అమరావతిపై ‘డబ్బుల్‌’ గేమ్‌!

27 Jun, 2022 02:36 IST|Sakshi

ఆ ప్రాంత అభివృద్ధికోసం 14 ఎకరాలు విక్రయిస్తున్న ప్రభుత్వం

ఎలా విక్రయిస్తారంటూ రైతుల ముసుగులో ఎల్లో గ్యాంగ్‌ ప్రశ్నలు

ఎకరాకు రూ.10 కోట్లు ఎవరిస్తారంటూ రామోజీ సన్నాయి నొక్కులు

ఓవైపు రాజధాని సెల్ఫ్‌ సస్టెయినబుల్‌ ప్రాజెక్టు అనేదీ వారే 

ఏం! వేలంలో చంద్రబాబు విక్రయిస్తేనే భూములు కొంటారా?

బాబు ప్లాన్‌ ప్రకారం మౌలిక సదుపాయాలకే రూ.1.08 లక్షల కోట్లు

కానీ ఆయన ఐదేళ్లలో ఖర్చు చేసింది కేవలం రూ.3,500 కోట్లు

ఇలాగైతే పూర్తికి 20 ఏళ్లు; అప్పటికి అంచనా వ్యయం 40 లక్షల కోట్లకు!!

ఏది నిజం ?

చంద్రబాబు అధికారంలో ఉంటే... రామోజీరావు దృష్టిలో అదో నవ్యాంధ్ర. ఆ భూములన్నీ అత్యంత విలువైనవి. ఇక నారా వారైతే... అమరావతి ఓ సెల్ఫ్‌ సస్టెయినబుల్‌ ప్రాజెక్ట్‌.. మనం డబ్బులు ఖర్చు చేయడం కాదు.. అదే తిరిగి డబ్బిస్తుందని పదేపదే దబాయిస్తారు. అంతేకాదు!! మాయమాటలు చెప్పో... మభ్యపెట్టో అక్కడికి జాతీయ స్థాయి ప్రముఖుల్ని తీసుకురావటం... ఆ రోజున అక్కడ కట్టిన నాలుగైదు భవనాలను ఎల్లో మీడియా గ్రాఫిక్స్‌లో అత్యంత అద్భుతంగా చూపించటం... ఇదో స్కీమ్‌. దేశంలో భవిష్యత్తులో సింగపూర్‌తో పోటీపడగలిగే నగరం ఇదొక్కటేనంటూ చెలరేగిపోతారు. 

సరే! హైకోర్టు ఆదేశించింది కాబట్టి అక్కడి అభివృద్ధికి తక్షణం చేపట్టాల్సిన పనులకోసం ఓ 14 ఎకరాలను సీఆర్‌డీఏ విక్రయానికి పెడుతోంది. అంతే!!... ఆ భూములకు ఎకరాకు రూ.10 కోట్లు ఎవరిస్తారంటూ ‘ఈనాడు’ నిట్టూర్చింది. అమరావతి పేరెత్తితే పెద్దపెద్ద భవనాల గ్రాఫిక్‌ ఫోటోలు వేసే ‘ఈనాడు’... ఈ వ్యవహారంలో మాత్రం ఖాళీ భూములు వేసి... వీటినెవరు కొంటారంటూ రాగాలు తీసింది. ఇక చంద్రబాబు చెబుతున్న రైతులైతే ‘ఈ భూములెందుకు అమ్ముతారు’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారట. అదీ రామోజీరావు పాత్రికేయం. ఔరా... నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే స్థాయిలో బరితెగిస్తే ఏమనుకోవాలి ఈ దౌర్భాగ్యపు పాత్రికేయాన్ని?

అభివృద్ధి పనులు చేపట్టేలా..
అభివృద్ధి పనులు చేపట్టాలంటే ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా వనరులను సమకూర్చుకోవాలి. అలాంటప్పుడు అందుబాటులో ఉన్న భూముల ద్వారా నిధులు సమీకరిస్తే రైతులెందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తారు? వారికి కావాల్సింది అదే కదా? ఆ భూముల్ని వినియోగించుకోవడానికి ఇచ్చిన జీవోలు చీకటి జీవోలు ఎలా అవుతాయి. సాయంత్రం 6 తరవాత విడుదల చేసేవన్నీ చీకటి జీవోలేనా రామోజీరావు గారూ? మీ ఫిలిం సిటీలో 6 తరవాత జరిగేవన్నీ చీకటిపనులేనా? 

ఇవెక్కడి రాతలు? 
సెల్ఫ్‌ సస్టెయినబుల్‌ ప్రాజెక్టు అర్థం.. ఆ భూములు వినియోగించుకోవడమే అయినప్పుడు దాన్ని వ్యతిరేకించడమేంటి? నిజానికి అమరావతిలో విక్రయించగలిగే భూమి 5 నుంచి 6 వేల ఎకరాలు మాత్రమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిని మొత్తం అమ్మటం అసాధ్యం. కోర్టు ఆదేశాల ప్రకారం ఉన్నంతలో అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం 14 ఎకరాలను వేలం వేయడానికి సీఆర్‌డీఏకు అనుమతి ఇచ్చింది.

నవులూరులో 10 ఎకరాలు, సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులో 4 ఎకరాలు. కానీ ప్రభుత్వానికి నిధులు రాకుండా అడ్డుకోవటమే ఏకైక పాలసీగా దిగజారిపోతున్న ‘ఈనాడు’, తెలుగుదేశం... దీన్లోనూ అడ్డం పడ్డాయి. 

భూములన్నీ అమ్మేస్తున్నారంటూ..
ఒకవైపు భూములెలా అమ్మేస్తారని ‘ఈనాడే’ ప్రశ్నించి.. దానికి ఒకరిద్దరు రైతుల పేర్లు తగిలించింది. మరోవైపు ఈ భూములకు ఎకరాకు రూ.10 కోట్లు ఎవరిస్తారంటూ దీర్ఘాలు తీసింది. ఏం! చంద్రబాబు అమ్మితేనే ఎకరానికి రూ.10 కోట్లు వస్తాయా? వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమ్మితే రావా? ఇదెక్కడి ఎల్లో నీతి? అసలు రాజధాని ప్రాంతంగా పేర్కొన్న మొత్తం భూములకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా రామోజీరావు గారూ? ఎకరానికి రూ.2 కోట్లు. రాజధాని కోసం సేకరించిన 54వేల ఎకరాలకూ మొత్తంగా అక్షరాలా లక్షా ఎనిమిది వేల కోట్లు కావాలి.

అది కూడా మౌలిక వసతులకు మాత్రమే. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం రాజధాని కోసం అంత ఖర్చుపెట్టగలదా? చంద్రబాబు ఐదేళ్లలో రాజధాని కోసం వ్యయం చేసింది రూ.3,500 కోట్లే కదా? అందులో 2000 కోట్లు అమరావతి బాండ్లపేరిట తెచ్చిన అప్పు.. మిగతాది కేంద్రం ఇచ్చినది.ఈ లెక్కన కొంత ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసినా... పూర్తికావటానికి 20 ఏళ్లు పడుతుంది.

అప్పటికి ఇది 40 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదు. ఈ వాస్తవాలన్నీ తెలియనట్లుగా ఎందుకీ దిగజారుడు రాతలు. ఒకవైపు అభివృద్ధి పనులు చేయటం లేదనేదీ మీరే... మరోవైపు చేసేవాటిని అడ్డుకునేదీ మీరే. ఎప్పటికి పోతుంది ఈ ఎల్లో వైరస్‌!!?  

మరిన్ని వార్తలు