్రీకరిస్తూ ‘రక్త మాంసాలతో వ్యాపారం’ అంటూ ఈనాడు మరోసారి విషం చిమ్మింది. చంద్రబాబు అధికారంలో లేడన్న బాధ.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా విజయవంతంగా కొనసాగుతున్నారన్న అక్కసు అంతా కలగలిపి మరీ అక్షరాల్లో కూర్చి తన కరపత్రికలో కడుపుమంట తీర్చుకున్నాడు రామోజీ.

కానీ, వాస్తవం ఏమిటంటే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమర్థంగా అమలుచేస్తున్న మద్యం విధానం అందిస్తున్న ఫలాలు ఏమిటో ప్రజలకు తెలుసు.. బెల్ట్‌ దుకాణాల్లేని పల్లెలకు తెలుసు.. పర్మిట్‌రూమ్‌లు లేని ఊర్లకు తెలుసు.. మద్యం రేట్లు అమాంతంగా పెరగ­డంతో ఆ వ్యసనానికి తమ భర్తలు, పిల్లలు క్రమంగా దూరమవుతుండటంతో ఊరట చెందుతున్న అక్కా­చెల్లెమ్మలకు తెలుసు.. దశాబ్దాలుగా నాటుసారా తయారీ తప్ప మరో దిక్కులేని అగత్యం నుంచి బయటపడి, ప్రస్తుతం దర్జాగా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలతో సామాజిక గౌరవం పొందుతున్న కుటుంబాలకు తెలుసు.. సంక్షేమ పథకాలతో ఆర్థిక వృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద కుటుంబాలకూ తెలుసు. ప్రజలు అందరికీ వాస్తవాలు తెలుసు అన్నదే ఈనాడు రామోజీరావు దుగ్థ. ప్రజలు చంద్రబాబును ఏమా­త్రం నమ్మడం లేదనే ఆయన ఆక్రోశం. వైఎస్‌ జగన్‌­మోహన్‌రెడ్డిపట్ల జనాదరణ రోజురోజుకు మరింతగా పెరుగుతుండడమే ఆయన ఆందోళన. అందుకే తనకు అలవాటైన రీతిలో విష ప్రచారంతో ప్రజల్ని తప్పు­దారి పట్టించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. రామోజీ, చంద్రబాబు ద్వయానికి కష్టంగా ఉన్నా సరే వారు ఇప్పటికైనా గుర్తించాల్సిన వాస్తవం ఏమిటంటే.. మీ టైమ్‌ అయిపోతోంది.. మీ కట్టుకథలకు కాలం చెల్లింది. తెలుస్తోందా రామోజీ..

అప్పట్లో మూడు పర్మిట్‌ రూమ్‌లు..ఆరు బెల్ట్‌ దుకాణాలు..
మద్యం విక్రయాలను దశల వారీగా నియంత్రిస్తామన్న మేనిఫెస్టోలోని హామీని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోటీడీపీ నేతల మద్యం సిండికేట్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మూడు పర్మిట్‌ రూమ్‌లు.. ఆరు బెల్ట్‌ దుకాణాలుగా మద్యం ఏరులై పారిందన్న నిజం పాపం రామోజీరావుకు గుర్తుండి ఉండదు. అప్పట్లో మద్యం మాఫియా యథేచ్ఛగా ప్రజలను దోపిడీ చేసింది. మద్యం దుకాణాలన్నీ టీడీపీ నేతల గుప్పెట్లోనే ఉండేవి. వేళాపాళా లేకుండా 24గంటలూ మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగేవి. ఎమ్మార్పీ ధరల కంటే 25శాతం వరకు అధిక ధరలకు అమ్ముతున్నా సరే నాడు ఎక్సైజ్‌ శాఖ చోద్యం చూస్తూ ఉండాల్సి వచ్చేది. 

సీఎంగా జగన్‌ వచ్చాక..
కానీ, ఈ మద్యం మాఫియా అరాచకాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్క విధాన నిర్ణయంతో తుడిచిపెట్టేశారు. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని ఆయన రద్దుచేశారు. 2019, అక్టోబరు 1 నుంచి మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వపరం చేసేశారు. దాంతో రాష్ట్రంలో మద్యం మాఫియాను తుదముట్టించారు. అందుకోసం..

