ఇవెక్కడి దుర్మార్గపు రాతలు రామోజీ! 

14 Oct, 2022 03:46 IST|Sakshi

ఎంవీవీ బిల్డర్‌.. భూ యజమానులతో 2018లోనే అగ్రిమెంట్‌ 

ఇవన్నీ మీరు రాసినవే.. కానీ అప్పటికాయన ఎంపీ కాదు కదా? 

అప్పటికింకా కనీసం వైఎస్సార్‌సీపీలో చేరలేదు కూడా 

ఒక వ్యాపారిగా ప్రైవేటు వ్యక్తులతో చేసుకున్న ఒప్పందమది 

దానిక్కూడా రాజకీయాలు అంటగడుతూ దిగజారిపోతారా? 

ఇవన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగాయని చెప్పాలిగా? 

ఆ నిర్మాణానికి అనుమతులిచ్చింది కూడా బాబు హయాంలోనే 

2019 మార్చి 11న జీవీఎంసీ అనుమతించేనాటికి అధికారంలో ఉన్నది చంద్రబాబే 

ఇవి దాచిపెట్టి రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లటమెందుకు?  

రామోజీరావు దందా ఎలా ఉందంటే.... ఎంవీవీ వ్యవహారం 2012లో మొదలై 2018లో ముగిసింది. దీన్ని  కూడా వైఎస్సార్‌సీపీకి అంటగట్టేశారు. ఎంవీవీ, భూ యజమానుల మధ్య అగ్రిమెంట్‌ 2018 జనవరి 8న జరిగిందని ఆయనే రాశారు. అప్పటికి ఎంవీవీ సత్యనారాయణ పార్లమెంటు సభ్యుడేమీ కాదు. కనీసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడు కూడా కాదు. ఎందుకంటే ఆయన పార్టీలో చేరిందే 2018 మేలో. పైపెచ్చు ఇది పూర్తిగా కొందరు ప్రయివేటు వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పందం.

ఒక వ్యాపారిగా ఆ ప్రయివేటు వ్యక్తులందరితోనూ ఒప్పందాలు చేసుకుని, వివాదాన్ని పరిష్కరించుకుని ఆయన నిర్మాణం మొదలెట్టారు. విచిత్రమేంటంటే వాళ్లతో అగ్రిమెంట్లు జరిగేటపుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీయే. ఈ భవనానికి జీవీఎంసీ అనుమతులిచ్చింది 2019 మార్చిలో. నాడు కూడా అధికారంలో ఉన్నది చంద్రబాబే.

కానీ ‘ఈనాడు’ ఈ విషయాలేమీ రాయదు. అప్పటికాయన ఎంపీ కాదని గానీ... ఇవన్నీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే జరిగాయని గానీ నిజాలు చెప్పదు. ఇంత దారుణంగా దిగజారిపోయి రామోజీరావు రాసిన రాతలపై ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వాస్తవాలను వివరించారు. అవి... 

వాస్తవాలు ఇవీ....! 
► కూర్మన్నపాలెంలో10.57 ఎకరాలకు సంబంధించి 1982 నుంచి దీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది. గొట్టిపల్లి శోభారాణి కుటుంబీకులు, 160 మంది డాక్‌ లేబర్‌ బోర్డు (డీఎల్‌బీ) ఉద్యోగులతో పాటు కొప్పిశెట్టి శ్రీనివాస్‌ల మధ్య 1982 నుంచీ వివాదం ఉంది. వివాదాన్ని పరిష్కరించేలా చూడాలని బిల్డర్‌గా ఉన్న ఎంవీవీ సత్యనారాయణను 2012లో డీఎల్‌బీ ఉద్యోగులు ఆశ్రయించారు.  

► ఆ 160 మంది ఉద్యోగులకూ ఒక్కొక్కరికీ ఒక్కో ఫ్లాట్‌ చొప్పున మొత్తం 160 ఫ్లాట్లను ఇస్తానని ఎంవీవీ చెప్పటంతో... వారు తమ వాటాను ఆయనకు 2012లోనే అగ్రిమెంట్‌ చేశారు.  

► ఆ తరవాత కొప్పిశెట్టి శ్రీనివాస్‌తో ఎంవీవీ సంప్రతింపులు మొదలెట్టారు. 2012లో మొదలైన ఈ ప్రక్రియ... చివరకు 2017లో ముగిసింది. వారికి 30వేల చదరపు అడుగులను ఇచ్చేలా 2017లో ఎంవోయు కుదిరింది.  

► ఇక మిగిలిన గొట్టిపల్లి  శోభారాణి, ఆమె కుటుంబీకులకు 14,400 చదరపు అడుగులిచ్చేలా వారితో  2018 జనవరిలో ఒప్పందం చేసుకున్నారు. ఇవన్నీ ప్రయివేటు వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పందాలు. వీటికి ప్రభుత్వంతో ఒక్క శాతం కూడా సంబంధం లేదు. ఈ ఒప్పందాలతో పాటు వివిధ పక్షాలకు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్లు చెల్లింపులు కూడా చేశారు.  

► ఇవన్నీ పూర్తయ్యాక 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవంతులను నిర్మించుకునేందుకు 2019 మార్చి 11న జీవీఎంసీ ప్లాన్‌ను ఆమోదించింది. అప్పడూ అధికారంలో ఉంది టీడీపీయే.  

► అక్కడ  ధర చదరపు అడుగు రూ.4 వేల మేర ఉన్నా... ఇందులో కొన్న సుమారు 1800 మందికి చ.అ. రూ.2,500కే ఇచ్చామని, గేటెడ్‌ కమ్యూనిటీ సదుపాయాలున్న ఈ ప్రాజెక్టులో ఒక్కో ఫ్లాటు రూ. 30 లక్షలలోపు ధరకే అందించామని, ఇదంతా పూర్తిగా ప్రై వేటు వ్యవహారమని చెప్పారు ఎంవీవీ. 

మరిన్ని వార్తలు