రామోజీ.. నవయుగ.. ఓ పోలవరం! వారి కాంట్రాక్టు పోవటంతో కడుపు మంట

30 Aug, 2022 04:27 IST|Sakshi

వియ్యంకుల కాంట్రాక్టు పోవటంతో రామోజీ కడుపు మంట 

ఏదో జరిగిపోతున్నట్లుగా ప్రతిరోజూ అసత్యాల వంట 

వరదలు ముందుగా రావటం వల్లే పనులు ఆగాయని తెలియదా? 

వరదలు తగ్గాక మళ్లీ పనులు మొదలవుతాయన్నదీ అంతే నిజం 

ఈ మధ్యలోనే రోజుకో అబద్ధంతో చెలరేగిపోతున్న ‘ఈనాడు’ 

పోలవరంలో ‘ఏటీఎం’నే తప్ప ప్రాజెక్టును చూడని చంద్రబాబు 

కమీషన్లకు స్పిల్‌వే సగంలో వదిలి.. ఈసీఆర్‌ఎఫ్‌ పునాది పనులు 

ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను సైతం ఖాళీలతో వదిలేసిన తీరు 

స్పిల్‌వేకు గేట్ల బదులు రేకులు పెట్టిన ‘జయము జయము చంద్రన్న’ 

గడిచిన మూడేళ్లలో స్పిల్‌వే, స్పిల్‌ చానల్, అప్రోచ్‌ చానల్‌ పూర్తి 

ఎగువకాఫర్‌ డ్యామ్‌ పనులనూ పూర్తి చేయించిన సీఎం జగన్‌ 

దిగువ కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేస్తుండగా అనూహ్యంగా వరద 

ఇవన్నీ విస్మరిస్తూ.. బాబుపై నింద పడకుండా రామోజీ తంటాలు

ఏది నిజం ?

పోలవరంపై రామోజీరావుకున్నంత ఆందోళన బహుశా.. అక్కడి నిర్వాసితులకు కూడా లేదేమో!!.ప్రతిరోజూ పనిగట్టుకుని ఏదో ఒక వ్యతిరేక కథనం!. ముఖ్యమంత్రి జగన్‌పై బురద చల్లటం.ఏదో జరిగిపోయినట్లుగా... ప్రభుత్వం ఏకంగా ఈ ప్రాజెక్టునే గాలికి వదిలేసినట్లుగా మతిలేని దుర్మార్గపు కథనాలు.ఏం! వరదలు తగ్గేవరకూ పనులు ఆరంభించటం కుదరదని రామోజీకి తెలియదా? అసలు వరదల ప్రభావం నిర్మాణాలపై పడకుండా చేయాల్సిన చంద్రబాబు... కమిషన్ల కోసం గడ్డితిన్న విషయం ‘ఈనాడు’కు గుర్తుండదా? ప్రవాహాన్ని మళ్లించకుండానే కమీషన్ల కోసం ఈసీఆర్‌ఎఫ్‌ ‘పునాది’ పనులు ఆరంభించేసి... చివరికి అవన్నీ కొట్టుకుపోవటానికి కారణమైన చంద్రబాబును మీ అక్షరం ఒక్కటి కూడా తప్పుపట్టలేదెందుకు రామోజీరావు గారూ? బాబుకు వ్యతిరేకంగా ఒక్క అక్షరం కూడా ఖర్చు చేయలేదెందుకు? మీ వియ్యంకుల వారికి జస్ట్‌ నామినేషన్‌ పద్ధతిమీద ఏకంగా రూ.3,302 కోట్ల విలువైన పోలవరం పనుల్ని కట్టబెట్టేసినందుకా? ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా... ఆఖరికి రక్షణ రంగంలో కూడా లేని విధంగా అంత భారీ కాంట్రాక్టును నామినేషన్‌పై ఇచ్చేస్తే మీ దృష్టిలో అదో అత్యద్భుతమైన నిర్ణయం. బాబు దార్శనికతకు ఓ మచ్చుతునక. ఈ ఘోరాన్ని సరిదిద్దటానికి వై.ఎస్‌.జగన్‌ ఆ కాంట్రాక్టును రద్దుచేశారు కాబట్టి ఇక మీరు రోజూ పెన్నెత్తుతూనే ఉంటారు. రివర్స్‌ టెండర్‌ ద్వారా రూ.830 కోట్లు మిగల్చటం మీ దృష్టిలో మహాపరాధం! అంతేనా రామోజీ?

పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి. అందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహాలూ లేవు. కాకపోతే ఈ ప్రాజెక్టు నిర్మాణం అనుకున్నట్లుగా ముందుకెళ్లటం లేదు. దీనికి కారణాలేంటి? అసలు తప్పు జరిగిందెక్కడ? చేసిందెవరు? దాన్నిపుడు ఎలా సరిదిద్దాలి? సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారా? ఇవికదా ఇప్పుడు ఆలోచించాల్సినవి!!. వీటి గురించి కదా చర్చించాల్సింది!!. మరి ‘ఈనాడు’ నిత్యం రాస్తున్న అబద్ధాల్లో వీటి గురించి ఏ కొంచమైనా ఉందా? ప్రాజెక్టుకు ఈ దుస్థితి కల్పించిన చంద్రబాబు నిర్ణయాల ప్రస్తావనైనా ఉందా? వాటన్నిటినీ సరిదిద్దుకుంటూ ముందుకెళుతున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ చర్యల్ని రోజూ తప్పుబట్టడమేనా? అసలిందులో ఏది నిజం? సజీవ సాక్ష్యాలైన చిత్రాలు చెబుతున్న వాస్తవాలేంటో ఒకసారి చూద్దాం... 

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం రామన్నగూడెం వద్ద గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు మిగతా సాగునీటి ప్రాజెక్టుల్లాంటిది కాదు. వైవిధ్యమైనది. ఆ ప్రాంతంలోని భూభౌతిక పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)... గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా నదికి ఆవల కుడి వైపున రాతినేలపై స్పిల్‌ వేను.. నదికి అడ్డంగా ఇసుక తిన్నెలపై 2454 మీటర్ల పొడవున ఈసీఆర్‌ఎఫ్‌ను(ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌) నిర్మించేలా డిజైన్‌ ఖరారు చేసింది. దాని ప్రకారమే పోలవరం ప్రాజెక్టును నిర్మించాలి. 

నిర్మించాల్సిన విధానం ఇదీ..
1 ఎగువన నదీ ప్రవాహాన్ని మళ్లిస్తూ... ఆ ప్రవాహాన్ని దిగువకు పంపడానికి 48 గేట్లతో కూడిన స్పిల్‌ వే, 6.1 కిలోమీటర్ల పొడవున అప్రోచ్‌ చానల్, స్పిల్‌ చానల్, ఫైలట్‌ చానల్‌ను మొదట పూర్తి చేయాలి. ఇలా చేస్తే... దిగువకొచ్చే ప్రవాహం తగ్గిపోతుంది.  
2 ఆ తర్వాత 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని 115 గ్రామాలకు చెందిన 20,946 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తూ... ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతానికి ఎగువన 2,480 మీటర్ల పొడవు, 42.5 మీటర్ల ఎత్తుతో ఒకటి.. దిగువన 1630 మీటర్ల పొడవు, 30.5 మీటర్ల ఎత్తుతో మరొక కాఫర్‌ డ్యామ్‌లను నిర్మించాలి.  

3 గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌ వే మీదుగా మళ్లిస్తారు కనక... ప్రధాన నదీ ప్రవాహ ఉద్ధృతి తగ్గుతుంది. అలా ఉద్ధృతి లేకుండా వచ్చే నీటిని ఎగుక కాఫర్‌ డ్యామ్‌ ఆపుతుంది. దిగువన మరో కాఫర్‌ డ్యామ్‌ ఉంటుంది కనక... ఈ రెండింటి మధ్యా నీరుండదు కనక... అక్కడ  ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో.. పునాదిని (డయా ఫ్రమ్‌ వాల్‌) నిర్మించాల్సి ఉంటుంది. అనంతరం దానిపై 53 మీటర్ల ఎత్తుతో ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ను పూర్తి చేయాలి.

