తిరుపతి 7వ డివిజన్‌ ఎన్నికల వాయిదాపై హైకోర్టులో పిటిషన్

6 Mar, 2021 06:15 IST|Sakshi

ఎన్నికను నిలిపేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదు

హైకోర్టుకు నివేదించిన పిటిషనర్‌ న్యాయవాది

విచారణ సోమవారానికి వాయిదా

సాక్షి, అమరావతి: తిరుపతి నగరంలో 7వ డివిజన్‌ ఎన్నికను నిలిపేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) ఈ నెల 4న జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆ డివిజన్‌లో నామినేషన్‌ దాఖలు చేసిన సీహెచ్‌.సుజాత హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా ప్రకటించి వాటిని రద్దుచేయాలని కోరుతూ ఆమె శుక్రవారం అత్యవసరంగా లంచ్‌మోషన్‌ రూపంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు విచారణ జరిపారు.

ఈ సందర్భంగా సుజాత తరఫు న్యాయవాది వీఆర్‌ఎన్‌ ప్రశాంత్‌ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికను నిలిపేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదన్నారు. ఎం.విజయలక్ష్మి తన నామినేషన్‌ను ఉపసంహరించుకుని, ఇప్పుడు తన సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేసి తన నామినేషన్‌ను ఉపసంహరించారని చెబుతున్నారని తెలిపారు. నామినేషన్‌ ఉపసంహరణ విషయంలో రిటర్నింగ్‌ అధికారిపై ఆమె ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. దీనిపై విచారణ జరిపిన జిల్లా ఎన్నికల అధికారి రిటర్నింగ్‌ అధికారికి క్లీన్‌చిట్‌ ఇచ్చారని వివరించారు. ఎన్నికల్లో అక్రమాలు, తప్పుడు పద్ధతులపై అభ్యంతరాలుంటే వారు ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడమే మార్గమని చట్టం చెబుతోందన్నారు.

ఎన్నికల కమిషన్‌ తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. అభ్యర్థి ఆమోదం లేకుండా ఆమె ఏజెంట్‌ ఆమె నామినేషన్‌ను ఉపసంహరించారని, ఇలాంటి సందర్భాల్లో జోక్యం చేసుకునే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందని చెప్పారు. ఏ దశలోనైనా జోక్యం చేసుకునే అధికారం కమిషన్‌కు ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటికే విచారణకు ఆదేశించామని, సోమవారం నాటికి ఆ విచారణ వివరాలు తెలుస్తాయని చెప్పారు. విచారణలో అంతా సవ్యంగా జరిగినట్లు తేలితే ఎన్నికను కొనసాగిస్తామన్నారు. అందువల్ల విచారణను సోమవారానికి వాయిదా వేయాలని అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు విచారణను సోమవారానికి వాయిదా వేశారు.   

మరిన్ని వార్తలు