చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం 

1 Apr, 2022 05:18 IST|Sakshi
పిచ్చాటూరు మండలం రామాపురంలో వరి పంట పొలాన్ని ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు

దాడిలో వ్యక్తి మృతి

పంట పొలాలు ధ్వంసం

ద్విచక్ర వాహనదారులనూ హడలెత్తించిన వైనం

భయాందోళనలో ప్రజలు

సదుం/పిచ్చాటూరు/సోమల/తిరుమల: చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గురువారం ఏనుగుల దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తహసీల్దారు గుర్రప్ప తెలిపిన వివరాల ప్రకారం.. పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, పెద్దడివి నుంచి జోగివారిపల్లె అటవీ ప్రాంతానికి సమీపంలోని పంట పొలాలపై సుమారు 15 ఏనుగులు దాడి చేశాయి. పదిహేను మంది రైతులకు చెందిన మామిడి తోటల్లో చెట్ల కొమ్మలను విరిచేయడంతో పాటు, నలుగురు రైతుల చెరుకు గానుగలను ధ్వంసం చేశాయి.  గ్రామ సమీపంలోని చెరుకు తోటలో నిద్రిస్తున్న గొల్లపల్లెకు చెందిన ఎల్లప్ప(38)పై ఏనుగులు దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. 108లో పీలేరు  ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తీసుకెళ్లారు.

అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అలాగే సత్యవేడు నియోజకవర్గం, పిచ్చాటూరు పట్టణంలోకి బుధవారం అర్ధరాత్రి మూడు ఏనుగులు ప్రవేశించాయి. స్థానికులు, ఫారెస్టు అధికారులు పట్టణ పొలిమేరల్లోకి తరిమికొట్టారు. గురువారం వేకువజామున మండలంలోని వేలూరు, వెంగళత్తూరు, రామాపురం గ్రామాల్లోని వరి, సంపంగితోటలను ధ్వంసం చేశాయి. పంట పొలాలను ఆనుకుని నివాస ప్రాంతాలు ఉండడంతో ప్రజలు, రైతులు భయాందోళనకు లోనయ్యారు.   సోమల మండలం, అన్నెమ్మగారిపల్లెకు చెందిన శేఖర్, ఆవులపల్లెకు చెందిన ఏసయ్య పెద్దపంజాని మండలంలోని మాధవరం నుంచి గురువారం వేకువ జామున పెద్ద ఉప్పరపల్లెకు ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. మార్గమధ్యంలోని సోమల–పెద్ద పంజాని మండలాల సరిహద్దులోని దాబా సమీపంలో రోడ్డుపై ఏనుగులు కనిపించాయి.

ద్విచక్ర వాహనాన్ని అక్కడే ఆపే ప్రయత్నం చేయగా.. గమనించిన ఏనుగులు వారిపై దాడికి యత్నించాయి. వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ద్విచక్రవాహనాన్ని ఏనుగులు ధ్వంసం చేశాయి. అలాగే  ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై పాపవినాశనం మార్గంలో వెళ్తుండగా ఆకాశగంగ సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి  ఒక్కసారిగా రెండు ఏనుగులు రోడ్డుపైకి వచ్చి ద్విచక్రవాహనంపై ఉన్న వారి వెనుకపడ్డాయి. దీంతో భయాందోళనలకు గురైన యువకులు ద్విచక్రవాహనంపై వేగంగా వెనక్కు మళ్లారు.   

మరిన్ని వార్తలు