‘ఈనాడు’ కుట్ర ఇంతింత కాదయా!!

4 May, 2022 04:07 IST|Sakshi
2015లో అన్ని చోట్ల ధరలు ఇలా ఉన్నా తెలంగాణలో మాత్రమే కనిపించిన ఈనాడు ‘ధరల దరువు’ కథనం

ఏది నిజం?

చంద్రబాబు ‘బాదుడే–బాదుడు’కు రామోజీ ఇతోధిక సాయం.. తెలుగుదేశం ప్రచారానికి మద్దతుగా ‘ఈనాడు’ విషపు రాతలు

పప్పులు, ఉప్పులు సహా చాలా నిత్యావసర సరుకుల ధర దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఒకటే స్థాయిలో ఉంటుందని మీకు తెలియదా రామోజీ? 

2015లో కందిపప్పు కిలో రూ.200కు చేరిందని (తెలంగాణలో) మీ పత్రికలోనే రాశారుగా? 

మినపప్పు రూ.190, పెసరపప్పు రూ.140 పలుకుతున్నట్లు కూడా రాసింది మీరే!!

ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఉన్న ధరలే ఇతర పొరుగు రాష్ట్రాల్లోనూ ఉన్నాయనే సంగతి మీకు తెలియనిదా? 

మరి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ధరలు పెంచి దోచుకుంటున్నారంటూ ‘టీడీపీ’ వేస్తున్న కరపత్రం మాదిరే మీ పత్రికలోనూ టేబుళ్లు అచ్చేస్తుంటే ఏమనుకోవాలి? ఆ పార్టీ కరపత్రానికీ, మీరు అచ్చేసే కరపత్రానికీ కొంచెమైనా తేడా ఉండాలి కదా?

మీ తెలుగుదేశం మిత్రులు రాసిన అంకెలనే మీరు కూడా యథాతథంగా అచ్చేస్తే ఎలా?

ప్రభుత్వంపై తెలుగుదేశం ఓ కరపత్రం వేస్తుంది. ప్రతిపక్షం కాబట్టి అది ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చు. కానీ అదే కరపత్రాన్ని ‘ఈనాడు’ ఎంచక్కా అచ్చేస్తుంది. అదే ‘ఈనాడు’ కాపీని పట్టుకుని... తెలుగుదేశం విమర్శలకు దిగుతుంది. ఏమనుకోవాలి దీన్ని? ఏం జర్నలిజమిది? దొంగలు–దొంగలు చేతులు కలపటమంటే ఇది కాదా? రామోజీ తన పత్రికను నడుపుతున్నది ఎవరి కోసం? దేశం కోసమా...! తెలుగుదేశం కోసమా? దేశవ్యాప్తంగా పెరుగుతున్న ధరలను కూడా రాష్ట్రానికి అంటగట్టి... మూడేళ్ల కిందటితో పోలుస్తూ పొలికేకలు పెడుతున్న రామోజీకి... తన బాబు హయాంలో కూడా ధరలు ఇంతే తీవ్రంగా ఉన్నాయని తెలియదా? అప్పట్లో తానే తన పత్రికలో వీటిని అచ్చేసిన విషయం మరిచారా? మరి ఎందుకీ దిగజారుడు రాతలు? ‘ఇంటి ఖర్చు ఇంతింత కాదయా’ అంటూ రాసిన రాతల్లో ఏది నిజం?

ప్రతిపక్షంగా గొంతెత్తడానికి ఏ అంశాలూ లేకపోవటంతో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఓ విచిత్రమైన ప్రచారానికి పూనుకుంది. నిత్యావసరాలపై ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ‘బాదుడే – బాదుడు’ అనే కార్యక్రమాన్ని ఎత్తుకుంది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేని పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌ వంటివన్నీ ప్రస్తావిస్తూ... వాటిపై పెరిగిన ధరల మొత్తాన్ని ఏకంగా ముఖ్యమంత్రే దోచేసుకుంటున్నారంటూ విషప్రచారానికి పూనుకుంది. ఈ ప్రచారాన్ని మరింతగా జనంలోకి తీసుకెళ్లేలా రామోజీరావు ‘ఈనాడు’ ద్వారా తనవంతు సాయం చేయటం మొదలెట్టారు. అందులో భాగంగానే... ధరలెందుకు పెరుగుతున్నాయి? కారణాలేంటి? వాటిని నియంత్రించగలిగేదెవరు? అనే అంశాలు వీసమాత్రమైనా లేకుండా... కేవలం ధరలు పెరగటం, వాటివల్ల జనంపై పెరుగుతున్న భారాన్ని నోటిలెక్కలు వేయటం... మూడేళ్ల కిందట ఈ పరిస్థితి లేదని, అప్పట్లో చంద్రబాబు పాలన గుప్తుల కాలం నాటి స్వర్ణయుగంలా సాగిందంటూ రాతలు రాసిపారేస్తున్నారు. 

