కారా మాస్టారు కన్నుమూత: సీఎం జగన్‌ సంతాపం

4 Jun, 2021 11:41 IST|Sakshi

  కారా మాస్టారుగా  పాపులర్‌ అయిన కాళీపట్నం రామారావు

 దిగ్భ్రాంతిలో సాహితీలోకం

సాక్షి, శ్రీకాకుళం: కారా మాస్టారుగా ప్రసిద్ధి పొందిన ప్రముఖ రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూశారు. కథానిలయం వ్యవస్థాపకులు, కేంద్రసాహిత్య అవార్డు గ్రహీత శ్రీకాకుళంలోని స్వగృహంలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు సాహితీలోకం తీవ్ర దిగ్ర్భాంతిలో మునిగిపోయింది. కథా సాహిత్యానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకొంటూ రచయితలు, కవులు, కళాకారులు నివాళులర్పించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిదంటూ పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కథకు చిరునామాగా, 'కథానిలయం' పేరుతో భావి తరాల కోసం సాహితీ సంపదను కాపాడిన సాహితీ మూర్తి కారా మాస్టారు అంటూ కొనియాడారు.

1924లో శ్రీకాకుళం జిల్లా మురపాకలో జన్మించారు కాళీపట్నం రామారావు. తన దైన శైలిలో రచనా వ్యాసంగాన్ని కొనసాగించిన ఆయన వేలాది మంది శిష్యులు, అభిమానులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా 1964లో రాసిన యజ్ఞం కథ ఆయన విశేష ఖ్యాతిని తీసుకొచ్చింది. కథా రచయితగా తెలుగు రచనల ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత ఆయనది. ఫ్యూడల్ వ్యవస్థలోని దోపిడికి ‘యజ్ఞం’ అద్దంపడుతుంది. అందుకే ఈ రచన రష్యాలో అనువదింపబడి ప్రపంచ గుర్తింపు పొందింది.

భావితరాలను దృష్టిపెట్టుకుని ఫిబ్రవరి 22, 1997లో శ్రీకాకుళంలో కథానిలయం స్థాపించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ద్వారా సమకూరిన డబ్బు, మరికొందరు సాహితీవేత్తల సహకారంతో 800 కథల పుస్తకాలతో ఆరంభమైన ఈ కథా నిలయం లక్ష పుస్తకాలతో అలరారుతుండటం విశేషం. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఆయన సరళమైన రచన శైలితో వేలాది అభిమానులను ఆకట్టుకున్నారు. కుట్ర, రాగమయి, జీవధార, కారా కథలు, రుతుపవనాలు వంటి ఆయన రచనలూ ఆదరణ పొందాయి.

సీఎం జగన్‌ సంతాపం
సాహిత్య అకాడమీ గ్రహీత,  కారా మాస్టారుగా  పేరొందిన కాళీపట్నం రామారావు మృతిపై  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి విచారం వ్యక్తంచేశారు. చిన్న కథలతో, తనదైన కథా శైలితో ఆకట్టుకున్న ఉత్తరాంధ్రలోని సాహిత్యకారుల్లో ఆయన ప్రముఖుడని సీఎం గుర్తు చేశారు. కారా మాస్టారు కుటుంబ సభ్యులకు సీఎం వైఎస్‌ జగన్‌ తన సంతాపాన్ని తెలియజేశారు. 

మరిన్ని వార్తలు