కానీ చంద్రబాబు ఏం చేశారో తెలుసా? 
► ఇలా పద్ధతి ప్రకారం పనులు చేసి ఉంటే పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయిపోయి ఉండేది. పునరావాస పనులు కాకున్నా... ప్రాజెక్టు పనులైతే పూర్తయిపోయేవి. కానీ చంద్రబాబు ఈ ప్రాజెక్టును ఏపీ జీవనాడిగా కాకుండా... ఏటీఎంగా చూశారు. ఆ విషయాన్ని సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్రమోదీయే బహిరంగంగా చెప్పారు కూడా.  
► అయితే... పోలవరంలో ఓ ఏటీఎంను కనుగొన్న చంద్రబాబు... రూ.3,302 కోట్ల విలువైన పనులను ఏకంగా నామినేషన్‌ పద్ధతిలో రామోజీరావు వియ్యంకులకు నవయుగ సంస్థకు కట్టబెట్టారు. అదికూడా ఈపీసీ(ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌) విధానంలో చేసుకున్న కాంట్రాక్టు ఒప్పందంలో 60సీ నిబంధన రద్దు చేసి.. ఎల్‌ఎస్‌(లంస్సమ్‌)–ఓపెన్‌ విధానంలో నవయుగకు కట్టబెట్టారు.  
► దేశ చరిత్రలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన పనుల్లో ఇదే అతి పెద్ద స్కామ్‌. 
► ఇంత భారీ మొత్తాన్ని నామినేషన్‌ ప్రాజెక్టుగా ఇవ్వటం చరిత్రలోనే లేదు. కానీ బాబు అక్కడితో ఆగలేదు.. రామోజీ మెప్పు కోసం రూ.3,220 కోట్ల విలువైన పోలవరం జలవిద్యుత్కేంద్రం నిర్మాణ పనులనూ నవయుగకే కట్టబెట్టేశారు.  

అంతేకాదు!!.  
స్పిల్‌ వే పునాది స్థాయిలో ఉన్నప్పుడే... ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు కట్టకుండానే ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పునాది డయాఫ్రమ్‌ వాల్‌ను పూర్తి చేశారు. స్పిల్‌ వే 22 మీటర్ల స్థాయిని కూడా దాటక ముందే.. నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణాన్ని చేపట్టారు. తమకు పునరావాసం కల్పించకుండా కాఫర్‌ డ్యామ్‌లు నిర్మిస్తే.. అవి నదీ ప్రవాహానికి అడ్డంకిగా మారి.. తమ గ్రామాల్లోకి గోదావరి వరదను ముంచెత్తేలా చేస్తాయని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), కేంద్ర జల్‌ శక్తి శాఖలకు నిర్వాసితులు విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన పీపీఏ.. నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ కాఫర్‌ డ్యామ్‌లు పూర్తి చేయాలని 2018, డిసెంబర్‌లో సూచించింది. 

నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తే కమీషన్లు ఎక్కడొస్తాయి? దీంతో చంద్రబాబు ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు పూర్తి చేయకుండా.. ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో ఇరువైపులా 750 మీటర్లు, దిగువ కాఫర్‌ డ్యామ్‌లో 400 మీటర్ల వెడల్పుతో ఖాళీలను వదిలేశారు. అంటే నీరు నిండకుండా కిందికి వదిలేశారన్న మాట. 

స్పిల్‌ వే పూర్తయి ప్రవాహాన్ని మళ్లించి ఉంటే ప్రవాహం మొత్తం అటు వెళ్లి ఈసీఆర్‌ఎఫ్‌ పునాది సురక్షితంగా ఉండేది. కాఫర్‌డ్యామ్‌లు పూర్తయినా అది కోతకు గురయ్యేది కాదు. కానీ బాబు నిర్వాకంతో 2019, ఆగస్టులో వచ్చిన వరదకు 2400 మీటర్ల వెడల్పునప్రవహించాల్సిన గోదావరి నది.. ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో ఖాళీగా ఉన్న 750 మీటర్ల గుండా కుంచించుకుపోయి ప్రవహించింది.

దాంతో వరద ఉద్ధృతి పెరిగి.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురయ్యాయి.  –12 నుంచి –22 మీటర్ల లోతుకు రెండు చోట్ల భారీ అగాధాలు ఏర్పడ్డాయి. దిగువ కాఫర్‌ డ్యామ్‌లో 0 నుంచి 680 మీటర్లలో కోతకు గురై... భారీ అగాధం ఏర్పడింది. వరద ఉద్ధృతికి డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది. ఇదే పోలవరం పనుల్లో ఆలస్యానికి కారణమైంది.

