-

చదువు ఉద్యోగం ఉపాధి అన్నింటా అసలైన అభ్యున్నతి 

20 Dec, 2022 03:52 IST|Sakshi

ఎస్సీ, ఎస్టీలకు అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో సంక్షేమం

వెయ్యి రూపాయల పెన్షన్‌ స్థానంలో నెలకు రూ.2,750

గిరిజన ప్రాంతాల్లోని గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలన్నీ ఎస్టీలకే

సచివాలయాలు, వలంటీర్లలో 32 నుంచి 35 శాతం ఎస్సీ, ఎస్టీలే

మూడున్నరేళ్లలోనే 1.27 లక్షల మంది గిరి జనానికి భూమి పట్టాలు

6,36,732 మంది ఎస్సీలకు, 1,41,496 మంది ఎస్టీలకు ఇళ్ల స్థలాలు

చేయూత, ఆసరా కింద సొంతకాళ్లపై నిలబడేలా 2.45 లక్షల మందికి లబ్ధి

విద్యా దీవెన, వసతి దీవెనతో నూరు శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌

మునుపటి ప్రభుత్వాలతో పోలికే లేకుండా సామాజిక అభ్యున్నతి

అయినా అబద్ధాలకే పెద్దపీట వేస్తూ ‘ఈనాడు’ కథనాలు

సాక్షి, అమరావతి: ఊళ్లో వెయ్యి మంది అర్హులుంటే వారిలో ఒకరిద్దరికి రుణాలిప్పించి అదే తమ ప్రభుత్వ ఘనతగా చెప్పుకున్న తీరు చంద్రబాబు నాయుడిది. కానీ ఆ ఊళ్లో అర్హుల్లో ఒక్కరు కూడా మిగిలిపోకుండా అందరికీ సంతృప్త స్థాయిలో పథకాలను అందించి... అందరి జీవితాలనూ మెరుగుపరిచే ప్రయత్నం వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డిది. దీన్ని బట్టి తెలియటం లేదా... ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి పట్ల నిజంగా ఎవరికి చిత్తశుద్ధి ఉందో? ఇదొక్కటి చాలదా ఎవరు రాజకీయం చేస్తున్నారో తెలియటానికి? టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల కనుసన్నల్లో ఏ కొందరికో మేలు జరిగితే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అర్హతే ప్రామాణికంగా సంక్షేమాన్ని లబ్ధిదారుల ముంగిట్లోకి చేరుస్తోంది.

ఈ రాష్ట్రంలో పరిస్థితులను చూస్తున్నవారెవరైనా దీన్ని కాదనగలరా? మరి ‘ఈనాడు’లో ఈ వాస్తవాలు రాయరెందుకు రామోజీ? 2014–19 మధ్య చంద్రబాబు ప్రభు­త్వం ఎస్సీలకు రూ.14,183.38 కోట్లు ఖర్చు చేయగా గడిచిన మూడున్నరేళ్లలో ఈ ప్రభుత్వం ఖర్చు­చేసింది సాక్షాత్తూ రూ.59,263.69 కోట్లు. ఎస్టీల విషయంలో ఇది రూ.7,315.41 కోట్ల నుంచి రూ.17,651.50 కోట్లకు చేరింది. ఈ అంకెలు చాల­వా ఎవరెంత ప్రాధాన్యమిస్తున్నారో తెలియటానికి? 

ఉద్యోగాల్లో ఏమైనా పోలిక ఉందా? 
ఎస్సీ, ఎస్టీల ఉపాధికి ఈ ప్రభుత్వం ఏమీ చేయటం లేదన్నది సంఘాల ముసుగులో రామోజీరావు చేసిన మరో ఆరోపణ. అసలు ఏమైనా పోలిక ఉందా? రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం... గిరిజన ప్రాంతాల్లోని కార్యాలయాల్లో మొత్తం ఉద్యోగాలన్నీ ఎస్టీలకే కేటాయించింది. దీంతో ఎస్టీలు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏకంగా 10,651 మంది,  వలంటీర్లుగా 16,847 మంది ఉపాధి పొందారు.

ఎస్సీల సంఖ్య సచివాలయాల్లో 28,267 కాగా... వలంటీర్లుగా ఉన్నది ఏకంగా 69,528 మంది. ఒకరకంగా  స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఈ వర్గాలకు వచ్చిన ఉద్యోగాలతో పోలిస్తే... ఈ మూడున్నరేళ్లలో వచ్చినవి 50 శాతానికి పైనే ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పైపెచ్చు మొత్తం గ్రామ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లలో వీరి సంఖ్య 32 నుంచి 35 శాతం వరకూ  ఉందంటే... ఈ ప్రభుత్వం అట్టడుగు వర్గాలకిస్తున్న ప్రాధాన్యమేంటో తెలియకమానదు. 

ఇక స్వయం ఉపాధి కల్పించటంలోనూ ప్రభు­త్వం ఇదే దృక్పథంతో ఉంది. చంద్రబాబు నాయుడి హయాంలో ‘పేదరికంపై గెలుపు’ పేరుతో ఐదేళ్లలో 2,02,414 మంది ఎస్సీలకు రూ.2,726కోట్లు, 39,906 మంది ఎస్టీలకు రూ.284.8 కోట్లు ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం మూడున్నరేళ్లలోనే వైఎస్‌ఆర్‌ చేయూత, ఆసరా పథకం ద్వారా ప్రతి లబ్ధిదారుకు ఏడాది రూ.18,750తో పాటు సున్నా వడ్డీ పథకంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణమాఫీ అమలు చేసి అండగా నిలిచింది.

స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునేలా 23,13,385 మంది ఎస్సీలకు రూ.5,914 కోట్లు, 4,71,311 మంది ఎస్టీలకు రూ.1,218.8కోట్లు అందించింది. ఇప్పుడు చెప్పండి  రామోజీరావు గారూ... ఎస్సీ, ఎస్టీలను ఏ ప్రభుత్వం దగా చేసిందో? 

కౌలు రైతులకూ భరోసా... 
అడవిని నమ్ముకున్న గిరిజనులకు గడిచిన 12 ఏళ్లలో ఇచ్చిన భూమి హక్కు పట్టాలకంటే అధికంగా... కేవలం మూడున్నరేళ్లలో 1,27,245 మంది గిరిజనులకు 2,82,832 ఎకరాలను ఇచ్చి ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలను పంపిణీ చేయడం ఈ రాష్ట్రంలో ఓ చరిత్ర. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ కార్డులున్న కౌలు రైతులతో సహా వీరందరికీ రైతు భరోసా అందుతోంది. ఇక పింఛన్లు చూసుకున్నా అప్పట్లో ఇచ్చింది నెలకు వెయ్యి రూపాయలు. అది కూడా అర్హులందరికీ అందే పరిస్థితి లేదు.

ఇపుడు నెలకు రూ.2,750 చొప్పున అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ అందుతోంది. ఇవన్నీ ‘ఈనాడు’కు ఎందుకు కనిపించవు? చంద్రబాబు మైకంలో ఎన్ని అబద్ధాలైనా అలవోకగా అచ్చోయడమేనా? దాదాపు రూ.7 నుంచి 10 లక్షల విలువైన స్థలాలతో కూడిన ఇళ్లు వీరి సొంతమవుతున్నాయి. ఇక వైఎస్సార్‌ చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, అమ్మ ఒడి... ఇవన్నీ అర్హతను బట్టి అందరికీ సంతృప్త స్థాయిలో అందుతున్నాయి.

మొత్తంగా సామాజిక అభ్యున్నతి సాక్షాత్కారమవుతోంది. ఏటా ఇవ్వటమే కాకుండా బ్యాంకులతో... బహుళ జాతి కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని మరీ వారి అభ్యున్నతికి సహకరిస్తోంది ప్రభుత్వం. వైఎస్సార్‌ చేయూత, ఆసరా కింద కిరాణా షాపుల నుంచి పశువుల పెంపకం, పౌల్ట్రీ తదితర కార్యకలాపాలతో 2.45 లక్షల మందికిపైగా ఎస్సీ, ఎస్టీలు తమ కాళ్లపై తాము నిలబడటం నిజమైన సామాజిక అభ్యున్నతికి చిహ్నం కాదా రామోజీ? ఇంకెన్నాళ్లు సంఘాలు, పార్టీలంటూ రకరకాల ముసుగులు వేసుకుని ప్రభుత్వంపై బురదజల్లే ఎజెండాను కొనసాగిస్తారు? ఉన్నది ఉన్నట్టుగా రాయటమనే పాత్రికేయ బాధ్యతను కొంతైనా చూపించాలి  కదా? 

ఇవిగో వాస్తవాలు... 
► టీడీపీ హయాంలో ఎస్సీలు 8,66,835 మందికి రూ.4,415.04 కోట్లు, ఎస్టీలకు 3,01,242 మందికి రూ.1,373.9 కోట్లు పింఛన్ల రూపంలో అందించారు. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టాక 2019 జూన్‌ నుంచి ఇప్పటివరకు ఎస్సీలకు 11,51,222 మందికి రూ.10,191.8కోట్లు, ఎస్టీలకు 3,71,211 మందికి రూ.3,512.48కోట్లు పింఛన్లుగా అందించారు. మరి ఎవరు దగా   చేసినట్లు? 

► శాశ్వతంగా విద్యా ప్రమాణాలు పెంచడానికి నాడు–నేడు పేరిట స్కూళ్లకు మౌలిక సదుపాయాలను కల్పించటంతో పాటు ఈ ప్రభుత్వం ఇంగ్లిష్‌ మీడియాన్ని అందుబాటులోకి తెచ్చింది. సీబీఎస్‌ఈతో అనుసంధానించటమే కాక పెద్దపెద్ద కార్పొరేట్‌ స్కూళ్లకే పరిమితమైన ఎడ్యుటెక్‌ విద్య ‘బైజూస్‌’తో కలిసి ప్రభుత్వ స్కూళ్ల ముంగిట్లోకి తీసుకొచ్చింది.

రూ.16,000 విలువైన ట్యాబ్‌ను ఉచితంగా ఇవ్వటంతో పాటు... రూ.24వేలు విలువైన బైజూస్‌ కంటెంట్‌నూ విద్యార్థులకు అందజేస్తోంది. అదేకాదు!! విద్యా దీవెన, వసతి దీవెనలతో నూరుశాతం ఫీజును రీయింబర్స్‌ చేస్తూ ఈ వర్గాలను శాశ్వతంగా సాధికారీకరించే చర్యలకు నడుంకట్టింది. ఇదీ... నాటికీ, నేటికీ ఉన్నతేడా. ఇదీ... అసలైన దగా ఎవరిదో చెప్పే నిజం.   

మరిన్ని వార్తలు