Electricity Policy: ఏపీ బాటలో యూపీ

8 Jun, 2021 05:01 IST|Sakshi

విద్యుత్‌ కొనుగోళ్లపై కొరడా.. ఎక్కువ ధర సోలార్‌ టెండర్లు రద్దు

కారణం కూడా చెప్పని ఉత్తరప్రదేశ్‌

గత ఏడాదే ఏపీని అనుసరించిన గుజరాత్‌

ఏడాది కిందటే ఏపీలో విద్యుత్‌ పీపీఏల పునఃసమీక్ష  

గత సర్కార్‌ అడ్డగోలు వ్యవహారంపై ఆరా

అప్పట్లో విపక్షాల గగ్గోలు.. ఎల్లో మీడియా రచ్చ

ఇప్పుడు అన్ని రాష్ట్రాలది.. వైఎస్‌ జగన్‌ చౌకవిద్యుత్‌ మంత్రమే

సాక్షి, అమరావతి: విద్యుత్‌ కొనుగోళ్ల విషయంలో మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన విధానాలను పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ప్రజలకు చౌకగా విద్యుత్‌ అందించాలంటే అడ్డగోలు ప్రైవేటు విద్యుత్‌ కొనుగోళ్లను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం చేసిన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను పునఃసమీక్షించింది. ప్రజాసంక్షేమం కోసం చేపట్టిన ఈ చర్యను విపక్షాలు రాజకీయం చేశాయి. ఎల్లో మీడియా ఇష్టానుసారం వక్రీకరించింది. అయితే.. ఇప్పుడు అనేక రాష్ట్రాలు వైఎస్‌ జగన్‌ సర్కార్‌ విధానమే భేష్‌ అంటున్నాయి. గతేడాది గుజరాత్, తాజాగా ఉత్తరప్రదేశ్‌ (యూపీ) ప్రభుత్వాలు ఇదే బాట పట్టాయి. డిస్కమ్‌లను ఆర్థికంగా దెబ్బతీసే ఖరీదైన విద్యుత్‌ ఒప్పందాలకు ఆ రాష్ట్రాలు ససేమిరా అంటున్నాయి.  

విపక్షం, ఎల్లో మీడియాల దుష్ప్రచారం
ఉత్తరప్రదేశ్, గుజరాత్‌ ప్రభుత్వాలు విద్యుత్‌ కొనుగోళ్లలో మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటే.. ఇక్కడ మాత్రం విపక్షం, ఎల్లో మీడియాలు పీపీఏల పునఃసమీక్షపై వివాదం సృష్టించాయి. దీనివల్ల పెట్టుబడిదారుల్లో అభద్రతాభావం నెలకొంటుందని దుష్ప్రచారం చేశాయి. చివరకు సోలార్, విండ్‌ ఉత్పత్తిదారులు కోర్టు వరకు వెళ్లారు. దీంతో ప్రస్తుతం యూనిట్‌ పవన విద్యుత్‌కు రూ.2.43, సోలార్‌కు రూ.2.44 చొప్పున డిస్కమ్‌లు తాత్కాలికంగా చెల్లిస్తున్నాయి. దీని వెనుక కారణాలను విశ్లేషిస్తే..  
► గత ప్రభుత్వం 2015 నుంచి 2019 వరకు అడ్డగోలుగా పవన, సౌరవిద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. 13,794 మిలియన్‌ యూనిట్ల (ఎంయూల) విద్యుత్‌ను అవసరం లేకుండా కొనేలా చేసింది. దీంతో డిస్కమ్‌లు రూ.5,497.3 కోట్ల అదనపు భారం మోయాల్సి వచ్చింది. ఈ పీపీఏల కారణంగా ఇప్పటికీ ఏటా రూ.2 వేల కోట్లను అదనంగా విద్యుత్‌ కొనుగోలుకు ఖర్చుచేయాల్సి వస్తోంది.  
► 2016–17లో పవన, సౌరవిద్యుత్‌ను 2,433 మిలియన్‌ యూనిట్లు (5 శాతం) కొనాల్సిన అవసరం ఉంటే.. 4,173 ఎంయూలు (8.6 శాతం), 2017–18లో 4,612 ఎంయూలు  (9 శాతం) అవసరమైతే.. 9,714 ఎంయూలు (19 శాతం), 2018–19లో 6,190 ఎంయూలు (11 శాతం) కొనాల్సి ఉంటే, 13,142 ఎంయూలు (23.4 శాతం) కొనుగోలు చేశారు.  
► సోలార్‌ విద్యుత్‌ యూనిట్‌ రూ.3లోపే లభిస్తుంటే.. పాత పీపీఏల వల్ల యూనిట్‌కు గరిష్టంగా రూ.5.96 వరకు, పవన విద్యుత్‌కు రూ.4.84 చొప్పున చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఖరీదైన పవర్‌కు యూపీ కత్తెర
ఉత్తరప్రదేశ్‌ నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల విభాగం (యూపీఎన్‌ఈడీఏ) తుదిదశకు చేరిన సోలార్‌ విద్యుత్‌ టెండర్లను ఈ నెల 2వ తేదీన రద్దుచేసింది. దీనికి కారణాలను కూడా బిడ్డింగ్‌ సంస్థలకు చెప్పలేదు. ఈ సంస్థ గతేడాది ఫిబ్రవరిలో 500 మెగావాట్ల సౌరవిద్యుత్‌ ప్రాజెక్టులకు టెండర్లు పిలిచింది. మొత్తం 4 సంస్థలు యూనిట్‌ రూ.2.69 ధరకు విద్యుత్‌ అందించేందుకు రావడంతో ఎల్‌–1గా ప్రకటించారు. ఇదే సమయంలో సోలార్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) గుజరాత్‌లో గరిష్టంగా యూనిట్‌ రూ.1.99, రాజస్థాన్‌లో యూనిట్‌ రూ. 2కు ఇవ్వడానికి ఒప్పందాలు చేసుకుంది. ఇతర రాష్ట్రాల్లో తక్కువగా విద్యుత్‌ వస్తున్న కారణంగా ఉత్తరప్రదేశ్‌ తాజా చర్యలు చేపట్టింది. ఏపీని ఆదర్శంగా తీసుకున్న గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం.. ఎక్కువ ధర చెల్లించే పాత విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను గత ఏడాదే రద్దు చేసింది. ఈ పీపీఏల్లో పెద్ద ప్రైవేటు కంపెనీలు కూడా ఉన్నాయి.

మరిన్ని వార్తలు