ఏది నిజం ?: ‘సున్నా వడ్డీ’లోనూ వక్రమార్కుడు.. రామోజీ విషపు రాతలు

2 Dec, 2022 03:50 IST|Sakshi

ఏటా క్రమం తప్పకుండా రైతుల ఖాతాలకు సున్నా వడ్డీ రాయితీ 

టీడీపీ ఐదేళ్లలో 40.61 లక్షల మందికి రూ.685.46 కోట్లే చెల్లింపు 

వైఎస్సార్‌సీపీ మూడున్నరేళ్లలో 73.88 లక్షల మంది 

వాస్తవ సాగుదారులకు రూ.1,838.61 కోట్లు చెల్లింపు 

ఇందులో 39.08 లక్షల మందికి ఎగ్గొట్టిన చంద్రబాబు

పైగా.. నాడు వడ్డీ క్లెయిమ్‌లు బ్యాంకు ఖాతాలకు చెల్లించే వారు 

అదే ఇప్పుడు వడ్డీ రాయితీ మొత్తం నేరుగా రైతుల ఖాతాల్లో జమ 

అప్పట్లో లబ్ధిదారుల జాబితాలు ప్రదర్శించడం, ఎవరికి ఎంత జమైందో తెలిసేదే కాదు 

నేడు సామాజిక తనిఖీ కోసం పారదర్శకంగా ఆర్బీకేల్లో అర్హుల జాబితాలు.. అర్హత ఉండి రాయితీ పడని వారికి మళ్లీ దరఖాస్తు చేసుకునే చాన్స్‌ 

నాటికీ నేటికీ ఇంత తేడా ఉన్నా రామోజీ విషపు రాతలు  

బురదజల్లుడు, అబద్ధాలు అచ్చేయడం, అర్థంపర్థంలేని వార్తలు వండి వార్చడంలో తన రికార్డులను తానే బద్దలుకొట్టుకుంటున్న ఎల్లో జర్నలిస్ట్‌ రామోజీరావు ఎప్పటిలాగే టీడీపీ వైపు తన చేతివాటాన్ని మరోసారి ప్రదర్శించారు. ఈసారి ఆయన రూటు సాగువైపు మళ్లింది. ‘వడ్డీ రాయితీ పెద్ద సున్నా’ అంటూ ఆయన తాజాగా అచ్చోసిన అసత్యాల కథనం నిజంగానే నిజాల్ని దాచి వండిన వంటకం. పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి ఎంత హానికరమో ఈనాడు పత్రిక కూడా ఆ పాఠకులకు అంతే హానికరం. 

ఎందుకంటే..
రాష్ట్రంలో చిన్న, సన్నకారు, వాస్తవ సాగుదారులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకానికి’ 2019లో శ్రీకారం చుట్టింది. రూ.లక్షలోపు తీసుకున్న పంట రుణాలను ఏడాదిలోపు తిరిగి చెల్లించిన రైతులకు మరుసటి సీజన్‌ రాకముందే వారు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమచేస్తూ వారికి అండగా నిలుస్తోంది. కానీ, టీడీపీ ఐదేళ్లలో 40.61 లక్షల మందికి కేవలం రూ.685.46 కోట్లు చెల్లిస్తే, గడిచిన 3.5 ఏళ్లలో 73.88 లక్షల మంది వాస్తవ  సాగుదారులకు ప్రస్తుత వైఎస్‌ జగన్‌ సర్కారు రూ.1,838.61 కోట్లు చెల్లించింది.

వీటిలో రూ.1,180.66 కోట్లు టీడీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలే. ఇలా బాబు ఎగ్గొట్టిన బకాయిలతో సహా ఏటా క్రమం తప్పకుండా అర్హతగల ప్రతీ రైతుకు అణా పైసలతో సహా వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంటే చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే ఈనాడు రామోజీరావు కళ్లున్న కబోదిలా ప్రవర్తిస్తూ ఆ పత్రికల పాఠకులపై చిమ్ముతున్న విషానికి అంతులేకుండా పోతోంది. నిజానికి.. గతంలో ఇంతపెద్ద ఎత్తున, ఇంత పారదర్శకంగా డీబీటీ విధానంలో నేరుగా రైతుల ఖాతాల్లో జమయ్యేలా వడ్డీ రాయితీ పథకాన్ని అమలుచేసిన దాఖలాల్లేవు. అయినా ఇవేమీ ఎల్లో జర్నల్‌ అయిన ఈనాడుకు కన్పించవు.

అర్హుల జాబితా ప్రదర్శించినా అక్కసే..
మరోవైపు.. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకానికి మరింత మెరుగులద్ది పారదర్శకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోంది. వడ్డీ రాయితీ చెల్లింపుల్లో జాప్యానికి తావులేకుండా ఉండేందుకు ఏడాదిలోపు రుణం చెల్లించిన లబ్ధిదారుల డేటా బ్యాంకుల ద్వారా ఎస్వీపీఆర్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసేలా ఏర్పాటుచేశారు. ఈ డేటా ఈ–క్రాప్‌ డేటాతో ధ్రువీకరించి అర్హులైన రైతుల జాబితాను గుర్తించి సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు.

