ఆకాశవాణి రేడియో కేంద్రం.. మీరు వింటున్నారు.. 

18 May, 2022 09:41 IST|Sakshi
నెల్లూరులోని ఆకాశవాణి కేంద్రం

కార్పొరేట్‌ హంగులతో రేడియో కేంద్రం 

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవతో ఏర్పాటు 

నగరం నుంచి  85 కి.మీ.  వరకు ప్రసారాలు  

శ్రోతలకు పలు సమాచారాలు, సూచనలు 

ఉత్తేజపరిచే భక్తి, సినీ, జానపద గేయాలు

ఆకాశవాణి రేడియో కేంద్రం.. ఆబాలగోపాలాన్ని అలరించిన అత్యంత ప్రియనేస్తం. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి. మన సంస్కృతిని సజీవంగా నిలిపిన ఓషధి. జాతీయ సమైక్యతకు సారథి. కళాకారులకు పెన్నిధి. ఒక్కమాటలో చెప్పాలంటే..  యావత్‌ భారత జనజీవనాన్ని అత్యంత ప్రభావితం చేసింది. మన జాతి సంస్కృతి సంప్రదాయాలను నిలపడంలో, కళలు మొదలు కరెంట్‌ అఫైర్స్‌ వరకు ఆకాశవాణి పోషించిన పాత్ర మరపురానిది. వార్తలకు అత్యంత ప్రామాణికత, ప్రాధాన్యం ఉండేది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, వివిధ సమయాల్లో ప్రజలు ఆకాశవాణి వార్తలపైనే ఆధారపడేవారు. అలనాటి తరాన్ని అలరించిన ఆకాశవాణి.. ఇప్పుడు సింహపురి వాణిగా శ్రోతలను అలరిస్తోంది. 

నెల్లూరు(బారకాసు): ఆకాశవాణి.. విజయవాడ, విశాఖపట్నం కేంద్రమంటూ సమాజంలో జరిగిన ముఖ్యమైన విశేషాలను వార్తల రూపంలో ప్రసారాలతో శ్రోతలను రేడియోలకు కట్టిపడేసింది. పాడి పంటలు, నాటికలు, భక్తి గీతాలు, సినీపాటలు, ప్రముఖుల ఇంటర్వ్యూలు, ఇలా అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేసి అలరించేది. సుమారు మూడు దశాబ్దాల క్రితం వరకు శ్రోతలను ఓలలాడించిన రేడియో ఆధునిక టెక్నాలజీ కారణంగా కనుమరుగైంది. టెలివిజన్‌ రంగం వైపు ప్రజలు మొగ్గు చూపారు. ఈక్రమంలో సాంకేతికతను అందిపుచ్చుకుని ఎఫ్‌ఎం స్టేషన్లను తీసుకురావడం ద్వారా ఆకాశవాణి ప్రసారాల్లో నాణ్యత, స్పష్టత పెరిగింది. దీంతో శ్రోతలు మళ్లీ ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రసార భారతి (భారత ప్రజా సేవా ప్రసార సంస్థ)ను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల భాషకు అనుగుణంగా ప్రజలకు అవసరమైన వివిధ కార్యక్రమాలను ప్రసారాలు చేయడం ప్రారంభించింది.   

చదవండి: (SPSR Nellore District: నీరు చెట్టు.. కనిపిస్తే ఒట్టు)

నెల్లూరులో.. 
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కృషితో నెల్లూరుకు ఆకాశవాణి కేంద్రం మంజూరైంది. ఈ కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతోపాటు దీనిని గత నెల 27వ తేదీన ఆయన చేతుల మీదుగానే ప్రారంభించడం విశేషం. కార్పొరేట్‌ హంగులతో భవనాన్ని నిర్మించి అందులో అత్యాధునిక టెక్నాలజీని ఏర్పాటు చేశారు. అదే ప్రాంగణంలో వంద మీటర్ల ఎత్తులో ప్రసార టవర్‌ను ఏర్పాటు చేశారు. తద్వారా ఈ కేంద్రం నుంచి 85 కి.మీ. మేర వరకు ప్రసారాలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఇదే కేంద్రం నుంచి కేవలం 45 కి.మీ. మేర లోపే  ప్రసారాలు అందుబాటులో ఉండేవి.

నెల్లూరులో స్థానిక భాష, సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం, ఆచార వ్యవహారాలు, స్థానిక పండగల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. సింహపురిలో ఆకాశవాణి నెల్లూరు కేంద్రం వేగంగా అభివృద్ధి చెందుతోంది. మన రాష్ట్రంలో మొదటగా విజయవాడ తర్వాత విశాఖపట్నం, కడప, తిరుపతి రేడియో కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొంతకాలానికి అనంతపురం, కర్నూలు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, ఇటీవల నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేశారు. 

ఇక్కడి కేంద్రం విశేషాలు  
నెల్లూరులో 2019 మేలో లైవ్‌ ఫోన్‌ ఇన్‌ ప్రోగ్రాం ప్రారంభం  
అదే ఏడాది నవంబర్‌లో ఎఫ్‌ఎంఎస్‌ ఆధారిత సేవలు  
2020 ఫిబ్రవరిలో ఉదయం కార్యక్రమాలు ప్రారంభం. 
2020 సంవత్సరం జూలైలో ఆకాశవాణి కేంద్రాన్ని సింహపురి ఎఫ్‌ఎం కేంద్రంగా మార్చారు. 
2020 ఆగస్టులో సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. 
న్యూస్‌ ఆన్‌ ఎయిర్‌ యాప్‌ ద్వారా ప్రపంచానికి సింహపురి ఎఫ్‌ఎం సేవలు అందుబాటులోకి..  
2021 నవంబర్‌లో జిల్లాలో భారీ వర్షాలు, వరదలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి  ప్రత్యేక బులెటిన్‌ ప్రసారం. 
కరోనా కాలంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు. 
నెల్లూరుకు చెందిన వారితో కవి సమ్మేళనాలు, సాహిత్య సదస్సులు ప్రసారం. 
స్థానిక సాహితీవేత్తల సహకారంతో ప్రకృతి నేర్పిన పాఠాలు, పెన్నా కథల పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు. 
ప్రసార సామర్థ్యాన్ని పెంచేందుకు టవర్‌ ఎత్తును వంద మీటర్ల వరకు ఏర్పాటు. 

ఎంత వ్యయంతో.. : రూ.15 కోట్లు 
ప్రసారాలు : ఉదయం 5.48 నుంచి రాత్రి 11.11 గంటల వరకు 

మరిన్ని వార్తలు