Egg Prices: కొండెక్కిన కోడిగుడ్డు.. సామాన్యుల బెంబేలు 

7 Dec, 2022 15:09 IST|Sakshi

రిటైల్‌ మార్కెట్‌లో రూ.7కు చేరిన గుడ్డు

శీతల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల ఎగుమతులకు డిమాండ్‌ 

కార్తిక మాసం ముగియడంతో పెరిగిన స్థానిక వినియోగం 

నెక్‌ ప్రకటిత రైతు ధర రూ.5.44 

సాక్షి, తూర్పుగోదావరి(మండపేట): కోడి గుడ్డు ధర కొండెక్కింది. రైతు ధర రూ.5.44 ఉండగా రిటైల్‌ మార్కెట్‌లో రూ.ఏడుకు చేరి సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. శీతల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు పుంజుకున్నాయి. మరోపక్క కార్తిక మాసం ముగియడంతో స్థానిక వినియోగం పెరగడంతో గుడ్డు ధరకు రెక్కలొచ్చాయి. కాగా సీజన్‌లో రైతు ధర నిలకడగా ఉంటేనే నష్టాలు కొంత భర్తీ అవుతాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి. 

తక్కువ ధరలో పౌష్టికాహారాన్ని అందించే కోడిగుడ్లను సామాన్య మధ్య తరగతి ప్రజలు అధికంగా వినియోగిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 200 పౌల్ట్రీలు ఉండగా వాటిలో గుడ్లు పెట్టే కోళ్లు 1.4 కోట్లు వరకు ఉన్నాయి. రోజుకు సుమారు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. 60 శాతం గుడ్లు పశ్చిమబెంగాల్, ఒడిశా, బిహార్‌ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా మిగిలినవి స్థానికంగా వినియోగిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో శీతాకాలంలో చేపల లభ్యత తక్కువగా ఉండటం వల్ల గుడ్ల వినియోగం పెరిగి ఎగుమతులకు డిమాండ్‌ ఉంటుంది. శీతల ప్రభావం అధికంగా ఉండే అక్టోబర్‌ చివరి నుంచి ఫిబ్రవరి వరకు పౌల్ట్రీకి సీజన్‌గా భావిస్తారు. ఈ నాలుగు నెలల కాలంలో రైతు ధర పౌల్ట్రీకి ఆశాజనకంగా ఉంటుంది.  

పౌల్ట్రీ వర్గాల ఆందోళన 
మంగళవారం నాటికి రైతు ధర రూ. 5.44కు చేరింది. కాగా రిటైల్‌ మార్కెట్‌లో రూ.6.50 నుంచి రూ.7 పలుకుతుండటంతో సామాన్య వర్గాల వారు వాటిని కొనుగోలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా రైతు ధరకు 40 నుంచి 50 పైసల వరకు అదనంగా బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు అమ్మకాలు చేయడం పరిపాటి. అందుకు భిన్నంగా రూపాయి నుంచి రెండు రూపాయల వరకు పెంచి అమ్ముతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమ విస్తరించి ఉన్న మండపేట, అనపర్తి, పెద్దాపురం, రాజానగరం పరిసర ప్రాంతాల్లో రూ 6.50కు అమ్మకాలు చేస్తుండగా రామచంద్రపురం, రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, తుని, జగ్గంపేట తదితర చోట్ల ఏడు రూపాయల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. మారుమూల గ్రామాల్లో రూ.7.50కు అమ్మకాలు జరుగుతున్నట్టు వ్యాపారులు అంటున్నారు.

చదవండి: (వైఎస్సార్‌సీపీ నేత హత్యపై సీఎం జగన్‌ ఆరా.. ధర్మానకు కీలక ఆదేశాలు)

రెండు వారాల క్రితం రూ.5 ఉన్న గుడ్డు ధరను ఏడు రూపాయలు వరకు పెంచేశారని వినియోగదారులు అంటున్నారు. డ్యామేజీ అయిన గుడ్ల నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ధర పెంచకతప్పడం లేదని వ్యాపారులు అంటున్నారు. కాగా రిటైల్‌ మార్కెట్‌లో ధర బాగా పెరిగిపోవడం పౌల్ట్రీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. అధిక ధరతో వినియోగం తగ్గితే ఆ ప్రభావం పరిశ్రమపై పడుతుందంటున్నారు. పెరిగిన మేతలు, మందుల ధరలు, నిర్వహణ భారంతో గుడ్డు ఏడాది సగటు రైతు ధర ఐదు రూపాయలు ఉంటేనే గిట్టుబాటు కాదని కోళ్ల రైతులు అంటున్నారు. ఈ ఏడాది సగటు ధర నాలుగు రూపాయలు మాత్రమే ఉండటంతో ఆ మేరకు నష్టపోవాల్సి వస్తోందంటున్నారు. సీజన్‌లో రైతు ధర రూ. 5.50 దాటి నిలకడగా ఉంటేనే పాత నష్టాలను భర్తీ చేసుకునేందుకు వీలుంటుందన్నారు.  

రైతు ధర నిలకడగా ఉండాలి  
మేత ధరలు విపరీతంగా పెరిగిపోవడం, గుడ్డు ధర గిట్టుబాటవ్వక కోళ్ల పరిశ్రమ తీవ్ర నష్టాల్లో ఉంది. ఏడాది సగటు రైతు ధర రూ. ఐదు ఉంటేనే కాని గిట్టుబాటు కాదు. ప్రస్తుత రైతు ధర సీజన్‌లో నిలకడగా ఉంటే పాత నష్టాలు కొంతమేర భర్తీ అవుతాయి. ఎంతోమందికి జీవనాధారంగా ఉన్న పౌల్ట్రీ పరిశ్రమను నష్టాల్లోంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వపరంగా సాయం కోరుతున్నాం.  
–  పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అర్తమూరు  

మరిన్ని వార్తలు