రామోజీ! ఇందులో రాష్ట్రం బాధ్యత ఎంత?
రెండేళ్ల పాటు కోవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసింది. ఇప్పటికీ దాని ఛాయలు పూర్తిగా తొలగిపోలేదు. ఈ సమయంలో పెట్రో ఉత్పత్తుల వినియోగం దారుణంగా పడిపోవటం... దాంతో కొన్నిచోట్ల ఉత్పత్తి నిలిపేయటం... మళ్లీ డిమాండ్‌ పుంజుకున్నా ఉత్పత్తి మునుపటిలా పెరగకపోవటం... ఇదే సమయంలో రష్యా– ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం తలెత్తడం... ఇవన్నీ కలిసి పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ ధరలను విపరీతంగా పెంచాయి. మరి ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఎంత? రాష్ట్రం ప్రత్యేకంగా పన్నులేమైనా పెంచిందా? దీనికి రాష్ట్రాన్ని తప్పుబట్టడం ఎంతవరకు సమంజసం?

పెట్రో ఉత్పత్తులే కాదు! వంటనూనెల ధరలూ ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఆకాశాన్నంటడం మొదలెట్టాయి. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) కూడా తీవ్రంగా ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేని అంశం. ఇక పెట్రోల్, డీజిల్‌ విషయానికొస్తే వీటిపై రాష్ట్రం పెంచగలిగేది ఒక్క వ్యాట్‌ను మాత్రమే. కానీ... 2019 నుంచీ ఏపీ ప్రభుత్వం ఒక్క శాతం కూడా వ్యాట్‌ను పెంచలేదు. చంద్రబాబు హయాంలో ఉన్నప్పటి ధరలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే ధరలున్నాయి. పెట్రో ఉత్పత్తుల ధరలు ప్రధానంగా చమురు కంపెనీల నిర్ణయం, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆధారపడి కొనసాగుతున్నాయి. ఇవన్నీ పక్కనబెట్టి... చంద్రబాబు ‘బాదుడే – బాదుడు’ కోసం రామోజీ ఈ స్థాయిలో దిగజారి తన పాఠకులను అబద్ధాలతో బాదారంటే ఏమనుకోవాలి?  

వంటనూనెల ధరలు మీరు పెంచలేదా? 
రామోజీ రాతల్లో డొల్లతనం ఎంతుందో ఒక్క వంటనూనెల ధరలను బట్టే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ నుంచి మన దేశానికి వంటనూనెల దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో డిమాండ్‌కు తగ్గ సప్లయ్‌ లేక ధరలు బాగా పెరిగాయి. ప్రియా బ్రాండ్‌తో వంటనూనెలు, పచ్చళ్లు విక్రయించే రామోజీ... తాను సైతం వాటి ధరలను బాగానే పెంచారు. కొన్ని ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లలో ప్రియా వంటనూనె తక్కువ ధరనే చూపిస్తున్నా... ఒక్క లీటర్‌ కూడా ఆ «ధరకు దొరికే పరిస్థితి లేదు. నిజానికి యుద్ధ ప్రభావంతో దిగుమతులు తగ్గి... అంతర్జాతీయంగా వంటనూనెల ధరలు బాగా పెరిగాయి. ఇది వాస్తవం. కానీ దీన్ని దాచిపెట్టి... ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే పెరిగినట్లుగా... అది కూడా మూడేళ్ల కిందట వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచే పెరిగినట్లుగా రాయటంలోనే ‘ఈనాడు’ దివాలాకోరుతనమంతా కనిపిస్తుంది. 