సీఎం జగన్‌ సరిదిద్దుతున్నది ఇలా... 
   అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో... సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్‌ ప్రకారం 48 గేట్లతో సహా స్పిల్‌ వే... 6.1 కి.మీ.ల పొడవున అప్రోచ్‌ చానల్, స్పిల్‌ చానల్‌లను రికార్డు సమయంలో పూర్తి చేశారు.  
2    ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేసి.. గతేడాది జూన్‌ 11న గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్‌ వే మీదుగా మళ్లించారు.  
   41.15 మీటర్ల పరిధిలోని 20,946 కుటుంబాలకుగానూ.. దివంగత
నేత వైఎస్‌ నిర్మించిన కాలనీల్లో 3,922 కుటుంబాలకు గత సర్కార్‌ పునరావాసం కల్పించింది. జగన్‌ ఇప్పుడు 7,634 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. మిగతా 9,390 కుటుంబాలకు వేగంగా పునరావాసం కల్పిస్తున్నారు. 
 దిగువ కాఫర్‌ డ్యామ్‌లో 0 నుంచి 680 మీటర్ల వరకూ కోతకు గురైన ప్రదేశాన్ని జెట్‌ గ్రౌటింగ్‌ చేస్తూ.. జియో మెంబ్రేన్‌ బ్యాగ్‌లలో ఇసుకను నింపి.. వాటిని అగాధం ఏర్పడిన ప్రాంతంలో వేసి.. వైబ్రో కాంపాక్షన్‌ చేస్తూ పూడ్చి.. 30.5 మీటర్ల ఎత్తుతో జూలై 31 నాటికి పూర్తి చేయాలని ఏప్రిల్‌ ఆఖరులో పీపీఏ, డీడీఆర్పీ, సీడబ్ల్యూసీ సూచించాయి. జియో మెంబ్రేన్‌ బ్యాగ్స్‌ వినియోగం చాలా తక్కువ. దాంతో లభ్యత అంతంత మాత్రమే. గుజరాత్, అస్సోంలలోని ఉత్పత్తి సంస్థలకు ఆర్డర్‌ ఇచ్చి.. 2.50 లక్షల జియో మెంబ్రేన్‌ బ్యాగ్స్‌ను సేకరించారు.  జెట్‌  గ్రౌటింగ్‌ విఫలమవుతుండటంతో సమయం ఎక్కువ తీసుకోవడంతో పాటు కష్టమైన పాలీయురిథేన్‌ (పీయూ) గ్రౌటింగ్‌ చేస్తూ.. జూలై 9 నాటికే 20 మీటర్ల ఎత్తు వరకు దిగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేశారు. అనుకున్నట్టుగా జులై 31లోగా మిగతా దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు పూర్తయ్యేవే. కానీ అనూహ్యంగా జూలై 10నే వరదలొచ్చాయి. దీంతో స్పిల్‌ వే నుంచి దిగువకు విడుదలైన వరద దిగువ కాఫర్‌ డ్యామ్‌ మీదుగా ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణ ప్రాంతంలోకి చేరి నిర్మాణ పనులను ముందుకెళ్లకుండా చేసింది. అదీ జరిగింది. 

తదుపరి చేయాల్సిందేంటి? 
రామోజీ ఎన్ని అబద్ధాలు రాసినా... ‘ఈనాడు’ ఎంతలా గొంతు చించుకున్నా... వరదలు తగ్గే వరకూ ఎవ్వరూ పనులు చేపట్టే పరిస్థితి ఉండదు. అక్టోబరుకు వరదలు తగ్గుతాయనే అంచనా ఉంటుంది కనక... మూడు నెలలు ఆలస్యంగానైన అక్టోబర్లో పనులు ఆరంభమవుతాయి. కానీ ఇక్కడ మరో చిక్కుంది. ఇప్పటిదాకా వచ్చిన వరదల ఉద్ధృతికి మరికొంత కోత జరుగుతుంది. దాన్ని కూడా పూడ్చాలి. అందుకు ఇంకొంత ఆలస్యం కాకమానదు. ఒకవేళ చంద్రబాబు కనక  కమీషన్ల కోసమో... రామోజీ మెప్పుకోసమో కాకుండా పనులన్నీ పద్ధతి ప్రకారం చేసి ఉంటే.. ఈ సమస్యే వచ్చేది కాదు. ఈసీఆర్‌ఎఫ్‌ కోతకు గురయ్యేదే కాదు.  
కాకపోతే అదసలు సమస్యే కాదన్నట్లు... చంద్రబాబుది తప్పే కాదన్నట్లు ప్రతిరోజూ ‘ఈనాడు’ రాసే రాతలు... వరదలా వస్తూనే ఉంటాయి. వరద ఆగినా ఈ రాతలు ఆగవేమో!!.  

మరిన్ని వార్తలు