తిరుమల–తిరుపతి మధ్య విద్యుత్‌ బస్సులు

20 Jun, 2021 03:28 IST|Sakshi

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు పెద్ద ఎత్తున హిందూ ధర్మప్రచారం

శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్య పెంపు

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడి

సాక్షి, తిరుమల: తిరుమలను గ్రీన్‌హిల్స్‌గా ప్రకటించి నందున ప్రస్తుతం తిరుమల–తిరుపతి మధ్య నడుస్తున్న ఉచిత బస్సుల స్థానంలో విద్యుత్‌ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తిరుమల తిరుపతి ధర్మకర్తల మండలి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా ఆర్టీసీ కూడా 100 బస్సుల కొనుగోలుకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అనుమతించారన్నారు. అలాగే, తిరుమల–తిరు పతి మధ్య నడిచే ప్రైవేట్‌ ట్యాక్సీల యజమానులు టీటీడీని సంప్రదిస్తే బ్యాంకు ద్వారా వారికి రుణాలు ఇప్పించి విద్యుత్‌ వాహనాల కొనుగోలుకు సహకరిస్తామని చెప్పారు.

టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం శనివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతోపాటు తమ రెండేళ్ల కాలంలో అమలుచేసిన కార్యక్రమాలను పలువురు బోర్డు సభ్యులు, ఈఓ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డితో కలిసి వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు రెండేళ్లుగా అనేక కార్యక్రమాలు నిర్వహించామని.. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు పెద్ద ఎత్తున హిందూ ధర్మప్రచార కార్యక్రమాలూ నిర్వహించామన్నారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే. 


టీటీడీ వద్ద నిల్వ ఉన్న రద్దయిన నోట్ల మార్పిడికి అనుమతించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను విజ్ఞప్తి చేశాను. రిజర్వు బ్యాంకునూ సంప్రదించాం. కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.  
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో శ్రీవాణి ట్రస్టు నిధులతో నిర్మించ దలచిన 500 ఆలయాలను కరోనా కారణంగా నిర్మించలేకపోయాం. రాబోయే ఏడాదిలో వీటి నిర్మాణం పూర్తిచేయాలని తీర్మానించాం. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా జమ్మూలో శ్రీవారి ఆలయాన్ని 18 నెలల్లో పూర్తిచేస్తాం. వారణాశి, ముంబైలో ఏడాదిలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి చర్యలు.
తిరుమలలోని వరాహస్వామివారి ఆలయం వా కిలి, వాకిలి చట్రం, గర్భగృహæ ప్రవేశద్వారాల కు వెండితొడుగులు అమర్చేందుకు నిర్ణయం.
గోవిందుడికి గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన బియ్యంతోనే నైవేద్యాన్ని 45 రోజు లుగా సమర్పిస్తున్నామని.. దీనిని శాశ్వతంగా అమలుచేయాలని నిర్ణయించాం.
టీటీడీలో తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడానికి కమిటీని నియమించాం. మూడు నెలల్లో కమిటీ నివేదిక అందజేస్తుంది. సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీల్లో భాగంగా దీన్ని అమలుచేస్తాం. త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా స్విమ్స్, బర్డ్‌ ఆస్పత్రుల అభివృద్ధి పనులతో పాటు చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన జరిపిస్తాం. తిరుమలలో కొత్తగా నిర్మించిన బూందీ పోటు ప్రారంభిస్తాం.
కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్య పెంచాలని నిర్ణయించాం.

ధర్మకర్తల మండలి సమావేశంలో మాట్లాడుతున్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు