ఇళ్ల నిర్మాణానికి ఇబ్బందుల్లేకుండా..

18 Aug, 2021 04:09 IST|Sakshi
గుంటూరు జిల్లా తెనాలి రూరల్‌ మండలంలో వైఎస్సార్, జగనన్న కాలనీలో నిర్మిస్తున్న ఇంటికి నీళ్లు పడుతున్న మహిళ, గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం బీమినేనివారిపాలెంలో వైఎస్సార్, జగనన్న లేఅవుట్‌ లో వేసిన బోరు

వైఎస్సార్, జగనన్న కాలనీల్లో విద్యుత్, నీటి సదుపాయాలు

ఇందుకు రూ.920 కోట్లు ఖర్చుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

లేఅవుట్‌లలో బోర్లువేసి, మోటార్లు బిగించి కుళాయి పాయింట్ల ఏర్పాటు

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. ఇళ్లు నిర్మించే సమయంలో నీటి అవసరాలు తీర్చేందుకు వీలుగా బోర్లు వేస్తోంది. అంతటితో సరిపెట్టకుండా వాటికి మోటార్లు సైతం బిగించడం.. అందుకు విద్యుత్‌ సరఫరా సమకూర్చడం.. ప్లాట్ల వద్ద కుళాయిల ఏర్పాటుకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ పనులు తుదిదశకు చేరుకున్నాయి.

76 శాతం లేఅవుట్‌లలో బోర్లు
తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 9,112 లేఅవుట్‌లలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. వీటిలో 8,830 లేఅవుట్‌లలో నీటి సౌకర్యాన్ని కల్పించాలని అధికారులు గుర్తించారు. ఇందుకోసం ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్‌లో రూ.920 కోట్లు కేటాయించింది. గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్‌) శాఖ రూ.641 కోట్లు, మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ శాఖ రూ.279 కోట్లను కేటాయించి పనులను అప్పజెప్పింది. మొత్తం 8,830 లేఅవుట్‌లకు గాను ఇప్పటివరకు 8,096 లేఅవుట్‌లలో నీటి సరఫరా పనులు ప్రారంభించారు. వీటిలో 6,687 (76 శాతం) లేఅవుట్‌లలో ఇప్పటికే పనులు పూర్తయ్యాయి.

స్థానిక పరిస్థితులకు అనుగుణంగా..
స్థానిక పరిస్థితులు, అందుబాటులో ఉన్న నీటి వనరుల ఆధారంగా బోర్లు వేయడం, పక్కనున్న చెరువులు, కాలువల నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. 10–20 ఇళ్లకు చేతి బోరింగ్‌లు, 50–60 ఇళ్లకు రోటరీ బోర్లు, 100–200 ఇళ్లకు డీటీహెచ్‌ బోర్లు వేస్తున్నారు. ప్లాట్లు ఎక్కువగా ఉండి నీటి వినియోగం ఎక్కువ ఉన్నచోట విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు ఇబ్బందుల్లేకుండా నీటి నిల్వ కోసం స్టోరేజ్‌ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా బోర్ల నుంచి లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు నీటిని వినియోగించుకునేందుకు అనుగుణంగా కుళాయి పాయింట్లు అందుబాటులో ఉంచుతున్నారు. 

ఇబ్బందులకు తావివ్వం
వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పేదలకు ఎలాంటి ఇబ్బందులకు తావివ్వం. లబ్ధిదారులకు అన్ని వసతులను ప్రభుత్వం సమకూరుస్తుంది. నీటి సౌకర్యం లేకపోతే నిర్మాణాలకు ఇబ్బందులు తలెత్తుతాయని సీఎం వైఎస్‌ జగన్‌ ముందే భావించారు. లబ్ధిదారులు ఆ ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వమే బోర్లువేసి, మోటార్లు బిగించి, విద్యుత్‌ సరఫరా అందిస్తోంది. 
– చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, గృహనిర్మాణ శాఖ మంత్రి

ఎప్పటికప్పుడు ఇబ్బందుల్ని పరిష్కరిస్తున్నాం
లేఅవుట్‌లలో నీటి సరఫరా పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ 76 శాతం లేఅవుట్‌లలో పనులు పూర్తయ్యాయి. మిగిలిన లేఅవుట్‌లలో ఈ నెలాఖరులోపు నీటి సరఫరా, విద్యుత్‌ కనెక్షన్‌ పనులు పూర్తిచేస్తాం. ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తున్నాం. 
– నారాయణ భరత్‌గుప్తా, ఎండీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ 

మరిన్ని వార్తలు