37 ‘మునిసిపల్‌’ ఎన్నికలకు సన్నాహాలు

22 Mar, 2021 04:40 IST|Sakshi

వచ్చేనెల 15 నాటికి సిద్ధంగా ఉండాలని మునిసిపల్‌ కమిషనర్‌లకు ఆదేశాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించని మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణ దిశగా పురపాలకశాఖ కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రంలో మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు కలిపి మొత్తం 125 ఉండగా ఇటీవల 87 చోట్ల ఎన్నికలు జరిగాయి. కాకినాడ కార్పొరేషన్‌కు 2017లోనే ఎన్నికలు జరిగాయి. దీంతో శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, నెల్లూరు కార్పొరేషన్లతోసహా 37 కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పెండింగ్‌ పనుల్ని వచ్చేనెల 15 నాటికి పూర్తిచేయాలని మున్సిపల్‌ కమిషనర్లను పురపాలకశాఖ ఆదేశించింది.

ఓటర్ల జాబితాలను రూపొందించాలని, అవసరమైనచోట వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తిచేయాలని సూచించింది. అవసరమైనచోట వార్డుల సంఖ్యను పెంచుతూ ప్రతిపాదనలను రూపొందించి, వాటిపై  ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించమని ఆదేశించింది. సమీప గ్రామాలను విలీనం చేయడంపై ఉన్న వ్యాజ్యాలను త్వరగా పరిష్కరించాలని పురపాలకశాఖ యోచిస్తోంది. ఆ 37 కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా.. అందుకు సన్నద్ధమై ఉండాలని భావిస్తోంది.  

మరిన్ని వార్తలు