తొక్కి పడేస్తున్నాయ్‌..! 

19 Sep, 2020 10:28 IST|Sakshi
జంబాడ సమీపంలోని పంట పొలాల్లో ఏనుగుల గుంపు     

జంబాడ పంట పొలాల్లో ఏనుగుల సంచారం 

వరిచేను నాశనం చేస్తున్నాయని గిరిజనుల ఆందోళన

అప్రమత్తం చేస్తున్న అటవీశాఖ అధికారులు  

ఎల్‌.ఎన్‌.పేట: మండలంలోని జంబాడ, ఇరుకురాయిగూడ, సూదిరాయిగూడ గిరిజన గ్రామాల సమీపంలో నాలుగు ఏనుగుల గుంపు నాలుగు రోజులుగా సంచరిస్తున్నాయి. పగలంతా సమీపంలోని కొండల్లో ఉంటూ సాయంత్రానికి దిగువ ప్రాంతానికి వచ్చి పంట పొలాలను తొక్కి నాశనం చేస్తున్నాయని బాధిత రైతులు పాలక చిన్నవాడు, ఉయ్యక వైకుంఠరావు, నిమ్మక నూకరాజు, పాలక మల్లేశ్వరావు, నిమ్మక లక్ష్మణరావు, కోలక రాములమ్మ తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని వాపోయారు.

జంబాడ  సమీపంలోని ఎర్రచెరువు లోపల ఉన్న కొండలు, అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు తిష్ట వేస్తున్నాయని స్థానికులు చెపుతున్నారు. పైడి మంజులకు చెందిన మామిడి తోటలోకి వెళ్లిన ఏనుగుల గుంపు  కొమ్మలు విరిచేయటంతో పాటు నీలగిరి మొక్కలను కాలితో తొక్కినాశనం చేశాయి. నాలుగైదేళ్లుగా ప్రతిసారీ వరిచేను నాట్లు వేసిన తరువాత, కోత సమయానికి ఏనుగులు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఏనుగుల గుంపు గిరిజన గ్రామాల్లోకి వెళ్లకుండా ట్రాకర్లతో కాపలా ఏర్పాటు చేశామని అటవీశాఖ సరుబుజ్జిలి సెక్షన్‌ అధికారి సాయిరాం మహాపాత్రో చెప్పారు. పంట పొలాల్లోకి వచ్చిన ఏనుగులను దారి మళ్లించి కొండల్లోకి వెళ్లేలా చేస్తున్నామన్నారు. గిరిజన రైతులను అప్రమత్తం చేస్తూ ప్రాణనష్టం లేకుండా అటవీశాఖ ఉద్యోగులు, ట్రాకర్లు నిరంతరం ఏనుగులు కదలికలను గమనిస్తున్నారని తెలిపారు.   

మరిన్ని వార్తలు