తెనాలిలో డాక్టర్‌ వైఎస్సార్‌ కళాపరిషత్‌ ఆవిర్భావం

30 Jun, 2022 05:05 IST|Sakshi
మాట్లాడుతున్న సత్యనారాయణ శెట్టి తదితరులు

10 నుంచి జాతీయస్థాయి నాటికల పోటీల నిర్వహణ

తెనాలి: దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరుతో తెనాలిలో కళాపరిషత్‌ ఏర్పాటైంది. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కళాపరిషత్‌ ఆధ్వర్యంలో జూలై 10–13వ తేదీ వరకు ప్రథమ జాతీయస్థాయి నాటికల పోటీలను ప్రఖ్య చిల్డ్రన్‌ ఆర్ట్స్‌ అకాడమీ, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం సంయుక్తంగా నిర్వహించనున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షుడు ఎం.సత్యనారాయణశెట్టి బుధవారం వెల్లడించారు.

నాటిక పోటీల ప్రారంభ సభకు మంత్రులు రోజా, అంబటి రాంబాబు, విడదల రజిని, డాక్టర్‌ మేరుగ నాగార్జున, స్థానిక ఎమ్మెల్యే హాజరవుతారని చెప్పారు. అదే రోజు 2019, 2020, 2021 సంవత్సరాలకుగాను వేదగంగోత్రి ప్రసాద్, జొన్నల పేరిరెడ్డి, బొమ్మారెడ్డి ప్రభాకరరెడ్డికి డాక్టర్‌ వైఎస్సార్‌ జీవన సాఫల్య పురస్కారాలను ప్రదానం చేస్తామని చెప్పారు. 13న పోతవఝుల పురుషోత్తమశర్మకు 2022 సంవత్సరానికి ఇదే పురస్కారాన్ని బహూకరిస్తామని తెలిపారు.

కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి గరికపాటి సుబ్బారావు మాట్లాడుతూ..10న ‘స్వర్గానికి వంతెన, ‘వృద్ధోపనిషత్‌ నాటికలను, 11న ‘ది డెత్‌ ఆఫ్‌ ఏ మేనిటర్, ‘అజ్ఞాత వాసం’ నాటికలను, 12న ‘ఐదు పదులు, ‘మనిషి మంచోడే నాటికలను, 13న ‘అగ్నిసాక్షి, ‘బహురూపి’ నాటికలను ప్రదర్శించనున్నట్లు వివరించారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ పోటీలు జరుగుతాయని చెప్పారు. 

మరిన్ని వార్తలు