ఇష్టానుసారంగా అమ్మితే కుదరదు! 

8 May, 2022 03:42 IST|Sakshi

రాష్ట్రాల అవసరాలను క్యాష్‌ చేసుకుంటున్న విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు

బహిరంగ మార్కెట్‌లో యూనిట్‌ రూ.16 నుంచి రూ.20కు విక్రయం

కొందామన్నా పలు రాష్ట్రాలకు దొరకని విద్యుత్‌  

సుమోటోగా స్వీకరించిన సీఈఆర్సీ.. యూనిట్‌ రూ.12కే ఇవ్వాలని ఆదేశం

జూన్‌ 30 వరకు ఇదే నిబంధన అమలు  

సాక్షి, అమరావతి: బొగ్గు, విద్యుత్‌ కొరతను విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు క్యాష్‌ చేసుకుంటున్నాయి. బహిరంగ మార్కెట్‌లో భారీ ధరలకు విద్యుత్‌ను అమ్మేస్తున్నాయి. దీనిపై సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ (సీఈఆర్సీ) స్పందించింది. ఇకపై ఇష్టమొచ్చిన ధరలకు అమ్మడం కుదరదని స్పష్టం చేసింది. యూనిట్‌ రూ.12 లేదా అంతకంటే తక్కువకు మాత్రమే విక్రయించాలని ఆదేశించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రాలకు సరిపడా విద్యుత్‌ సమకూరే అవకాశం ఏర్పడింది. 

కొందామన్నా దొరకట్లేదు.. 
గతేడాది అక్టోబర్‌లో బొగ్గు సంక్షోభం తలెత్తడంతో దేశవ్యాప్తంగా విద్యుత్‌ కొరత ఏర్పడింది. ఈ ఏడాది మార్చి నుంచి తీవ్రమైంది. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్న విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు ధరలను విపరీతంగా పెంచేశాయి. దీన్ని అప్పట్లోనే గమనించిన కేంద్ర విద్యుత్‌ శాఖ యూనిట్‌ రూ.12 కంటే ఎక్కువ ధరకు విక్రయించొద్దని చెప్పింది.

ఏప్రిల్‌ 2నుంచి ధరల సీలింగ్‌ను అమల్లోకి  తీసుకొచ్చింది. కానీ ఉత్పత్తి సంస్థలు తెలివిగా వ్యవహరించడం మొదలుపెట్టాయి. మార్కెట్లను విడదీసి.. డిమాండ్‌ ఆధారంగా ధరలను అమలు చేయడం ప్రారంభించాయి. యూనిట్‌ను రూ.16 నుంచి రూ.20 వరకు కొనాల్సిన పరిస్థితిని కల్పించాయి. ఏపీ, తెలంగాణ తదితర రాష్ట్రాలకైతే బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ దొరకడమే కష్టంగా మారింది. ఏపీలో రోజుకు 200 మిలియన్‌ యూనిట్ల నుంచి 230 మిలియన్‌ యూనిట్ల వరకు డిమాండ్‌ ఉండటంతో.. రోజుకు దాదాపు రూ.40 కోట్లు వెచ్చించి మరీ విద్యుత్‌ కొంటున్నారు. 

అన్నీ పరిగణనలోకి తీసుకుని ఆదేశాలు 
ఈ నేపథ్యంలో పవర్‌ ఎక్సే్చంజీల్లోని అన్ని సెగ్మెంట్లలో ఒకే విధమైన ధరల పరిమితి అవసరమని సీఈఆర్సీ గుర్తించింది. విద్యుత్‌ కంపెనీలు అధిక చార్జీలు వసూలు చేస్తున్నాయని తేల్చింది. అత్యవసరం ఏర్పడినప్పుడు మాత్రమే విద్యుత్‌ కొనుగోలుకు కొన్ని రాష్ట్రాలు ప్రయత్నిస్తుండటం వల్ల.. ఆ సమయంలో ధరలు భారీగా పెరుగుతున్నాయని కూడా గ్రహించింది. రాష్ట్రాల నుంచి వచ్చిన ఫిర్యాదులు, మార్కెట్‌లో జరుగుతున్న పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న సీఈఆర్సీ సుమోటోగా తాజా ఆదేశాలిచ్చింది. జూన్‌ 30 వరకు ఇవే ఆదేశాలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.   

మరిన్ని వార్తలు