ఏలూరు ఘటన: 20 మంది డిశ్చార్జ్‌

6 Dec, 2020 07:29 IST|Sakshi

సాక్షి, ఏలూరు: నగరంలోని వన్‌టౌన్‌ ఏరియాలో అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన బాధితులు డిశ్చార్జ్‌ అవుతున్నారు. శనివారం అర్ధరాత్రి డాక్టర్ల బృందం పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించిన అనంతరం.. 20 మంది బాధితులు పూర్తి ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించే విషయంలో డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రత్యేక పర్యవేక్షణలో ఏలూరు కార్పొరేషన్‌ అధికారులతో సమావేశం నిర్వహించి పరిస్థితిని మోనిటరింగ్ చేయడానికి మంత్రి ఆదేశాలు ఇచ్చారు.  చదవండి: (ఏలూరులో కలకలం.. పలువురికి అస్వస్థత)

ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంచార్జి డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఏవీఆర్‌ పర్యవేక్షణలో వైద్యుల బృందం ప్రత్యేకంగా వైద్యసేవలు అందిస్తోంది. ఈ మేరకు వైద్యుల బృందం మీడియాతో మాట్లాడుతూ.. ఏలూరు నగరంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దు. అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. మంత్రి ఆళ్ల నాని ఆదేశాల మేరకు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మామిళ్ళపల్లి జై ప్రకాష్ ప్రభుత్వ ఆస్పత్రిలో మకాం వేసి బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు సమన్వయం చేస్తున్నారు. ఏలూరులో అనారోగ్యానికి గురైన ప్రాంతాలలో ప్రత్యేకంగా మెడికల్ టీమ్‌లు, ఇంటింటి సర్వే చేపట్టామని తెలిపారు. కాగా, మంత్రి ఆదేశాల మేరకు ఏలూరు ఆర్డీవో పనబాక రచన, ఎమ్మార్వో సోమశేఖర్ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. 

మరిన్ని వార్తలు