25 ఏళ్ల తరువాత కుటుంబం చెంతకు..

18 Apr, 2022 05:04 IST|Sakshi
మణిమాల వెంకట్రావును కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న పోలీసులు

జగ్గయ్యపేట అర్బన్‌: మతి స్థిమితం కోల్పోయి భార్యా బిడ్డలకు దూరమై అనాథగా జీవిస్తున్న ఓ వృద్ధుడు 25 ఏళ్ల తరువాత తిరిగి కుటుంబం చెంతకు చేరుకున్నాడు. ఈ ఘటన ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక చెరువు బజారుకు చెందిన మణిమాల వెంకట్రావు(70) ముఠా కార్మికుడిగా జీవించేవాడు. అతనికి భార్య వెంకాయమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకట్రావుఒకరోజు అతిగా మద్యం తాగి మతి స్థిమితం కోల్పోయాడు.

ఇంటికి చేరుకోలేక తిరిగి తిరిగి చివరకు తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని వృద్ధాశ్రమానికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు అతని కోసం కొన్నాళ్లపాటు వెతికి ఆశలు వదులుకున్నారు. ఇలా 25 ఏళ్లు గడిచిపోయాయి. ఇటీవల వెంకట్రావుకు పాత జ్ఞాపకాలు గుర్తుకు రావడంతో తోటి వారితో తన ఊరు, కుటుంబ సభ్యుల పేర్లు  చెప్పగలిగాడు. దీంతో వృద్ధాశ్రమం నిర్వాహకులు జగ్గయ్యపేట పోలీస్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేసి వెంకట్రావు వివరాలు చెప్పారు.

జగ్గయ్యపేట ఎస్‌ఐ రామారావు వెంటనే విచారణ చేసి స్థానిక చెరువుబజారులో వెంకట్రావు కుటుంబ సభ్యులు ఉన్నారని తెలుసుకొని, సమాచారమిచ్చారు. రంపచోడవరంలోని వృద్ధాశ్రమంలో ఉన్న వెంకట్రావును అక్కడి పోలీసుల సహాయంతో జగ్గయ్యపేటకు తీసుకొచ్చారు. ఆదివారం జగ్గయ్యపేట పోలీస్‌స్టేషన్‌లో వెంకట్రావును అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

>
మరిన్ని వార్తలు