వచ్చే ఏడాది విద్యుత్‌ చార్జీలు పెరగవు

16 Dec, 2022 04:02 IST|Sakshi

2023–24 ఆర్థిక సంవత్సరానికి ఏ వినియోగదారులపైనా భారం ఉండదు

ఈ మేరకు ఏపీఈఆర్సీకి డిస్కంల వార్షిక ఆదాయ, వ్యయ నివేదికలు

వాస్తవాలను దాచి ప్రజల్ని ఏమార్చేందుకు పచ్చపత్రికల తప్పుడు రాతలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు 2023–24 ఆర్థిక సంవత్సరానికి చేసిన వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్‌ సరఫరా ధరల ప్రతి­పాదనల్లో గృహ విద్యుత్‌ వినియోగదారులకు, వాణిజ్య అవసరాలకు, సాధారణ పరిశ్రమల రంగానికి, స్థానిక సంస్థలకు, ప్రభుత్వ, ప్రైవేటు నీటిపారుదల ఎత్తిపోతల పథకాలకు విద్యుత్‌ చార్జీల పెంపుదల లేదని రాష్ట్ర ఇంధన శాఖ స్పష్టంచేసింది.

‘సాక్షి’ ప్రతినిధికి గురువారం ఇంధన శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి డిస్కంలు చేసిన టారిఫ్‌ ప్రతిపాదనల సమగ్ర వివరాలను ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి గతనెల 30న సమర్పించాయి. వాటి ప్రతులు ఏపీఈఆర్‌సీ, పంపిణీ సంస్థల వెబ్‌సైట్లలో ఉన్నాయి. నివేదిక ప్రతులు డిస్కంల ప్రధాన కార్యాలయంలోను, సర్కిల్‌ కార్యాలయాల్లోనూ అందుబాటులో ఉంచారు. 

ప్రభుత్వ సబ్సిడీలు, రాయితీల్లో ఆదాయం
వచ్చే ఆర్థిక సంవత్సరానికి సరఫరా సేవా ఖర్చు నిర్దేశిత యూనిట్‌ ఖర్చు రూ.6.98 కన్నా రూ.0.70æ పెరుగుతుందని అంచనా వేసినప్పటికీ ఆ భారాన్ని ఏ వర్గంపైనా వేయడంలేదు. జనం నెత్తిన రూ.13,487.54 కోట్లు భారం పడుతోందని పచ్చ పత్రికలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. అది పంపిణీ సంస్థల వార్షిక ఆదాయ ఆవశ్యకతకు, ప్రస్తుతం టారిఫ్, ఇతర వనరుల ద్వారా వచ్చే ఆదాయానికి మధ్య వుండే వ్యత్యాసం మాత్రమే.

ఇదంతా ధరలను పెంచడం ద్వారా వినియోగదారులపై మోపడం జరగదు. డిస్కంల ప్రతిపాదనలపై ఏపీఈఆర్‌సీ బహిరంగ విచారణ నిర్వహించి, ప్రజాభిప్రాయం తీసుకుని, దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాల్లో భాగంగా ఇచ్చే విద్యుత్‌ సబ్సిడీ, ఇతర రాయతీల ద్వారా ఈ ఆదాయ అంతరాన్ని విద్యుత్‌ సంస్థలు పూడ్చుకుంటాయి.

చార్జీల వసూలు ద్వారా నష్టాల భర్తీ జరగదు
రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాలకు అంటే.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకం, ఆక్వా రంగం.. తదితరులకు అందించే విద్యుత్‌ రాయితీల మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.11,123 కోట్లుగా నిర్ధారించారు.

అయితే, ఏపీఈఆర్‌సీకి సమర్పించిన ప్రతిపాదనల్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేటగిరి వారీగా, శ్లాబుల వారీగా ప్రస్తుతం అమలులో వున్న ధరలనే ప్రతిపాదిస్తూ  (ఇప్పటికే రాయితీ పొందుతున్న ఎనర్జి ఇంటెన్సివ్‌ పరిశ్రమలకు మినహా) నివేదిక ఇచ్చారు.

అంతేగానీ, నష్టాలను చార్జీల వసూలుతో భర్తీ చేసుకుంటామని ఎక్కడా ప్రతిపాదించలేదు. వినియోగదారులపై విద్యుత్‌ చార్జీల పెంపుదల ప్రతిపాదన చాలా గోప్యంగా ఉంచారన్నది కూడా పూర్తిగా అవాస్తవం.

డిస్కంల వారీగా సేవా ఖర్చు
ఇక డిస్కంల కొనుగోలు వ్యయంపై వేర్వేరు గణాంకాలు సమర్పించాయనడం సరైంది కాదు. పంపిణీ సంస్థ సేవా ఖర్చు (కాస్ట్‌ అఫ్‌ సర్వీస్‌)లో వివిధ భాగాలు అంటే.. విద్యుత్‌ కొనుగోలు వ్యయం, ప్రసార, పంపిణీ నష్టాలు, నెట్‌వర్క్‌ నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల జీతభత్యాలు, మరమ్మతు ఖర్చులు మొదలైనవి ఒక్కో డిస్కంలో ఒక్కో విధంగా ఉంటాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూడు డిస్కంలకు విద్యుత్‌ కొనుగోలు వ్యయం, మొత్తం సేవా ఖర్చు–కాస్ట్‌ అఫ్‌ సర్వీస్‌ ప్రతీ యూనిట్‌కు ఇలా వున్నాయి.. (రూ.లలో)

మరిన్ని వార్తలు