తీగ తెగితే.. కరెంటు ఆగాలి

24 Aug, 2022 03:55 IST|Sakshi
సమావేశంలో పాల్గొన్న అధికారులు

విద్యుత్‌ నియమావళిపై ఎలక్ట్రికల్‌ సేఫ్టీ స్టాండింగ్‌ కమిటీ  సూచనలు   

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా విద్యుత్‌ ప్రమాదాల్లో ఎక్కువ శాతం విద్యుత్‌ వైర్లను తాకడం వల్లనే జరుగుతున్నాయని, వీటి నుంచి ప్రజలను రక్షించేందుకు విదేశాల్లో అమల్లో ఉన్న కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయాలని ఎలక్ట్రికల్‌ సేఫ్టీ స్టాండింగ్‌ కమిటీ సూచించింది. వైరు తెగిపోగానే విద్యుత్‌ సరఫరా నిలిచిపోయేలా చేసే ఫీడర్‌ ప్రొటెక్షన్‌ రిలే విధానంపై అధ్యయనం చేయాలని చెప్పింది. విద్యుత్‌ భద్రతపై జాతీయస్థాయిలో మూడేళ్ల తరువాత 6వ స్టాండింగ్‌ కమిటీ సమావేశం మంగళవారం విజయవాడలో జరిగింది.

విద్యుత్‌ భద్రత, సరఫరాకు ఈ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నిబంధనలు–2010లో సవరణలు చేయాలని కమిటీ సూచించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి చర్యలు చేపట్టాలని పేర్కొంది. కమిటీ చైర్మన్‌ గౌతమ్‌ రాయ్‌ మాట్లాడుతూ విద్యుత్‌ ప్రమాదాల నివారణకు రాష్ట్రాలు సూచన లివ్వాలని కోరారు. వాటిని పరిగణనలోకి తీసుకుని నిబంధనల్ని సవరిం చేందుకు సీఈఏకి నివేదిక పంపుతామని తెలిపారు. కమిటీ మెంబర్‌ సెక్రటరీ రమేష్‌కుమార్‌ మాట్లాడుతూ 2017లో ఈ కమిటీ ఏర్పడి కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం చేస్తోందని చెప్పారు.

ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ జె.పద్మాజనార్ధనరెడ్డి మాట్లాడుతూ విద్యుత్‌ భద్రతపై అవగాహన నిరంతరం జరగాల్సిన ప్రక్రియ అని చెప్పారు. చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్, ఎలక్ట్రికల్‌ సేఫ్టీ డైరెక్టర్‌ విజయలక్ష్మి మాట్లాడుతూ కండక్టర్ల స్నాపింగ్, లైవ్‌వైర్లతో జరిగే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నందున వాటిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంద న్నారు. సీఈఏ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ముకుల్‌కుమార్‌ నేతృత్వంలో రాష్ట్ర ఎలక్ట్రికల్‌ సేఫ్టీ విభాగం ఆ«ధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ముంబై (వెస్ట్‌), చెన్నై (సౌత్‌), ఢిల్లీ (నార్త్‌), కోల్‌కతా (ఈస్త్‌), మేఘాలయ (నార్త్‌ఈస్ట్‌) ప్రాంతీయ ఇన్‌స్పెక్టరేట్‌ల డైరెక్టర్లు, వివిధ రాష్ట్రాల ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టరేట్‌ల సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు