ప్రభుత్వ ఉద్యోగులకు రుణంపై ఎలక్ట్రిక్‌ స్కూటర్లు

19 Apr, 2021 03:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

డౌన్‌ పేమెంట్‌ కట్టనవసరం లేకుండా పూర్తి రుణం 

నెలకు రూ.2,000 నుంచి రూ.2,500 ఈఎంఐ 

ఈ పథకం పూర్తిగా ఐచ్ఛికం 

73 ప్రాంతాల్లో 400 చార్జింగ్‌ స్టేషన్లు 

ముఖ్యమంత్రి వద్దకు చేరిన ప్రతిపాదన

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు రుణాలపై ఎలక్ట్రిక్‌ స్కూటర్లను అదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్‌టీపీసీ/ఈఈఎస్‌ఎల్‌ వంటి సంస్థలతో కలిసి నెడ్‌క్యాప్‌ ఒక పథకాన్ని రూపొందించినట్లు ఇంధన శాఖ తెలిపింది. రుణాన్ని 24 నెలల నుంచి 60 నెలల్లో తీర్చే విధంగా వివిధ సంస్థలతో చర్చిస్తున్నామని, వాహన ధర బ్యాటరీ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది.

నెలవారీ చెల్లించే రుణం కిస్తీ (ఈఎంఐ) రూ.2,000 నుంచి రూ.2,500 ఉండేలా చూస్తున్నామంది. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 40 కి.మీ. నుంచి 100 కి.మీ. వరకు తిరేగా వివిధ బ్రాండ్‌ల వాహనాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. తొలి దశలో లక్ష వాహనాలను సరఫరా చేయడానికి ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను కోరామని, ఇప్పటికే 10కి పైగా సంస్థలు ముందుకొచ్చినట్లు నెడ్‌క్యాప్‌ అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం ఐచ్చికమన్నారు. ఈ మేరకు ఇంధన శాఖ నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు ప్రతిపాదన చేరింది. ఆయన కూడా దీనిపై సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. 

ఈవీ పార్కులు 
ఎలక్ట్రిక్‌ వాహనాలు, వాటి అనుబంధ ఉత్పత్తుల తయారీ కోసం ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో పనిచేసుకునే విధంగా సుమారు 1,000 ఎకరాల్లో ఈవీ పార్కును అభివృద్ధి చేస్తున్నట్లు ఇంధన శాఖ తెలిపింది. అలాగే రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేసే వారికి మూలధన పెట్టుబడిలో 50 శాతం సబ్సిడీతో పాటు ఇతర ఆర్థికప్రోత్సాహకాలను అందించనున్నారు. రాష్ట్రంలో ఈవీ వాహనాలకు చార్జింగ్‌ కోసం వినియోగించే విద్యుత్‌ యూనిట్‌ ధరను రూ.6.70గా నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రంలో 80 చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయగా, కొత్తగా మరో 73 ప్రాంతాల్లో 400 చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ విభాగాల్లో ఈ కార్ల వినియోగం పెంచడంపై దృష్టిసారించామని, వివిధ విభాగాలకు 300 కార్లను అందచేసినట్లు ఇంధన శాఖ వెల్లడించింది.  

మరిన్ని వార్తలు