పర్యాటకం..ప్రగతి పరుగు! 

23 Apr, 2022 16:01 IST|Sakshi

టూరిజం స్పాట్‌గా కొల్లేరు పక్షుల కేంద్రాలు

పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి రెండు జిల్లాల్లో అనేక అవకాశాలు

ప్రభుత్వానికి మంచి ఆదాయ వనరుగా మారే అవకాశం

సహజసిద్ధ ప్రకృతి ప్రాంతాలు, ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రాలతో అలరారుతున్న ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొల్లేరు చిత్తడి నేలల ప్రాంతం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తరించి ఉంది. జీవ వైవిధ్యానికి నెలవైన ఈ ప్రాంతం విదేశీ, స్వదేశీ పక్షులకు స్వర్గధామంగా మారింది. కొల్లేరు సరస్సు పెలికాన్, పెయింటెడ్‌ స్ట్రాక్‌ వంటి 189 రకాల పక్షులకు ఆవాసంగా ఉంది. కైకలూరు మండలం ఆటపాక పక్షుల విహార కేంద్రంలో బోటు షికారు చేస్తూ వేలాది పక్షుల కేరింతలను ఆస్వాదించవచ్చు. ఏలూరు మండలం మాధవాపురం పక్షుల కేంద్రాన్ని అటవీశాఖ నూతనంగా అభివృద్ధి పరచింది.  

రిజం సర్కిల్‌గా కొల్లేరు
కొల్లేరులో వృక్షజాలం, జంతుజాలం ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఆస్ట్రేలియా, సైబీరియా, ఈజిప్ట్, ఫిలిప్పీన్స్‌ దేశాల నుంచి ప్రతి ఏటా వలస పక్షులు విచ్చేస్తాయి. వీటిలో ప్రధానమైనది పెలికాన్‌ పక్షి. దీని పేరుతో ఆటపాక పక్షుల కేంద్రానికి పెలికాన్‌ ప్యారడైజ్‌గా నామకరణం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం మీదుగా ఏలూరు జిల్లా చేరే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి నాటికి కొల్లేరు సర్కారు కాల్వపై పెద్దింట్లమ్మ వారధి నిర్మాణం పూర్తి కానుంది. రానున్న రోజుల్లో కొల్లేరును టూరిజం సర్కిల్‌గా ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి ఆదాయ మార్గంగా మారుతుంది. త్వరలో పూర్తికానున్న పోలవరం ప్రాజెక్టు కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే అవకాశముంది. పశ్చిమగోదావరి జిల్లాలో కొలువైన పేరుపాలెం బీచ్‌ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే ప్రాంతం కావడం గమనార్హం.

ప్రఖ్యాతఆధ్యాత్మిక క్షేత్రాలు
పర్యాటక ప్రాంతాలతో పాటు ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రాలు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొలువై ఉన్నాయి.  యాత్రికులకు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. ఏలూరు జిల్లాలో ద్వారకాతిరుమల గొప్ప దర్శనీయ స్థలంగా పేరుగడించింది. అమ్మవార్ల విషయంలో భీమవరం మావుళ్లమ్మ, కొల్లేటికోట పెద్దింట్లమ్మలను భక్తులు కొంగుబంగారంగా కొలుస్తున్నారు. ఇక పంచారామాల్లో రెండు క్షేత్రాలు భీమవరం, పాలకొల్లులోనే కొలువై ఉన్నాయి.

భీమవరంలోని సోమేశ్వరస్వామి ఆలయం, పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం దర్శనీయ స్థలాల్లో ముఖ్యమైనవి. జంగారెడ్డిగూడెం మద్ది ఆంజనేయస్వామి, గోకుల తిరుమల పారిజాత క్షేత్రం, ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం పెనుగొండ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి దేవస్థానం ప్రసిద్ధి చెందిన దర్శినీయ స్థలాలుగా చెప్పుకోవచ్చు. వీటన్నింటికి బస్సు, రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అటవీ ప్రాంతంలో కొలువైన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయ సందర్శనంలో భాగంగా ఆ ప్రాంతానికి ప్రయాణం భక్తులకు ఆహ్లాదకరంగానూ సాగుతుంది. నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లిలో కొలువైన శోభనాచలస్వామి ఆలయం వేల సంవత్సరాలుగా భక్తుల తాకిడితో అలరారుతోంది. 

ప్రకృతి రమణీయత, ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రాలకు నెలవైన ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యాటకం పరుగులు తీయనుంది. కృష్ణాజిల్లా నుంచి ఏలూరు జిల్లాలో కలిసిన కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల్లో చూడచక్కని ప్రదేశాలు అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రకృతి రమణీయతకు ఆలవాలమైన కొల్లేరు ప్రాంతం, ఆటపాక, మాధవాపురం పక్షుల కేంద్రాలు, ప్రఖ్యాత దేవస్థానాలైన ద్వారకాతిరుమల, పెద్దింట్లమ్మ ఆలయం, భీమవరంలోని మావుళ్లమ్మ ఆలయం, పశ్చిమగోదావరి జిల్లాలో కొలువైన పంచారామ క్షేత్రాలు, పేరుపాలెం బీచ్, ఏలూరు జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతం, పోలవరం ప్రాజెక్టు, ఆగిరిపల్లిలోని సోభనాచల స్వామి ఆలయం ఇలా పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాలు అనేకం. పర్యాటక అభివృద్ధిపై దృష్టి పెడితే టూరిజం స్పాట్‌గా ఈ ప్రాంతాలు మంచి ఆదాయ వనరులుగా మారే అవకాశముంది.     
– కైకలూరు

పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి చర్యలు  
కొల్లేరు ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధికి అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ముఖ్యంగా పక్షుల విహార కేంద్రాల వద్ద ఎకో టూరిజం అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేశాం. యాత్రికుల నుంచి టిక్కెట్ల రూపంలో వచ్చిన నగదుతో పర్యాటకులకు సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఏలూరు జిల్లాలో కొల్లేరు ప్రాంతాలన్నీ విలీనం కావడంతో మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. ఆటపాక, మాధవాపురం పక్షుల కేంద్రాలను అభివృద్ధి చేశాం.                    
– ఎస్‌వీవీ కుమార్, ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్, ఏలూరు

మరిన్ని వార్తలు