కరోనా: ఒంటరితనం.. ఆపై వెంటాడిన భయం

16 Apr, 2021 11:12 IST|Sakshi
కాలువలో కర్రి వెంకటరెడ్డి, సావిత్రి దంపతుల మృతదేహాలు

వృద్ధ దంపతులను మింగిన కరోనా వేదన 

రాయవరం: కరోనా భయం ఆ దంపతులను వెంటాడింది. తాము చనిపోతామనే అపోహ వారి జీవితాలను కబళించింది. తమ కుమారులిద్దరూ వ్యాపారాల నిమిత్తం దూరంగా ఉండడం.. కరోనా పాజిటివ్‌ రావడంతో ఆ దంపతులిద్దరూ మానసికంగా కుంగిపోయారు. బలవన్మరణానికి పాల్పడ్డారు. రాయవరం మండలం మాచవరం గ్రామానికి చెందిన కర్రి వెంకటరెడ్డి(71), సావిత్రి దంపతులు గురువారం మండపేట కెనాల్‌లో పడి మృతి చెందారు.

వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్న వెంకటరెడ్డి, సావిత్రి దంపతులకు ఈ నెల 12న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అప్పటి నుంచి హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటున్నారు. వెంకటరెడ్డి, సావిత్రి దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా, వ్యాపారం కోసం ఓ కుమారుడు ఒడిశాలో, మరో కుమారుడు రాజమహేంద్రవరంలో ఉంటున్నారు. కుమారులిద్దరూ వీరి బాగోగులు చూసుకుంటున్నారు.

అలికిడి లేకపోవడంతో.. 
ఈ నెల 12 నుంచి ఈ దంపతులిద్దరూ హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటుండగా, గురువారం ఉదయం ఇంట్లో నుంచి అలికిడి లేకపోవడంతో ఇరుగుపొరుగు వారు రాజమహేంద్రవరంలో ఉంటున్న కుమారుడికి ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. కుమారుడు అనుమానంతో ఇంటి వద్ద, స్థానికంగా తల్లిదండ్రుల ఆచూకీ కోసం ప్రయత్నించారు. సాయంత్రం సమయంలో స్థానికంగా ఉన్న మండపేట కెనాల్‌లో మాచవరం గ్రామం సమీపంలో మృతదేహాలు తేలడంతో వీరు బలవన్మరణానికి పాల్పడినట్టు తెలిసింది. కేవలం కరోనా సోకిందన్న భయంతో వీరు కాలువలో పడి మృతి చెంది ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. కరోనా భూతం దంపతులను పొట్టన పెట్టుకోవడంపై స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దీనిపై రాయవరం పోలీసులను వివరణ కోరగా, తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

ఒంటరిని అవుతానన్న భయంతో మహిళ ఆత్మహత్య 
డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ): కరోనా ఓ ఇంటి ఇల్లాలిని కాటేసింది.. వ్యాధి తీవ్రత కన్నా, ఇక కోలుకోలేనేమో అన్న భయమే ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించింది. కోవిడ్‌ బారినపడి తనతోపాటు ఆస్పత్రిలో చేరిన భర్త, అత్త నయమై డిశ్చార్జి అవుతుండడంతో.. ఇంకా ఆక్సిజన్‌ సాయంతోనే ఉండాల్సిన దుస్థితి వచ్చిందని ఆ అభాగ్యురాలు మనస్తాపానికి లోనై ఈ దారుణానికి పాల్పడింది. కరోనా సోకడంతో అనకాపల్లి మండలం కొత్తూరుకు చెందిన విజయవెంకట రమణి (35) తన భర్త బాగాది శ్రీనివాసరావు, అత్త మణమ్మతో కలిసి ఈనెల 5న కేజీహెచ్‌లో చేరారు.

అక్కడ సీఎస్‌ఆర్‌ బ్లాక్‌లో చికిత్స పొందుతున్న ఆ ముగ్గురిలో భర్త, అత్త కోలుకోవడంతో గురువారం ఉదయం డిశ్చార్జి చేస్తామని వైద్యులు చెప్పారు. వారు వెళిపోతే తాను ఒంటరినవుతానని, ఇక వారిని చూస్తానో లేదోనని ఆందోళన పడ్డ రమణి సమీపంలోని కిటికీ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు జరిగిన ఈ ఘటనతో కేజీహెచ్‌ ఉలిక్కిపడింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కరోనా నిబంధనల మేరకు అంత్యక్రియలు ప్రభుత్వమే చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు.  
చదవండి:
వివాహేతర సంబంధం: మత్తుకు బానిసై కన్నతండ్రే..   
దారుణం: కూతురిపై తండ్రి కాల్పులు

మరిన్ని వార్తలు