గ్రామాల వైపు.. గజరాజుల చూపు!

25 Apr, 2021 04:54 IST|Sakshi

అడవుల్లో మేతలేక గ్రామాల్లోని పంటపొలాలపై దాడి 

వన్యప్రాణుల నుంచి పంట రక్షణకు అమర్చుతోన్న విద్యుత్‌ తీగలకు బలవుతున్న గజరాజులు 

పలమనేరు: కౌండిన్య అభయారణ్యంలో ఆహారం, నీటి లభ్యత తక్కువగా ఉండటంతో చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫేంట్‌ శాంచ్యురీ నుంచి ఏనుగులు గ్రామాల వైపు వస్తున్నాయి. రైతులు వన్యప్రాణుల నుంచి పంటలకు రక్షణగా కరెంటు తీగలను అమర్చుతుండటంతో అవి విద్యుత్‌ షాక్‌కు గురై మరణిస్తున్నాయి. 

కౌండిన్యలోకి రెండు రాష్ట్రాల ఏనుగులు..
అడవిలోని దట్టమైన మోర్ధనా అభయారణ్యంలోకి ఏనుగులు వెళితే అక్కడ తమిళనాడు అటవీ శాఖ సిబ్బంది రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరుపుతున్నారు. దీంతో తమిళనాడు ప్రాంతంలోని ఏనుగులు సైతం కౌండిన్య వైపునకు వచ్చి చేరుతున్నాయి. ఇక కర్ణాటక నుంచి ఏనుగులు గుడుపల్లి, కుప్పం మీదుగా ఇదే అడవిలోకి వచ్చి చేరుతున్నాయి. ప్రస్తుతం పలమనేరు కౌండిన్య అభయారణ్యంలో మూడు గుంపులుగా 36 ఏనుగులు సంచరిస్తున్నాయి. తమిళనాడు మోర్థన అభయారణ్యం నుంచి 26 ఏనుగులు తరచూ  వచ్చి వెళుతున్నాయి. ఇక 24 ఏనుగులు కర్ణాటక నుంచి కుప్పం ఫారెస్ట్‌లోకి 2 నెలల క్రితం రాగా అటవీ సిబ్బంది వాటిని తిరిగి కర్ణాటక అడవుల్లోకి మళ్లించారు. మేత కోసం అటవీ శాఖ ఏర్పాటు చేసిన సోలార్‌ ఫెన్సింగ్, ఎలిఫేంట్‌ ట్రెంచ్‌లను ధ్వంసం చేసి మరీ ఏనుగులు బయటకు వచ్చేస్తున్నాయి 

16 గజరాజుల మృత్యువాత..
అడవిని దాటి మేత కోసం వచ్చిన 16 ఏనుగులు ఇప్పటిదాకా కరెంట్‌ షాక్‌లకు గురవడం, నీటికొలనుల్లో పడిపోవడం, మదపుటేనుగుల దాడి చేయడంతో మృతి చెందాయి. ఇక గుంపులను వీటి ఒంటరిగా సంచరించే మదపుటేనుగులను అడవిలోకి మళ్లించేందుకు రైతులు వాటిపైకి టైర్లను కాల్చి వేస్తున్నారు. ఒక్కో సందర్భంలో రాళ్లు విసరడం, బాణాసంచా పేల్చడంతో అవి మనషులపై కోపాన్ని పెంచుకుని దాడులు చేస్తున్నాయి. 

జీపీఎస్‌ సిస్టంతో గజరాజులకు చెక్‌..
కౌండిన్య అభయారణ్యం 250 కి.మీ. మేరకు వ్యాపించి ఉంది. దీంతో ఏనుగుల జాడను గుర్తిం చేందుకు జీపీఎస్‌ చిప్‌ సిస్టంను ఏర్పాటు చేస్తున్నట్లు అటవీ శాఖ గతంలో తెలిపింది. ఇందుకోసం కౌండిన్యలో నెట్‌వర్క్‌ పనిచేసేలా శక్తివంతమైన టవర్‌లను నిర్మించాల్సి ఉంటుంది. ఆపై ఎలిఫేంట్‌ ట్రాకింగ్‌ యాప్‌ను తయారు చేసి దీన్ని అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, ట్రాకర్ల స్మార్ట్‌ఫోన్లలో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే ఏనుగులు ఏ ప్రాంతంలో ఉన్నాయనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.   ఏనుగుల గుంపును వెంటనే ఎలిఫెంట్‌ ట్రాకర్స్‌ వాటిని అడవిలోకి మళ్లించవచ్చు. అలాగే, కౌండిన్య అభయారణ్యం 3 రాష్ట్రాల పరిధిలో ఉండటంతో 3 రాష్ట్రాలు కలసి ఎలిఫేంట్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. 

>
మరిన్ని వార్తలు