మద్యం దుకాణాల వేళలు కుదింపు
ప్రైవేటు వ్యక్తులు అయితే ఎంతగా మద్యం విక్రయాలు పెంచితే తమకు అంతటి లాభం వస్తుందని అనుకుంటారు. ప్రస్తుతం మద్యం దుకాణాలు ప్రభుత్వానివే కాబట్టి మద్యం అమ్మకాలను ప్రోత్సహించాల్సిన అవసరమేలేదు. ఇక మద్యం విక్రయాల సమయాలను బాగా కుదించారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రైవేటు మద్యం దుకాణాలు ఉ. 10గంటల నుంచి రాత్రి 11గంటల వరకు అధికారంగా విక్రయాలు సాగించేవి. అనధికారికంగా 24గంటలూ విక్రయిస్తూ ఉండేవి. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం మద్యం దుకాణాల సమయాన్ని కుదించి కచ్చితంగా అమలుచేస్తున్నారు. ఉ.10గంటల నుంచి రాత్రి 9గంటల వరకే విక్రయాలను అనుమతించారు. 

బెల్ట్‌ షాపులు, పర్మిట్‌ రూమ్‌ల రద్దు
అంతేకాదు.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుబంధంగా రాష్ట్రంలో 43వేల బెల్ట్‌ దుకాణాలు ఉండేవి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బెల్ట్‌ దుకాణాలను పూర్తిగా తొలగించింది. టీడీపీ ప్రభుత్వంలో మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్‌ రూమ్‌లకు అనుమతించారు. అంటే మద్యం దుకాణాలే అనధికారికంగా బార్లుగా కూడా చలామణి అయ్యేవి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే ఇవీ రద్దయ్యాయి. 

మద్యం దుకాణాలు క్రమంగా తగ్గింపు
చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో 4,380 మద్యం దుకాణాలు ఉండేవి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాలను పూర్తిగా తొలగించి ప్రభుత్వ పరం చేసింది. అంతేకాదు.. మద్యం దుకాణాలను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. 2019లో రాష్ట్రంలో 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండగా ప్రస్తుతం 2,934 ప్రభుత్వ మద్యం దుకాణాలే ఉన్నాయి. ఈ సంఖ్యను ఇంకా తగ్గించే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. ఇవన్నీ కాదనగలరా రామోజీరావుగారూ..

బార్ల సంఖ్య పెంచలేదు
టీడీపీ ప్రభుత్వం ఏటా బార్ల సంఖ్యను పెంచేది. కానీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బార్ల సంఖ్యను పెంచలేదు. 2019లో ఖరారుచేసిన 840 బార్లే ఉన్నాయి. కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు. 

భారీగా తగ్గిన మద్యం అమ్మకాలు
ఇక దశలవారీగా మద్య నియంత్రణ విధానం కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం  చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం విక్రయాలను సగానికి పడిపోయాయి. అందుకు ఈ గణాంకాలే తార్కాణం..

మేనిఫెస్టోలో హామీ మేరకే షాక్‌ కొట్టేలా మద్యం ధరలు..
మద్యం విక్రయాలను నిరుత్సాహపర్చడమే తమ పార్టీ విధానమని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లోనూ మేనిఫెస్టోలోనూ స్పష్టంగా చెప్పారు. తద్వారా పేదలను మద్యం వ్యసనానికి దూరం చేయాలన్నది తమ విధానమన్నారు. అంతేగానీ, మద్యం విక్రయాలను ప్రోత్సహించి సొమ్ము చేసుకోవడం ప్రభుత్వ లక్ష్యం కాదని ఆయన స్పష్టంచేశారు.

అదేమాటకు కట్టుబడుతూ అధికారంలోకి వచ్చాక మద్యం ధరలను షాక్‌ కొట్టేలా పెంచారు. అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ (ఏఆర్‌ఈటీ) పన్నునూ విధించారు. దాంతో మద్యం ధరలు పెరిగాయి. ప్రభుత్వం అమలుచేస్తున్న దశలవారీ మద్య నియంత్రణతో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. మరోవైపు.. మద్యం వ్యసనాన్ని నిరుత్సాహ పరిచేందుకు విధించిన ఏఆర్‌ఈటీ పన్నుతో మద్యం రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

ఈ వాస్తవాన్ని రామోజీ వక్రీకరిస్తూ రాష్ట్రంలో మద్యం విక్రయాలు పెరిగాయని ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కిందామీదా పడు­తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. పేదలు మద్యం వ్యసనానికి క్రమంగా దూరమవుతున్నారు. పేదలు మద్యానికి దూరమవుతుండటం కూడా రామోజీరా­వుకు ఆవేదన కలిగిస్తుందంటే నిజంగా ఆయనకు మామూలు చికిత్స కాదు మానసిక చికిత్స అవసరమనిపిస్తోంది. 

డిస్టిలరీలన్నీ బాబు హయాంలోనివే..
ఇక రాష్ట్రంలో ఉన్న మద్యం డిస్టిలరీలన్నీ చంద్రబాబు హయాంలో అనుమతులు ఇచ్చినవే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఒక్క కొత్త డిస్టిలరీకీ అనుమతివ్వలేదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభలో స్లైడ్లు ప్రదర్శించి మరీ వివరించారు. అయినా సరే.. కళ్లున్న కబోదిగా వ్యవహరిస్తున్న రామోజీని ఏమనాలి.. ఏం చేయాలి?

సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ  తప్పా రామోజీ..
రాష్ట్ర బేవరేజ్‌ కార్పొరేషన్‌ ద్వారా ఎన్‌సీడీలు జారీచేసి ప్రభుత్వం నిధులు సమీకరించింది. వీటిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం వెచ్చిస్తున్నామని కూడా స్పష్టంచేసింది. పేదల సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం తగినన్ని నిధులు సమీకరించడం కూడా రామోజీరావుకు కంటగింపుగా మారుతోంది. తాను, తన చంద్రబాబు తప్ప పేదలు బాగుపడకూడదని ఆయన భావన కావచ్చు. ఆ రోజు­లకు కాలం చెల్లింది. మీకు అర్ధమవుతోందా రామోజీ..

అక్రమ మద్యంపై ఎస్‌ఈబీ ఉక్కుపాదం
అలాగే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అక్రమ మద్యం, నాటుసారాపై ఉక్కుపాదం మోపుతోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా సాగిన అక్రమ మద్యం, నాటుసారా దందాను సమర్థంగా కట్టడి చేస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా ‘స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ)ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటుచేయడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. ఎస్‌ఈబీ మూడు విధాలుగా అక్రమ మద్యం, నాటుసారాను అరికడుతోంది. ఎలాగంటే..

► అక్రమ మద్యం, నాటుసారా తయారీ దశాబ్దాలుగా సాగుతున్న 147 గ్రామాలను గుర్తించి దాడులు నిర్వహిస్తోంది.
► గ్రామ వలంటీర్లు, వార్డు వలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా కచ్చితమైన సమాచారాన్ని తెప్పించుకుని అక్రమ మద్యం దందాను అడ్డుకుంటోంది.
► ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశాలు నిర్వ­హిస్తూ.. పొరుగు రాష్ట్రాలతో కలిసి దాడులు నిర్వహిస్తోంది. 

సారా సిండికేట్‌కు గుండెల్లో రైళ్లు
2019 నుంచి 2023 మార్చి వరకు పోలీసు, ఎస్‌ఈబీ విభాగాలు నాటు సారా తయారీదారులపై 1,44,254 కేసులు నమోదు చేశాయి. మొత్తం 1,12,604 మందిని అరెస్టుచేశారు. 18.41లక్షల లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకోవడంతోపాటు 5.34కోట్ల లీటర్ల సారా ఊటలను ధ్వంసం చేయడం ప్రభుత్వం చేపడుతున్న కఠిన చర్యలకు నిదర్శనం. మొత్తం 14,556 వాహనాలను జప్తుచేశారు. 

బైండోవర్‌ కేసులు, పీడీ యాక్ట్‌లు.. 
రాష్ట్రంలో నాటుసారా, అక్రమ మద్యం, అక్రమంగా నల్లబెల్లం తయారీదారులపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. వారిపై బైండోవర్‌ కేసులు నమోదుచేస్తోంది. 2020 జూన్‌ నుంచి 2023 మార్చి 14 వరకు మొత్తం 74,674 బైండోవర్‌ కేసులు నమోదు చేసింది. అలాగే, రాష్ట్రంలో అక్రమ మద్యం, నాటుసారా దందాకు అలవాటుగా మారిన నేరస్తులను గుర్తించి పీడీ యాక్ట్‌లను ప్రయోగిస్తున్నారు. 2020, మే 16 నుంచి 2023, మార్చి 16 వరకు రాష్ట్రంలో ఏకంగా 206 మందిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించడం ప్రభుత్వం చేపడుతున్న కఠిన చర్యలకు నిదర్శనం.

అక్రమ మద్యం దందాకు చెక్‌
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రం­లో అక్రమ మద్యం దందా యథే­చ్ఛగా సాగింది. టీడీపీ నేతలు ఇతర రాష్ట్రాల నుంచి పన్ను చెల్లించని మద్యాన్ని అక్రమంగా స్మగ్లింగ్‌ చేసి భారీగా దోపిడీకి పాల్పడ్డారు. ఆనాటి ప్రభుత్వం కూడా ఆ దందాపై ఉదా­సీనంగా ఉండేది. రామోజీ కూడా ఏనాడు పెన్నెత్తి మాట్లాడలేదు. కానీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ మద్యం దందాకు సమర్థంగా చెక్‌పెట్టింది. ఎస్‌ఈబీ విస్తృతంగా దాడులు నిర్వహి­స్తూ మద్యం స్మగ్లింగ్‌ను కట్టడి చేస్తోంది. దీనిని కాదనగలరా రామోజీ..

ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలతో ‘నవోదయం’
దశాబ్దాలుగా నాటుసారా తయారీయే జీవనోపాధిగా చేసుకున్న కుటుంబాల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొత్త వెలుగులు తెచ్చింది. నవోదయం పేరుతో వినూత్న సంస్కరణలను తీసుకొచ్చింది. ఆ కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించి వారికి ఆర్థికంగా దన్నును అందించడంతోపాటు సామాజికంగా గౌరవాన్ని పెంచింది. అందుకోసం ఎస్‌ఈబీ ప్రత్యేకంగా సర్వే నిర్వహించి అటువంటి గ్రామాలను గుర్తించి ఆయా జిల్లాల యంత్రాంగాల సహకారంతో పటిష్ట కార్యాచరణ చేపట్టింది.

ఆ కుటుంబాలకు ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి అందిస్తోంది. 2022 ఏప్రిల్‌ నాటికి రాష్ట్రంలో 1,891 గ్రామాలను గుర్తించారు. ఆ గ్రామాల్లో ఇప్పటికే 1,552 కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం రూ.11.46 కోట్ల మేర సహాయం చేసింది. మిగిలిన కుటుంబాలకు కూడా కల్పించే ప్రక్రియ కొనసాగుతోంది రామోజీ..

చంద్రబాబు, రామోజీ మధ్య ఉన్నది మద్యం బంధమే
రక్తమాంసాలతో వ్యాపారం వారిద్దరిదే
వ్యాపార ప్రయోజనాల కోసం ఎంతటి కుట్రపూరిత రాజకీయాలు చేయాలో.. ప్రభుత్వ పాలనా వ్యవస్థను ఎంతగా దుర్వినియోగం చేయాలో ఈ ప్రపంచంలో చంద్రబాబు, రామోజీరావులకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు. ఆ విషయంలో పేటెంట్‌ వారిద్దరిదే. 1989–94లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపడం.. అప్పట్లో తమ పోటీ పత్రిక ‘ఉదయం’ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు రామోజీరావు సంపూర్ణ మద్య నిషేధం ఉద్యమాన్ని ప్రోత్సహించారు.

ఎన్టీరామారావు అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్య నిషేధాన్ని విధించారు. ఆ తర్వాత ఎన్టీరామారావుకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయ్యారు. వెంటనే రామోజీరావు ఏమాత్రం సిగ్గూఎగ్గూ లేకుండా ప్లేటు ఫిరాయించి సంపూర్ణ మద్య నిషేధం విధానానికి టాటా చెప్పారు. అంతే.. నిషేధాన్ని చంద్రబాబు ఎత్తేశారు. ఎందుకంటే అప్పుడే రామోజీ ఫిల్మ్‌సిటీ నిర్మాణం చేపట్టారు. అందులోని స్టార్‌హోటళ్లలో మద్యం విక్రయాల కోసం రామోజీరావు నిజంగా ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం చేశారు. ఇప్పుడు ఈయన శ్రీరంగ నీతులు చెబుతున్నాడు.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు!  

జిల్లాల వారీగా పీడీ యాక్ట్‌ కేసులు..
జిల్లా    కేసులు
శ్రీకాకుళం    3
విజయనగరం    1
అల్లూరి సీతారామరాజు    5
పార్వతీపురం మన్యం    4
అనకాపల్లి    2
కాకినాడ    12
అంబేడ్కర్‌ కోనసీమ    6
తూర్పు గోదావరి    36
పశ్చిమ గోదావరి    8
ఏలూరు    12
కృష్ణా    6
ఎన్టీఆర్‌    8
బాపట్ల    14
పల్నాడు    15
ప్రకాశం    7
ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు    3
చిత్తూరు    22
తిరుపతి    1
వైఎస్సార్‌    5
కర్నూలు    6
నంద్యాల    19
అనంతపురం    6
శ్రీసత్యసాయి    4
అన్నమయ్య    1
మొత్తం    206 

మరిన్ని వార్తలు