అంతేకాదు.. మొబైల్‌ ద్వారా ఎస్వీపీఆర్‌ (సున్నా వడ్డీ పంట రుణాల) పోర్టల్‌ https://karshak. ap. gov. in/ ysrsvpr/లోకి వెళ్లి హోంపేజీలో ‘know your status‘ అనే విండో ఓపెన్‌ చేసి తమ ఆధార్‌ నంబరుతో చెక్‌ చేసుకునే వెసులుబాటు రైతులకు కల్పించారు. ఒకవేళ ఏడాదిలోగా రూ.లక్షలోపు రుణాలు తిరిగి చెల్లించి వడ్డీ రాయితీకి అర్హత పొంది, జాబితాలో తమ పేర్లు లేకపోతే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించారు. ఇలా అర్హత పొందిన రైతుల ఖాతాల్లో వారు చెల్లించిన నాలుగు శాతం వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం ఏటా క్రమం తప్పకుండా జమచేస్తున్నా ఈనాడు తట్టుకోలేకపోతోంది. అంతేకదా.. రామోజీ.

ఎక్కువమంది లబ్ధి పొందేలా విస్తృత ప్రచారం
ఇక రూ.లక్ష లోపు రుణం సకాలంలో చెల్లించడం ద్వారా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని వడ్డీ భారం నుంచి రైతులు విముక్తి పొందేందుకు వీలుగా రైతుభరోసా కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది. కరపత్రాలు, వాల్‌ పోస్టర్లు, వాట్సాప్‌ గ్రూపుల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

గత నెల 28న రబీ 2020–21, ఖరీఫ్‌ 2021 సీజన్లలో అర్హత పొందిన 8.22 లక్షల మంది రైతులకు రూ.160.55 కోట్ల వడ్డీ రాయితీని సీఎం  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా రైతుల పొదుపు ఖాతాలకు జమచేశారు. ఇలా గడిచిన మూడున్నరేళ్లలో పాత బకాయిలు కలిపి 73.88 లక్షల మందికి రూ.1,838.61 కోట్లు చెల్లించారు.

పాత బకాయిలకు సంబంధించే కాదు గడిచిన మూడేళ్లకు సంబంధించి కూడా ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేకుండా అర్హుల ఖాతాల్లోకి సున్నా వడ్డీ రాయితీ జమచేశారు. అయినా ఇవన్నీ విస్మరించి ఎందుకు రామోజీ ఈ వయస్సులో అబద్ధాల సాగుకు అంత ఆయాసం..?

రూ.1,180.66 కోట్ల బకాయిలు ఈనాడుకు కన్పించవు
కానీ, ఈ పరిస్థితులకు వైఎస్‌ జగన్‌ సర్కార్‌ చెక్‌ పెట్టింది. వడ్డీ రాయితీని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ (డీబీటీ) చేసేలా మార్పుచేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకానికి శ్రీకారం చుట్టారు. అంతేకాదు.. టీడీపీ హయాంలోని బకాయిల చెల్లింపునకూ ముందుకొచ్చి రైతులపట్ల తనకున్న చిత్తశుద్ధిని ఆయన చాటుకున్నారు.

ఇలా 2014–15లో రూ.3.46 కోట్లు, 2015–16లో రూ.1.91 కోట్లు, 2016–17లో రూ.212.33 కోట్లు, 2017–18లో రూ.345.18 కోట్లు, 2018–19లో రూ.617.78 కోట్లు కలిపి మొత్తం 39.08 లక్షల మంది రైతులకు రూ.1,180.66 కోట్ల బకాయిలను చెల్లించారు. బాబు ఎగ్గొట్టిన ఈ బకాయిలపై ‘ఘనత వహించిన’ ఈనాడు ఏనాడు దీనిపై వార్త రాసిన పాపానపోలేదు. అలాగే, ఐదేళ్లలో కేవలం 40.61 లక్షల మందికి రూ.685.46 కోట్లే చెల్లిస్తే ఎందుకింత తక్కువ చెల్లించారని కూడా ప్రశ్నించడానికి రామోజీకి పెన్ను పెగలలేదు.

రామోజీ.. అప్పట్లో అప్పులకు జమచేసుకోలేదా? 
వాస్తవానికి ప్రతీ సీజన్‌లో వ్యవసాయ అవసరాల కోసం రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకుంటారు. రూ.లక్షలోపు రుణాన్ని ఏడాదిలోపు చెల్లిస్తే బ్యాంకులు వసూలుచేసే ఏడు శాతం వడ్డీలో 3 శాతం కేంద్రం రాయితీ ఇస్తుంది. మిగిలిన 4 శాతం రైతులు భరించేవారు. గతంలో ‘వడ్డీలేని రుణ పథకం’ కింద రైతులు చెల్లించిన వడ్డీ రాయితీని బడ్జెట్‌ కేటాయింపులను బట్టి ఏడాదికో.. రెండేళ్లకో వీలునుబట్టి బ్యాంకులకు అరకొరగా జమచేసేవారు.

ఈ మొత్తం జమకాగానే బ్యాంకులు వెంటనే రైతులు చెల్లించాల్సిన అప్పు ఖాతాలకు సర్దుబాటు చేసేసేవారు. అలాగే, గతంలో క్లెయిమ్స్‌ డేటాను అప్‌లోడ్‌ చేయడానికి నోడల్‌ బ్రాంచీలకు మాత్రమే వీలుండేది. దీంతో ఎంతమంది అర్హత పొందారు.. వారికి ఎంత వడ్డీ రాయితీ జమైందో రైతులకే కాదు.. సంబంధిత బ్యాంకు శాఖలకు కూడా తెలిసేది కాదు. సామాజిక తనిఖీ కోసం బ్యాంకుల వద్ద కానీ, ప్రభుత్వ కార్యాలయాల వద్ద కానీ జాబితాలు ప్రదర్శించే పరిస్థితులు ఉండేవి కాదు.  

మరిన్ని వార్తలు