కొప్పర్తిలో విద్యుత్‌ ఉపకరణాల తయారీ జోన్‌.. 30,000 మందికి ఉపాధి 

21 Oct, 2022 03:31 IST|Sakshi

225 ఎకరాల్లో రూ.445 కోట్లతో ఏర్పాటు 

పీఎల్‌ఐ స్కీం కింద ఈ రంగానికి కేంద్రం రూ.24,000 కోట్లు కేటాయింపు 

ఈ జోన్‌ ద్వారా రూ.3,500 కోట్ల పెట్టుబడి అంచనా 

5,000 మందికి ప్రత్యక్షంగా 25,000 మందికి పరోక్షంగా ఉపాధి 

కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు  

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తి వద్ద 225 ఎకరాల్లో విద్యుత్‌ ఉపకరణాల తయారీ జోన్‌ ఏర్పాటుకు ఏపీఐఐసీ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ ఉపకరణాల తయారీ జోన్‌ ఏర్పాటుకోసం ఆసక్తిగల రాష్ట్రాల నుంచి బిడ్లను ఆహ్వానించింది. సుమారు రూ.445 కోట్ల పెట్టుబడితో 225 ఎకరాల్లో ఈ జోన్‌ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ నారాయణ భరత్‌గుప్తా ‘సాక్షి’కి వెల్లడించారు.

నిజానికి.. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మన్నవరం వద్ద ఎన్టీపీసీ, బీహెచ్‌ఈఎల్‌ భాగస్వామ్యంతో విద్యుత్‌ ఉపకరణాల తయారీ యూనిట్‌కు 753.85 ఎకరాల భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తర్వాత ఈ ప్రాజెక్టును ఎవ్వరూ పట్టించుకోకపోవడం, మారిన రాజకీయ పరిస్థితులతో ఈ ప్రాజెక్టు ఆర్థికంగా ప్రయోజనం కాదంటూ రెండు సంస్థలు ఒప్పందం నుంచి వైదొలగడానికి సిద్ధపడ్డాయి. ఈ నేపథ్యంలో.. ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గ్రీన్‌ఎనర్జీకి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుండటమే కాకుండా రూ.1.26 లక్షల కోట్లతో భారీ ఇంధన ప్రాజెక్టులను చేపట్టారు.

ఈ అవకాశాలను వినియోగించుకుంటూ సౌర, పవన విద్యుత్‌ రంగాలకు చెందిన విద్యుత్‌ ఉపకరణాల తయారీ యూనిట్‌ను కొప్పర్తిలో ఏర్పాటుచేయడానికి ప్రతిపాదనలను పంపింది. మొత్తం రూ.445 కోట్ల అంచనా వ్యయంలో కేంద్ర ప్రభుత్వం రూ.400 కోట్లు భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.45 కోట్లు వ్యయం చేస్తుంది. ఇతర రాష్ట్రాలతో పోటీపడుతూ ఈ జోన్‌ను సాధించుకునేందుకు నీరు, విద్యుత్‌ను చౌకగా అందించడమే కాకుండా అనేక రాయితీలను ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. 

30,000 మందికి ఉపాధి 
ఇక ఈ తయారీ జోన్‌ రాష్ట్రానికొస్తే పెట్టుబడులు, ఉపాధితోపాటు కీలకమైన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు కొప్పర్తిలో ఏర్పాటయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. విద్యుత్‌ ఉపకరణాల తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం కింద సుమారు రూ.24,000 కోట్ల బడ్జెట్‌ను ఈ రంగానికి కేటాయించింది. కొప్పర్తిలో ఈ తయారీ రంగ జోన్‌ ద్వారా సుమారు రూ.3,500 కోట్ల పెట్టబడులు రావడంతోపాటు ప్రత్యక్షంగా 5,000 మందికి పరోక్షంగా 25,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు.

అలాగే, కేంద్ర ప్రభుత్వ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోలార్‌ ఎనర్జీ, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ విండ్‌ ఎనర్జీ, సెంటర్‌ పవర్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌లు ఇక్కడ ఏర్పాటయ్యే అవకాశముంది. ఇక్కడే 1,186 ఎకరాల్లో టెక్స్‌టైల్‌ పార్కు ప్రతిపాదనలను కూడా కేంద్రానికి పంపిన సంగతి తెలిసిందే. అలాగే, కాకినాడ వద్ద ఇప్పటికే బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ సాధించుకున్న రాష్ట్రం ఈ రెండు పార్కులను ఇతర రాష్ట్రాలతో పోటీపడి చేజిక్కించుకుంటుందన్న ఆశాభావాన్ని అధికారులు 
వ్యక్తంచేస్తున్నారు.    

మరిన్ని వార్తలు