ఏలూరులో ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌

10 Mar, 2021 03:26 IST|Sakshi

సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై హైకోర్టు ధర్మాసనం స్టే

ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన మాత్రం చేపట్టొద్దు

తదుపరి విచారణ 23కి వాయిదా

సాక్షి, అమరావతి: ఏలూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలిగాయి. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నిక నిర్వహించవచ్చని, ఓట్ల లెక్కింపు మాత్రం చేపట్టవద్దని, ఫలితాలను ప్రకటించవద్దని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఏలూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికపై స్టే విధిస్తూ సింగిల్‌ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులపై ధర్మాసనం మంగళవారం స్టే విధించింది.  బ్యాలెట్‌ బాక్సులను జాగ్రత్త చేయాలని, హైకోర్టు ఆదేశిస్తే కానీ వాటిని తెరవడానికి వీల్లేదని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ప్రభుత్వం, ఇతరులు దాఖలు చేసిన అప్పీళ్లను సుదీర్ఘ కాలం పెండింగ్‌లో ఉంచదలచుకోలేదని ఈ సందర్భంగా పేర్కొంది.  ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని తెలిపింది.

ఎన్నికల నిలిపివేతపై సర్కార్‌ అప్పీల్‌...
ఏలూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఓటర్ల జాబితాలో తప్పులను సవరించాలంటూ గత ఏడాది హైకోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు అమలు చేయలేదంటూ టీడీపీ నేత ఎస్‌వీ చిరంజీవి, మరో 33 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు ఓటర్ల జాబితాలో తప్పులను సవరించేందుకు వీలుగా కార్పొరేషన్‌ ఎన్నికను నిలిపేస్తూ సోమవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీన్ని సవాలు చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, ఏలూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌లు లంచ్‌మోషన్‌ రూపంలో అత్యవసర అప్పీల్‌ దాఖలు దాఖలు చేశారు. ఇలాగే మరో వ్యక్తి కూడా అప్పీల్‌ దాఖలు చేశారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌  ఎస్‌.శ్రీరామ్, టీడీపీ నేతలు ఎస్‌వీ చిరంజీవి తదితరుల తరఫున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. 

చిలకలూరిపేట ఎన్నికలకు హైకోర్టు ఓకే
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మునిసిపల్‌ పాలకవర్గ ఎన్నికల నిర్వహణకు కూడా హైకోర్టు అనుమతి ఇచ్చింది. షెడ్యూల్‌ ప్రకారం ఎన్నిక నిర్వహించుకోవచ్చన్న న్యాయస్థానం ఎన్నికల ఫలితాలు మాత్రం తుది తీర్పునకు లోబడి ఉంటాయని తెలిపింది. ఈ విషయాన్ని అభ్యర్థులకు అందజేసే ధ్రువీకరణ పత్రాల్లో స్పష్టంగా పేర్కొనాలని రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు మంగళవారం ఉత్తర్వులిచ్చారు. మానుకొండవారిపాలెం, పసుమర్రు, గణపవరం పంచాయతీలను చిలకలూరిపేట మునిసిపాలిటీలో విలీనం చేస్తూ గతేడాది జనవరిలో పంచాయతీరాజ్, పురపాలక శాఖలు జారీ చేసిన జీవోలను సవాల్‌ చేస్తూæటి.పూర్ణచంద్రరావు, జి.రవితేజ పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు ఆ జీవోల అమలును నిలిపేస్తూ గతేడాది అక్టోబర్‌లో మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీనిపై విచారణ చేపట్టాలని ప్రభుత్వ న్యాయవాది సత్యశివాజీ మంగళవారం న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులను అభ్యర్థించారు 

మరిన్ని వార్తలు