ఏసీల తయారీ హబ్‌గా ఏపీ

30 Sep, 2021 03:16 IST|Sakshi
బ్లూస్టార్‌ ఏసీ పరిశ్రమ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఆ పరిశ్రమ ఎండీ త్యాగరాజన్, ప్రెసిడెంట్‌ ముకుంద మీనన్, శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి, తదితరులు

శ్రీసిటీలో ఏర్పాటవుతున్న డైకిన్, బ్లూస్టార్‌ యూనిట్లు

యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్న మరో రెండు కంపెనీలు

రూ.540 కోట్లతో ఏసీ తయారీ యూనిట్‌కు బ్లూస్టార్‌ భూమిపూజ

1,500 మందికి ఉద్యోగ అవకాశాలు

సాక్షి, అమరావతి/వరదయ్యపాళెం: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్‌ పాలసీ సత్ఫలితాలిస్తోంది. ఈ పాలసీ ఆధారంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక ఎలక్ట్రానిక్‌ తయారీ సంస్థలు ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే జపాన్‌కు చెందిన డైకిన్‌ సంస్థ రాష్ట్రంలోని శ్రీసిటీలో యూనిట్‌ ఏర్పాటు కోసం 75 ఎకరాలు కొనుగోలు చేసింది. తాజాగా బ్లూస్టార్‌ సంస్థ శ్రీసిటీలో ఏసీల తయారీ యూనిట్‌ ఏర్పాటుకు బుధవారం భూమిపూజ చేసింది. ఈ కార్యక్రమంలో బ్లూస్టార్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి.త్యాగరాజన్, బ్లూస్టార్‌ ప్రెసిడెంట్, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ సీపీ ముకుంద మీనన్, వైస్‌ ప్రెసిడెంట్‌ వి.కసటేకర్, శ్రీసిటీ ఫౌండర్, ఎండీ రవీంద్ర సన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్‌ పాలసీతో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయని, త్వరలోనే రాష్ట్రం దేశానికి ఏసీ తయారీ హబ్‌గా ఎదగనుందని చెప్పారు.

స్ఫూర్తిదాయకమైన నాయకత్వం, వ్యాపార అనుకూల వాతావరణం, చక్కని పారిశ్రామిక విధానంతో పెట్టుబడిదారులను ఆకర్షించడంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే డైకిన్, బ్లూస్టార్‌ కంపెనీలు ముందుకురాగా మరో రెండు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని చూపుతున్నట్లు తెలిపారు. ఏసీలు, రిఫ్రిజరేటర్లు వంటి వైట్‌ గూడ్స్‌ రంగం ద్వారా రాష్ట్రంలో వేలాదిమందికి ఉపాధి లభించనుందన్నారు. ప్రముఖ స్వదేశీ బ్లూస్టార్‌ సంస్థకు దేశంలో ఇది 6వ ఉత్పాదక యూనిట్‌కాగా.. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిదని చెప్పారు. శ్రీసిటీ దేశీయ టారిఫ్‌ జోన్‌ (డీటీజడ్‌)లోని 20 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్లాంట్‌ను దశల వారీగా రూ.540 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఐదేళ్లలో మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 1.2 మిలియన్‌ యూనిట్లకు దగ్గరగా ఉంటుందన్నారు. ఈ యూనిట్‌ ద్వారా 1,500 మందికిపైగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. 

వచ్చే ఏడాది అక్టోబర్‌ నాటికి ఉత్పత్తి
బ్లూస్టార్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి.త్యాగరాజన్‌ మాట్లాడుతూ వచ్చే ఏడాది అక్టోబర్‌ నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా ప్రకటించిన ఉత్పత్తి ఆధార ప్రోత్సాహక పథకం కింద రాష్ట్రంలో ఈ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇండస్ట్రీ 4 టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్‌ ద్వారా దక్షిణ భారతదేశ అవసరాలను తీర్చనున్నామన్నారు. శ్రీసిటీని తొలిసారి సందర్శించినప్పుడే ఇక్కడి సౌకర్యాలను చూసి యూనిట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.  

మరిన్ని వార్తలు