పెట్రోల్‌ ధరలపై వాస్తవాలను వివరిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో ఓ భాగం 

విద్యుత్‌ చార్జీలపై దుష్ప్రచారం కాదా? 
విద్యుత్‌ చార్జీలు చంద్రబాబు నాయుడి హయాంలో భారీగా పెరిగాయి. మూడేళ్ల తరవాత ఇటీవల మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం స్వల్పంగా విద్యుత్‌ చార్జీలను పెంచింది. కానీ ఇప్పుడే విద్యుత్‌ చార్జీలు భారీగా పెరిగాయని, దీనివల్లే మొత్తం ఇంటి బడ్జెట్‌ తల్లకిందులైపోతోందని రామోజీ గుండెలు బాదేసుకున్నారు. చంద్రబాబు హయాంలో నెలవారీ విద్యుత్‌ వినియోగం 76 యూనిట్లు నుంచి 100 యూనిట్లు వినియోగించే వారికి కూడా విద్యుత్‌ బిల్లులు 28.40 శాతం నుంచి 41.04 శాతం వరకు పెరిగాయి. అయినా అçప్పట్లో దానిపై ఒక్క వార్తా రాయకపోవటమే రామోజీ అసలు సిసలు పాత్రికేయ పాతివ్రత్యం.

అప్పట్లో సాధారణ పరిస్థితుల్లో కూడా... 
నిజానికి పప్పుల విషయానికొస్తే కోవిడ్‌ సంక్షోభం, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం లేని సాధారణ రోజుల్లోనూ... చంద్రబాబు పాలన కాలంలో పప్పుల ధరలు భారీగా  పెరిగాయి. అప్పట్లో అదే విషయమై సాక్షాత్తూ ‘ఈనాడు’లోనే పలు కథనాలు రాశారు. కాకపోతే వాటిని బాబు పరిపాలన లేని తెలంగాణలో మాత్రమే అచ్చేశారు... అది వేరే సంగతి. 30–10–2015న  ‘ఈనాడు’ ఓ కథనాన్ని రాస్తూ.. అప్పటి ధరలను అంతకు ముందటేడాదితో పోల్చింది. ఆ ఏడాది కాలంలోనే కందిపప్పు రూ.70 నుంచి 200కు... మినపప్పు రూ.80 నుంచి రూ.190కి.. పెసరపప్పు రూ.70 నుంచి 140కి పెరిగి కూర్చున్నాయి. అంటే... బాబు వచ్చిన ఏడాదిలోనే ఒక్కొక్కటీ 100 నుంచి 180 శాతం వరకూ పెరిగాయి. మరి దీన్నేమనుకోవాలి? అప్పట్లో ఎందుకు బాబు వచ్చాక ఈ స్థాయిలో పెరిగిపోయాయని రాయలేదు? 

ఇప్పుడు కోవిడ్‌ సంక్షోభం, ఉక్రెయిన్‌ యుద్ధం వంటి పరిస్థితుల్లో కూడా ఇదే ‘ఈనాడు’ రాతల ప్రకారమే మినపప్పు ధర కిలో 112 రూపాయలుంది. మరి అప్పట్లో ఇంకా ఎక్కువున్నట్టుగా? ఆ విషయాన్నెందుకు ప్రస్తావించరు?

ద్రవ్యోల్బణం పెరిగిందిలా...
సామాన్యుల మాటల్లో చెప్పాలంటే ద్రవ్యోల్బణమంటే ధరల పెరుగుదలే. ఏడాదిలో ఏ స్థాయిలో పెరిగాయన్నది ఈ సూచీ తెలియజేస్తుంది. దీన్నిబట్టే అంతర్జాతీయంగా, దేశీయంగా ధరలు ఏ ధోరణిలో ఉన్నాయో అర్థమవుతుంది. అలాంటి ద్రవ్యోల్బణం 2015 నుంచీ ఇప్పటి దాకా ఎలా మారుతూ వచ్చిందంటే... 

మరిన్ని వార్తలు