కరోనా కాదంటూ రోదించినా...

13 Aug, 2020 08:38 IST|Sakshi

సకాలంలో వైద్యం అందక వృద్ధుడు మృతి

నడిరోడ్డుపై కూతురి రోదనలకు కరగని మనసులు

పలమనేరు(చిత్తూరు జిల్లా): కోవిడ్‌–19 వైరస్‌ భయం మానవత్వాన్ని మింగేస్తోంది. చావుబ్రతుకుల్లో ఉన్నవారిని చూసి.. సాయం అందించడానికి ఎవరూ ముందుకురాని సంఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా.. కరోనా వ్యాధిగ్రస్తులుగానే భావించి, సాయమందించడానికి జనం జంకిపోతున్నారు. ఈ భయమే ఓ వృద్ధుడి ప్రాణాన్ని తీసింది.. కుతురి ఆర్తనాదాలను నిరుపయోగం చేసింది. ఈ విచారకర ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో బుధవారం చోటుచేసుకుంది. (వైరస్‌ గుట్టు తెలిసింది! )

వివరాల్లోకి వెళితే.. గంగవరం మండలం కలగటూరుకు చెందిన వెంకటరామయ్య(73) శనివారం రాత్రి తన ఇంటిముందు పడుకుని ఉండగా పక్కంటికి చెందిన ఆవు అతని గుండెలపై కాలుపెట్టి తొక్కింది. దీంతో అతని పక్కటెముకలు విరిగి అస్వస్థకు గురయ్యాడు. బాధితునికి వైద్యం చేయించాలని ఆవు యజమానిని బాధిత కుటుంబ సభ్యులు అడిగినా పట్టించుకోలేదు .ఆదివారం ఉదయం అతని కుమార్తె హేమలత తండ్రిని పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చింది. వారు అతన్ని పరిశీలించి స్కానింగ్‌ చేయాలని, తమవద్ద స్కానింగ్‌ సౌకర్యం లేదని చెప్పి వెనక్కి పంపించారు.

పేదరాలైన ఆమె చేసేదిలేక తన తండ్రిని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపెట్టి ఇంటికి తీసుకెళ్లింది. బుధవారం ఆయనకు ఊపిరి తీసుకోవడం కష్టం కావడంతో మళ్లీ ఆటోలో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చింది. అక్కడ డాక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని భావిస్తుండగా వృద్ధుడు ఆటోలోనే ప్రాణం వదిలాడు. దీన్ని గమనించిన ఆటోడ్రైవర్‌ శవాన్ని రోడ్డుపై వదిలి వెళ్లిపోయాడు. 

 కరోనా కాదంటూ రోదించినా..
‘అయ్యా మా తండ్రి ఆవుతొక్కి చనిపోయాడు. కరోనా కాదు. సాయం చేయండి’ అని శవం ముందు మృతుని కుమార్తె ఆర్తనాదాలు చేసినా అక్కడి మనుషుల మనసులు కరుగలేదు. మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆమెను విచారించి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా