త్వరలో ఇళ్ల దరఖాస్తుదారులకు అర్హత ధ్రువీకరణ పత్రాలు

15 Oct, 2020 03:48 IST|Sakshi

 కార్యాచరణ రూపొందించాలని అధికారులకు మంత్రి బొత్స ఆదేశం  

సాక్షి, అమరావతి: ఏపీ టిడ్కో ద్వారా పట్టణ ప్రాంతాల్లో 365, 430 చదరపు గజాల్లో నిర్మిస్తున్న ఫ్లాట్‌ల దరఖాస్తుదారులకు 10 రోజుల్లో అర్హత ధ్రువీకరణ పత్రాలు అందించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ప్రత్యేక కార్యదర్శి వి.రామమనోహర్‌రావు, టిడ్కో ఎండీ శ్రీధర్‌ తదితరులతో కలిసి మంత్రి బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మెప్మా అధికారుల ద్వారా లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు సులభంగా లభించేలా చూడాలని సూచించారు.

ఈ కాలనీల్లో మౌలిక వసతుల కల్పన పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వరద నీరు తగ్గుముఖం పట్టగానే.. పట్టణాల్లో యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య చర్యలు చేపట్టాలని మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ప్రతి ప్రాంతంలోనూ పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరంగా జరగాలన్నారు. అనధికారిక లే అవుట్లు, అక్రమ కట్టడాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనధికారిక లే అవుట్లు, భవనాల గుర్తింపు, ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని సూచించారు.  

మరిన్ని వార్తలు