ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల కేసు విచారణ 19కి వాయిదా

10 Apr, 2021 04:15 IST|Sakshi

ఫలితాల వెల్లడికి అనుమతినివ్వాలని హైకోర్టును కోరిన ఏజీ శ్రీరామ్‌ 

సాక్షి, అమరావతి: ఏలూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వంతోపాటు మరికొందరు హైకోర్టులో దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. అంతకుముందు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. 2020 ఫిబ్రవరి 3న తుది ఓటర్ల జాబితా ప్రచురించామని తెలిపారు. అభ్యంతరాల సమర్పణకు గడువు కూడా ఇచ్చామన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చే వరకు తమ దృష్టికి వచ్చిన లోపాలన్నింటినీ సవరిస్తూనే ఉన్నామని కోర్టుకు వివరించారు. ఎన్నికలు కూడా నిర్వహించామని, అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఫలితాలను వెల్లడించలేదన్నారు.

ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారని, ఫలితాల వెల్లడికి అనుమతినిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్ధించారు. అయితే ఇతర న్యాయవాదుల వాదనల నిమిత్తం విచారణ 19కి వాయిదా పడింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో తప్పులున్నాయంటూ ఏలూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్‌ జడ్జి ఉత్తర్వులిచి్చన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు