చింతకాయల కోసం వెళ్లి.. చిక్కుకుపోయి.. చివరికి..

25 Apr, 2022 17:14 IST|Sakshi
నరసమ్మను కుటుంబసభ్యులకు అప్పగిస్తున్న ఎస్‌ఐ నరసింహుడు   

పుట్టపర్తి(శ్రీసత్యసాయి జిల్లా): చింతకాయల కోసం ఓ వృద్ధురాలు అడవికి వెళ్లింది. దారి తప్పి 2 రోజుల పాటు అక్కడే ఉండిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా వృద్ధురాలి ఆచూకీ కనిపెట్టి క్షేమంగా అప్పగించారు. బుక్కపట్నం మండలం కొత్తకోటలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు.. కొత్తకోటకు చెందిన రామన్న భార్య నరసమ్మ (60) ఈ నెల 22న గ్రామానికి సమీపంలోని అడవిలో ఉన్న తోపులో చింతకాయల కోసం వెళ్లింది.

మధ్యాహ్నం వరకూ చింతకాయలు కోసుకొని ఇంటికి బయలు దేరింది. గ్రామానికి వచ్చే దారి తప్పి అడవిలోనే ఉండిపోయింది. రాత్రయినా తల్లి ఇంటికి రాకపోవడంతో కుమారుడు చంద్ర సమీపంలోని అటవీ ప్రాంతంలో గాలించినా ఆచూకీ లభించలేదు. రెండు రోజులు గడిచినా తిరిగి రాకపోవడంతో చంద్ర ఆదివారం బుక్కపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ నరసింహుడు సిబ్బందితో కలిసి అడవికి వెళ్లి వృద్ధురాలి కోసం గాలించారు. వీరికీ ఆచూకీ లభించలేదు.

దారి చూపిన సెల్‌ఫోన్‌ సిగ్నల్‌
అడవిలో దారి తప్పిన నరసమ్మ వద్ద సెల్‌ఫోన్‌ ఉందని తెలియడంతో ఎస్‌ఐ, సిబ్బంది సిగ్నల్‌ ఆధారంగా ఆచూకీ కోసం ప్రయతి్నంచారు. ఫోన్‌ స్విచాఫ్‌లో ఉన్నా సిగ్నల్‌ ఆధారంగా కొత్తకోట అడవిలోని శీనప్ప కుంట దగ్గర వృద్ధురాలు ఉన్నట్లు కనుగొన్నారు. వెంటనే అక్కడికి చేరుకుని క్షేమంగా ఆమెను ఇంటికి చేర్చారు. వృద్ధురాలు అడవిలో 12 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లిందని ఎస్‌ఐ పేర్కొన్నారు.

ఎస్‌ఐకి ఘన సన్మానం 
నరసమ్మ ఆచూకీ కనిపెట్టి క్షేమంగా బంధువులకు అప్పగించిన ఎస్‌ఐ నరసింహుడు, సిబ్బందిని గ్రామస్తులు ఘనంగా సన్మానించి పూలవర్షం కురిపించి ఊరేగించారు. కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నాగమణి, వైఎస్సార్‌సీపీ నాయకుడు కొత్తకోట కేశప్ప, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు